Share News

వైసీపీ పాలనలో.. అన్నీ కష్టాలే

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:43 AM

తాడిమర్రి, జనవరి 20: వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని, కనీస సౌకర్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు కూడా ఏర్పాటుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

 వైసీపీ పాలనలో.. అన్నీ కష్టాలే

- గ్రామాల్లో శ్మశానవాటికలు కూడా ఏర్పాటు చేయలేదు

- టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తా

- భవిష్యత్తుకు గ్యారెంటీలో ప్రజలకు పరిటాలశ్రీరామ్‌ భరోసా

తాడిమర్రి, జనవరి 20: వైసీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయని, కనీస సౌకర్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు. చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు కూడా ఏర్పాటుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మండలంలోని మరువపల్లి, శివంపల్లి గ్రామాలలో శనివారం టీడీపీ శ్రేణులు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పరిటాల శ్రీరామ్‌ పాల్గొని వారితో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు అందజేసి మినీమేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ఇంట్లో ఎవరెవరికి ఏయే పథకం కింద ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరించారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. తర్వాత రెండు గ్రామాల్లోనూ ప్రజలు వివిధ సమస్యల్ని ఆయన దృష్టికి తెచ్చారు. మరువపల్లిలో శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరైన చనిపోతే పూడ్చేందుకు కూడా సరైనవసతి లేదన్నారు. శివంపల్లిలో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. ఇందుకు శ్రీరామ్‌ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారు ఏదో రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు.

గ్రామాలలో కనీస వసతులైన తాగునీరు, సీసీరోడ్లు,డ్రైనేజీలు, శ్మశాన వాటికలు లాంటి వాటిని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తొలుత గ్రామాలలో తెలుగుతమ్ముళ్లు పరిటాలశ్రీరామ్‌కు పూలమాలలు, గజమాలతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కూచిరామ్మోహన, సర్పంచల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనుగుంట్లభూషణ్‌, టీఎనటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ముంటిమడుగు హర్ష, నాయకులు రామానాయుడు, రవీంద్రరెడ్డి, పక్కీర్‌రెడ్డి. ఆత్మకూరు శ్రీనివాసులు, మాజీ ఎంపీపీలు, మాజీసర్పంచలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:43 AM