Share News

Peanut problems : నాసులు.. పుచ్చులు..!

ABN , Publish Date - May 25 , 2024 | 12:53 AM

ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కాయలలో నాణ్యత డొల్ల అని తేలింది. నాసులు, పుచ్చులు అధికంగా ఉండటంతో రైతులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం, ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకుల నిర్వాకం ఆదిలోనే బయట పడింది. జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేల్లో శుక్రవారం విత్తన వేరుశనగ పంపిణీని అధికారులు ప్రారంభించారు. కాయలకోసం ఆత్రంగా వచ్చిన రైతులు.. నాణ్యతను చూసి ఉసూరుమన్నారు. శింగనమల మండలం కల్లుమడిలో 100 క్వింటాళ్లు, యాడికి ఆర్బీకేలో 50 క్వింటాళ్లు, అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురం ఆర్బీకేలో 50 క్వింటాళ్ల ...

Peanut problems : నాసులు.. పుచ్చులు..!
Farmers showing substandard seeds in Kallumadi, Shinganamala mandal

ఖరీ్‌ఫకు నాసిరకం వేరుశనగ

బలవంతంగా అంటగట్టే ప్రయత్నం

తొలిరోజే తిరస్కరించిన రైతులు

పర్యవేక్షణ మరిచిన వ్యవసాయ శాఖ

టీడీపీ హయాంలో సర్టిఫైడ్‌ విత్తనం

వైసీపీ వచ్చాక ట్రూతఫుల్‌ పేరిట టోకరా

అనంతపురం అర్బన/యాడికి/శింగనమల, మే 24 : ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కాయలలో నాణ్యత డొల్ల అని తేలింది. నాసులు, పుచ్చులు అధికంగా ఉండటంతో రైతులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం, ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకుల నిర్వాకం ఆదిలోనే బయట పడింది. జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేల్లో శుక్రవారం విత్తన వేరుశనగ పంపిణీని అధికారులు ప్రారంభించారు. కాయలకోసం ఆత్రంగా వచ్చిన రైతులు.. నాణ్యతను చూసి ఉసూరుమన్నారు. శింగనమల మండలం కల్లుమడిలో 100 క్వింటాళ్లు, యాడికి ఆర్బీకేలో 50 క్వింటాళ్లు, అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురం ఆర్బీకేలో 50 క్వింటాళ్ల నాసిరకం విత్తన వేరుశనగను గుర్తించారు. వాటిని స్థానిక అధికారులు వెనక్కి


పంపారు.

ఎప్పుడూ ఇంతే..

వేరుశనగ విత్తన కాయల పంపిణీలో ఏటా నిర్లక్ష్యం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో సర్డిఫైడ్‌ సీడ్‌ను (సీఎస్‌) అందజేసేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే ట్రూతఫుల్‌ లేబుల్‌ పేరుతో (టీఎల్‌) సరఫరాదారుల స్వీయ ధ్రువీకరణతో విత్తన వేరుశనగను సరఫరా చేయడం మొదలు పెట్టారు. పాత పద్ధతిలో విత్తన ధ్రువీకరణ సంస్థ ఆధ్వర్యంలో సర్టిఫికేషన అధికారులు ప్రాసెసింగ్‌ యూనిట్లల్లో నమూనాలను సేకరించేవారు. నాణ్యత బాగుంటేనే సర్టిఫై చేసి.. పంపిణీకి అనుమతించేవారు. కానీ ప్రస్తుతం ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులే ధ్రువీకరించుకుని సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ల వద్ద పర్యవేక్షణకు వ్యవసాయ శాఖ అధికారులను పెట్టినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాలోని పలు ప్రాసెసింగ్‌ యూనిట్లలో నామమాత్రంగా ప్రాసెసింగ్‌ చేసి.. విత్తన వేరుశనగ బస్తాలను ఆర్బీకేలకు పంపుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

రాచేపల్లిలో బలవంతంగా..

శింగనమల మండలం రాచేపల్లి రైతు భరోసా కేంద్రంలో నాసిరకం విత్తన వేరుశనగ కాయలను రైతులు గుర్తించారు. కె-6 బస్తాల్లో పైభాగంలో నాణ్యమైన కాయలు ఉంచి, లోపలి భాగంలో నాసిరం కాయలు ఉంచారని రైతులు వాపోయారు. రైతులు అభ్యంతరం తెలిపినా అధికారులు అంటగట్టడం గమనార్హం. రైతులు పక్కీరప్ప, సూర్యప్రకాశ వాగ్వాదానికి దిగినా, తమకు వచ్చిన స్టాక్‌ ఇదేనని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో చేసేది లేక వారు అవే కాయలను తీసుకువెళ్లారు.

విషయం తెలిసినా..

కొన్ని మండలాల్లో లాట్స్‌లో నాసిరకం విత్తన కాయలు ఉన్నట్లు తేలినా వ్యవసాయ శాఖ అధికారులు వెనక్కి పంపకుండా రైతులకు అంటగడుతున్నారు. ఆర్బీకేల వద్దనే విత్తన కాయలను రైతులు పరిశీలించి, తమకు వద్దని వెనక్కి ఇస్తున్నారు. యాడికి, శింగనమల మండలం కల్లుమడిలో రైతులు తిరస్కరించేదాకా వ్యవహారం బయటపడలేదు. అనంతపురం రూరల్‌ మండలం ఎ.నారాయణపురంలో విత్తన పంపిణీకి ఒక రోజు ముందే రైతులు కాయలను పరిశీలించి.. బాగాలేవని తేల్చారు. దీంతో వాటిని వెనక్కి పంపినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు.


