Share News

నిన్ను ఓడిస్తాం..!

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:03 AM

‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో పని చేశాం. 2019లో నీ గెలుపు కోసం కృషి చేశాం. ఈ ఎన్నికల్లో నిన్ను మేమే ఓడిస్తాం’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి వైసీపీ అసమ్మతి నాయకులు వైసీపీ నాయకులు వార్నింగ్‌ ఇచ్చారు. అనంతపురం నగరంలోని యాదవ కల్యాణ మండపంలో కనగానపల్లి మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం సమావేశమయ్యారు.

నిన్ను ఓడిస్తాం..!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ వ్యవసాయ మిషన మెంబర్‌ బోయ రాజారామ్‌

రాప్తాడు ఎమ్మెల్యేకి అసమ్మతి నాయకుల వార్నింగ్‌

కష్టకాలంలో పనిచేస్తే.. మోసగించారని మండిపాటు

రాప్తాడు, మార్చి 27: ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో పని చేశాం. 2019లో నీ గెలుపు కోసం కృషి చేశాం. ఈ ఎన్నికల్లో నిన్ను మేమే ఓడిస్తాం’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి వైసీపీ అసమ్మతి నాయకులు వైసీపీ నాయకులు వార్నింగ్‌ ఇచ్చారు. అనంతపురం నగరంలోని యాదవ కల్యాణ మండపంలో కనగానపల్లి మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య అధ్యక్షతన బుధవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను గత ఎన్నికల్లో వాడుకుని గెలిచారని, ఆ తరువాత కష్టపడిన వారిని గాలికి వదిలేసి మోసం చేశారని బోయ రాజారాం అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రకా్‌షరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే కుటుంబం వెంట ఉన్న బీసీ నాయకులు ఏ ఒక్కరూ బాగుపడలేదని, పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, సొంత పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచారని ద్వజమెత్తారు. ‘నిన్ను నమ్మి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక మమ్మల్ని టార్గెట్‌ చేశావు. నిన్ను ఓడించడమే నా టార్గెట్‌’ అని శపథం చేశారు. ‘గతంలో నువ్వు రామగిరికి వెళ్లాలంటే బయపడేవాడివి. మా ఆడోళ్ల కొంగుల చాటున నిన్ను మేమంతా అక్కడికి ధైర్యంగా తీసుకెళ్లాం. అధికారంలోకి వచ్చాక గుంటూరోన్ని తీసుకొచ్చి అనంతపురంలో తొడలు కొట్టిచ్చావు. నీ కోసం కష్టపడినోళ్లని అవమానించావు..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో శంకర్‌నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ విశ్వేశ్వర్‌రెడ్డిని ఓడించేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోలేదా..? మంత్రి పదవి కోసం ఆనాడు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. ప్రకా్‌షరెడ్డి వైఎస్‌ కుటుంబానికి విధేయుడు కాడని, ప్రకా్‌షరెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తేనే రెడ్డి సామాజిక వర్గం కూడా బాగుపడుతుందని అన్నారు. ఈ విషయాన్ని జగన గమనించాలన్నారు.

- కష్టకాలంలో పని చేసిన వారిని తోపుదుర్తి కుటుంబం మోసగించిందని బిల్లే నరేంద్ర అన్నారు. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తారని పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టారని ఆరోపించారు. ఎన్నికల రావడంతో ఇప్పుడు తమ ఇళ్ల దగ్గరకు వస్తున్నారని విమర్శించారు. రాజ్య హింస అని పత్రికల్లో చదివేవాళ్లమని, ఇప్పుడు ప్రత్యక్షంగా రాప్తాడులో అనుభవిస్తున్నామని అన్నారు. ప్రకా్‌షరెడ్డీ పతనం ప్రారంభమైందని, తామందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల్లో ఎవరైనా ఒకరిని ఎన్నికల్లో నిలబెట్టుకుంటామని అన్నారు.

- గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారిని, డబ్బు ఖర్చు పెట్టిన వారిని ప్రకా్‌షరెడ్డి బాగా దెబ్బ కొట్డాడని, ఒక లీడర్‌ను ఓటరుగా మార్చిన ఘనత రాష్ట్రంలో ఒక్క ప్రకా్‌షరెడ్డికే దక్కుతుందని కనగానపల్లి మాజీ జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య మండిపడ్డారు. కష్టకాలంలో వైసీపీకి పని చేసి, కేసులు పెట్టించుకుని పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చాక ప్రకాశరెడ్డి అంతకంటే ఎక్కువగా హింసించారని వాపోయారు. గతంలో ఓటు వేసిన వారే ప్రకాశరెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో వైసీపీ అసమ్మతి నాయకులు చంద్రాచార్ల న్యాయవాది హరి, రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప, నాగభూషణ, భానుగోట లక్ష్మినారాయణ, కుంటిమద్ది ఆనంద్‌, తగరకుంట వినయ్‌, కొట్టాలపల్లి శ్రీరాములు, దాసరి ఆదినారాయణ, యలక్కుంట్ల నందమోహనరెడ్డి, భానుకోట శివారెడ్డి, గాదికుంట పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సమావేశంలో పాల్గొన్న ఐక్య కులాల వేదిక నాయకులు విమర్శించారు.

Updated Date - Mar 28 , 2024 | 01:03 AM