Share News

Ap elections: ఇంటికి వద్దన్నా ఓటు..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:40 PM

ఇంటి వద్దకే ఓటులో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివ్యాంగులు, 85 ఏళ్లుపైబడిన వారికే ఇళ్ల వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హిందూపురం మండలంలో ఎలాంటి వైకల్యమూ లేని చిన్నవయసు వారికీ ఇంటి వద్దకే ఓటు హక్కు కల్పిస్తామంటూ బీఎల్‌ఓలు ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో ఓటర్లు అవాక్కవుతున్నారు. హిందూపురం మండలం వీవర్స్‌ కాలనీలోని 134, 135, 136 పోలింగ్‌ బూతలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. వాటి పరిధిలోని బీఎల్‌ఓలు బుధవారం ఓటర్ల ఇళ్ల వద్దకెళ్లి 13డి ఫారాలు ఇచ్చారు.

Ap elections: ఇంటికి వద్దన్నా ఓటు..!

బాగున్నవారికీ ఇంటి వద్దకా?.. బీఎల్‌ఓల రాకతో వెలుగులోకి..

హిందూపురం, ఏప్రిల్‌ 24: ఇంటి వద్దకే ఓటులో అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివ్యాంగులు, 85 ఏళ్లుపైబడిన వారికే ఇళ్ల వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. హిందూపురం మండలంలో ఎలాంటి వైకల్యమూ లేని చిన్నవయసు వారికీ ఇంటి వద్దకే ఓటు హక్కు కల్పిస్తామంటూ బీఎల్‌ఓలు ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో ఓటర్లు అవాక్కవుతున్నారు. హిందూపురం మండలం వీవర్స్‌ కాలనీలోని 134, 135, 136 పోలింగ్‌ బూతలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. వాటి పరిధిలోని బీఎల్‌ఓలు బుధవారం ఓటర్ల ఇళ్ల వద్దకెళ్లి 13డి ఫారాలు ఇచ్చారు. సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. 134 బూత పరిధిలో వి.చిరంజీవికి ఇంటి వద్దే ఓటు వినియోగించుకోవచ్చనీ, 12డి ఫారంలో సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. తనకెందుకు ఇంటివద్దకనీ, పోలింగ్‌ కేంద్రం వద్దకొచ్చి ఓటేస్తానని అతడు చెప్పాడు. పైఅధికారులు చెప్పారనీ, నోటీసు తీసుకుని సంతకం పెట్టాలని బీఎల్‌ఓ కోరారు. అనుమానం వచ్చి సంతకం పెట్టడానికి నిరాకరించారు.


చిరంజీవి వయసు 40 ఏళ్లు, ఎలాంటి వైకల్యమూ లేదు. అయినా ఎందుకిచ్చారో అర్థంకాని పరిస్థితి. అదే ప్రాంతంలో సుగణ వయసు 43 ఏళ్లు. ఈమెకు నోటీసు ఇవ్వడానికి వెళ్లారు. 35 ఏళ్ల నేత్రావతికి 12డి ఫారం తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. వారు ససేమిరా అన్నారు.

కేంద్రానికి 30 నుంచి 40 ఓట్లు..

నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌ బూత పరిధిలో ఇలాంటివి 30 నుంచి 40 ఓట్లు ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బుధవారం మూడు బూతలు మాత్రమే వెలుగులోకి వచ్చాయనీ, పూర్తిగా ఆరాతీస్తే నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వెలుగులోకి వస్తాయో అర్థంకాని పరిస్థితి.


ఈ లెక్కన నియోజకవర్గంలో 250 బూతలున్నాయి. ఇలా 30 నుంచి 40 ఓట్లు లెక్కన కనీసం 10వేల ఓట్లు ఇలాంటివి ఉండవచ్చని టీడీపీ నాయకులు భావిస్తున్నారు.

వలంటీర్ల పనేనా?

ఓటరు జాబితా పరిశీలన సందర్భంగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లారు. ఈ సందర్భంగా ఇలాంటి ట్రిక్‌ చేసినట్లు ఓటర్లు భావిస్తున్నారు. అప్పట్లో బాగున్నా.. వైకల్యముందనీ, తక్కువ వయసున్నా ఎక్కువ ఉన్నట్లు ఆనలైనలో పొందుపరిచారని సమాచారం. అప్పుడు వలంటీర్లు ఇచ్చిన జాబితా మేరకే ప్రస్తుతం నోటీసులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 26న తుది ఓటర్ల జాబితా రానున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు ఇలాంటివి వెలుగులోకి రావడంతో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారని ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సక్రమంగా ఉందా.. లేదా అని టీడీపీ నాయకులు చూసుకుంటున్నారు. ఇలాంటి ట్రిక్‌ చేశారని తెలియదు. బుధవారం బీఎల్‌ఓలు నోటీసులు తీసుకెళ్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు బహిరంగంగా తమకు 10 వేల నుంచి 15వేల ఓట్లు ఫిక్స్‌డ్‌గా ఉన్నాయనీ, అవి ఎలా పడతాయో నెలాఖరున తెలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ఓటరు జాబితాకు సంబంధించి గత వారంలో మంత్రి పెద్దిరెడ్డి హిందూపురం ముఖ్య నేతలను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. తమకు 20వేల ఓట్లు ఫిక్స్‌డ్‌గా ఉన్నాయనీ, తుది ఓటరు జాబితా ప్రకటించాక తెలుస్తుందన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 12డి ఫారాలను అందజేస్తుండడాన్ని బట్టి చూస్తే మంత్రి చెప్పిన మాట నిజమేనని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 24 , 2024 | 11:40 PM