పుచ్చులు.. నాసులు

యాడికి మండలానికి నాణ్యతలేని వేరుశనగ విత్తన కాయలు వచ్చాయి. దీంతో వాటిని తీసుకునేందుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. మండలంలో మొత్తం 600 మంది రైతులు వేరుశనగ విత్తనం కోసం ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన చేసుకున్నారు. ఇప్పటి వరకూ 800 క్వింటాళ్ల విత్తన కాయలు రావడంతో యాడికి ఆర్బీకేలో గుత్తి ఏడీఏ వెంకటరాముడు, ఏఓ మహబూబ్‌బాషా శుక్రవారం విత్తన పంపిణీ ప్రారంభించారు. నాణ్యత పరిశీలించిన రైతులు, విత్తనం బాగలేదని అధికారులకు అక్కడే చెప్పారు. ‘మీరు ఇస్తున్న విత్తనంలో 70 శాతం బాగున్నా మాకు ఆనందమే. కానీ నాసులు, పుచ్చులే ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకుని ఏం చేయాలి..?’ అని ప్రశ్నించారు. దీంతో మూడు రకాల కాయలు వచ్చాయని, నాణ్యత బాగా లేకపోతే కాయలు ఒలచకుండా వెనక్కి ఇవ్వాలని అధికారులు సూచించారు. దీనికి రైతులు అంగీకరించలేదు.

జెర్మినేషన చేయకనే..

విత్తన పంపిణీ ప్రారంభం కంటే ముందు వ్యవసాయశాఖ అధికారులు జెర్మినేషన పరీక్ష నిర్వహించాలి. మొలక శాతాన్ని గుర్తించి, బాగుంటేనే రైతులకు పంపిణీ చేయాలి. కానీ యాడికి మండలంలో జెర్మినేషన ఫలితం రాకముందే విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టారు.

తేడా ఏముంది?

మార్కెట్‌లో వ్యాపారులు అమ్ముతున్న వేరుశనగ ధరకు, ప్రభుత్వ సబ్సిడీ ధరకు పెద్దగా తేడా లేదని రైతులు అంటున్నా రు. ప్రభుత్వం సబ్సిడీ పోనూ 30 కిలోల ప్యాకెట్‌ను రూ.1710 కు అందిస్తోంది. మార్కెట్‌లో 46 కిలోల ప్యాకెట్‌ ధర రూ.2600 ఉంది. కానీ మార్కెట్‌లో విత్తనం కొరత ఉండడంతో ప్రభుత్వం పంపిణీచేసే విత్తన వేరుశనగ కోసం వస్తున్నామని రైతులు అంటున్నారు. ఆర్బీకేల్లో నాణ్యతలేని కాయలను అంటగట్టాలని చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.


నాసులతో ఏం చేయాలి..?

ఆర్బీకేలో పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనంలో నాసులు ఎక్కువగా ఉన్నాయి. పుచ్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటిని తీసుకువెళ్లి ఏం చేయాలి..? మొలకెత్తని విత్తనం నాటి ఏం ప్రయోజనం..? ఆలస్యమైనా పర్వాలేదు. నాణ్యమైన విత్తనాలను ఇవ్వాలి.

- గోపాలకృష్ణ

కత్తిమానుపల్లి నాసిరకాలను అంటగడతారా..?

నాసిరకం కాయలను తెచ్చి రైతులకు అంటగట్టాలని చూడడం దారుణం. ఇ లాంటి విత్తనాన్ని మేము తీసుకోము. అధికారులు పంపిణీ చేస్తున్న కాయ ల్లో 70 శాతం విత్తనాలు బాగున్నా మాకు సంతోషమే. కానీ ఇలాంటివి తీసుకువెళ్లి మేము ఏమి చేయా లి..? అధికారులను ప్రశ్నిస్తే.. ఇప్పుడు తీసుకొని వెళ్లండి. బాగా లేకపోతే వెనక్కి తీసుకురండి అంటున్నారు. కాయ లు ఒలిచిన తర్వాత వారు వెనక్కి తీసుకుంటారా..?

- పుల్లయ్య, కత్తిమానుపల్లి

వెనక్కి వెళుతున్నాం..

ఆర్బీకేలకు వచ్చిన వేరుశనగ కాయలు ఏమీ బాగాలేవు. పిడికెడు కాయలను ఒలిస్తే సగానికి సగం నాసిరకం విత్తనం ఉంది. పుచ్చులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విత్తనం తీసుకువెళ్లినా మాకు ఉపయోగం లేదు. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పాము. వారి నుంచి సమాధానం లేదు. అందుకే తీసుకోకుండా వెనక్కి వెళ్లిపోతున్నాం.

- బాలన్న, కత్తిమానుపల్లి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 25 , 2024 | 12:53 AM