Share News

హెచడీహళ్లిలో నీటికి కటకట

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:02 AM

మండలంలోని హెచడీహళ్లి పంచాయతీ పరిధిలోని గ్రా మస్థులు తాగు, సాగు నీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. గత సంవ త్సరం వర్షాలు కురవక బోర్లలో నీరు రావడం లేదు.

హెచడీహళ్లిలో నీటికి కటకట
చుక్కనీరు పడని బోరు

ఎన్నిబోర్లు వేసినా దొరకని నీరు

ఆందోళన చెందుతున్న రైతులు

అగళి, మార్చి 27 : మండలంలోని హెచడీహళ్లి పంచాయతీ పరిధిలోని గ్రా మస్థులు తాగు, సాగు నీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. గత సంవ త్సరం వర్షాలు కురవక బోర్లలో నీరు రావడం లేదు. దీంతో పంటలు సాగు చేసు కోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచడీహళ్లి పంచాయతీ పరిధిలో గాయత్రి కాలనీ, తండా, వడ్రహట్టి, దేవరహళ్లి, హుళ్లికెర గ్రామాలున్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 550 కుటుంబాలుండగా, దాదాపు రెండు వేల జనాభా ఉంది. అయితే పంచాయతీ పరిధిలో గతంలో వేసిన పాత 30 బోర్లు ఎండిపోయాయి. కొన్నింటిలో అరకొరగా నీరు వస్తోంది. దీంతో రబీ సాగు కోసం ఈ మూడు నెలల కాలంలో కొత్తగా 25 బోర్లు తవ్వించారు. చాలా చుక్క నీరు కూడా నీరు కూడా లభ్యం కాలేదు. కొన్నింటిలో మాత్రమే అరకొరగా నీరు వస్తోందని ఆ పంచాయతీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో 800 నుంచి వెయ్యి అడుగుల వరకు బోరు తవ్వినా నీరు దొరకడం కష్టంగా ఉందంటున్నారు. దీంతో తాగు నీటికి సైతం తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. హెచడీ హళ్లి గ్రామ పంచాయతీ అగళి మండలంలో కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉం ది. పలు సమస్యలతో కొట్టుమిట్టాడు తోంది. రైతులు జయమ్మ, దాదన్న, బెట్టప్ప, రాజునాయక్‌, మల్లికార్జున, రాజేష్‌ తదితరులు మాట్లాడుతూ... బోరుబావుల కింద వక్క తోటలు, మామిడి, జామ, బొప్పాయి తదితర పంటలను సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. రెండేళ్ల కిందట ఈ ప్రాంతంలో వర్షాలు బాగా కురి శాయన్నారు. దీంతో చెరువులు, కుంటలు నిండిపోవడంతో భూగర్భ జలమ ట్ట పెరిగి బోరుబావుల్లో నీరు సమృద్ధిగా వచ్చేదన్నారు. అయితే సంవత్సరకాలంగా వ ర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. నీరు లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయా యన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పంచాయతీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు చేపట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

హంద్రీనీవా జలాలతో చెరువులు నింపాలి - దాదన్న, రైతు, దేవరహళ్లి

నాకు ఐదెకరాల పొలం ఉంది. ఆరు బోర్లు వేశా. నాలుగు బోర్లు ఫెయిల్‌ అయ్యాయి. మిగతా రెండు బోర్లలో అరకొరగా నీరు వస్తోంది. ఆ నీటితో పంటలు సాగు చేస్తున్నాం. హంద్రీనీవా జలాలను అగళి మండలానికి తెప్పిస్తే భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా వస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం- బెట్టప్ప, రైతు, గాయత్రికాలనీ

నాకు ఐదెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం పొలంలో గత 15రోజుల క్రితం ఒక రెండు బోర్లు వేయించా. అందులో ఒకదానిలో చుక్కనీరు కూడా రాలేదు. రెండోదానిలో అరకొర నీరు వస్తోంది. ఆ నీటితో పంటలు సాగుస్తున్నాం. మా పంచాయతీ పరిధిలో 800నుంచి వెయ్యి అడుగులు బోరు తవ్వించినా నీరు పడటంలేదు. దీంతో ఇక్కడి రైతులం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. కుటుంబ పోషణ ఎలా అని ఆందోళన కలుగుతోంది.

Updated Date - Mar 28 , 2024 | 12:02 AM