Share News

ఉక్కిరి..బిక్కిరి..

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:25 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూకుడుతో జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వలంటీర్లే సర్వస్వం అని నమ్ముకుని.. జనాల్లోకి వెళుతున్న వైసీపీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంలో పాల్గొంటున్నవారిపై వేటు పడుతోంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరోవైపు టీడీపీలోకి వైసీపీ శ్రేణుల వలసలు పెరిగాయి.

ఉక్కిరి..బిక్కిరి..

వైసీపీ అభ్యర్థులకు జనం నిలదీతలు

ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్న

టీడీపీలోకి పెరుగుతున్న వలసలు

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి

టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో జోష్‌

ప్రజలను ఆలోచింపజేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూకుడుతో జిల్లాలో వైసీపీ అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వలంటీర్లే సర్వస్వం అని నమ్ముకుని.. జనాల్లోకి వెళుతున్న వైసీపీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. వలంటీర్లు ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంలో పాల్గొంటున్నవారిపై వేటు పడుతోంది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరోవైపు టీడీపీలోకి వైసీపీ శ్రేణుల వలసలు పెరిగాయి. ఐదేళ్ల పాలనలో జగన నొక్కిన బటనలనే నమ్ముకున్న వైసీపీ అభ్యర్థులకు జనం నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడం కాదు... అభివృద్ధి ఎక్కడ చేశారో చూపాలని జనం ప్రశ్నిస్తున్నారు. ఒక్క పరిశ్రమను తీసుకురాలేదని, యువతకు ఉపాధి చూపకుండా మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక, పార్టీని వీడి టీడీపీలోకి వలస వెళ్తున్న శ్రేణులను కాపాడుకోలేక వైసీపీ అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఐదేళ్ల పాలనలో భయపెడుతూ, బుజ్జగిస్తూ కాలం గడిపిన వైసీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని విశ్లేషకులు అంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం

ఏం చేయాలి..?

అధికారంలో ఉన్నన్నాళ్లు మాయమాటలు చెప్పారు. అమలుగాని హామీలతో కాలం నెట్టుకొచ్చారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకుగానూ ఏకంగా ఏడు స్థానాలలో వైసీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. మెజార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం టిక్కెట్లు వచ్చాయి. ఎన్నికల బరిలో నిలిచిన ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయారు. అధినేత ఇచ్చిన హామీలు, తాము ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలిపోవడంతో అభ్యర్థులను సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో హెచ్చెల్సీ ఆధునికీకరణ ఊసెత్తలేదు. గంపెడు మట్టి తీయలేదు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచుతామని ఇచ్చిన మాట నెరవేరలేదు. పేరూరు, భైరవానతిప్ప ప్రాజెక్టులకు నిధులివ్వలేదు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం శంకుస్థాపనలకే పరిమితమైంది. రాప్తాడు సమీపంలో జాకీ పరిశ్రమ ఏర్పాటయ్యుంటే నాలుగు వేల మంది మహిళలకు ఉపాధి లభించేది. అది పక్క రాష్ర్టానికి తరలిపోవడానికి వైసీపీ నేతలే కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఉపాధికి గండి కొట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇలా చెప్పుకుంటూపోతే... ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జనంలోకి ఎలా వెళ్లాలో తెలియక వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

వలసల వెల్లువ

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటించక ముందు నుంచే నియోజకవర్గ ఇనచార్జిలు ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. బాబు ష్యూరిటీ... భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. రాయదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులను ప్రకటించారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఉరవకొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత, తాడిపత్రిలో అశ్మితరెడ్డి, శింగనమలలో బండారు శ్రావణిశ్రీ, కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబులు ప్రచారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీలోని అసంతుష్టులు, ఆ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోతున్నారు. రోజురోజుకూ టీడీపీలోకి చేరికలు అధికమవుతున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల కోసం కష్టపడి పనిచేశామని, గెలిచిన తరువాత ఎమ్మెల్యేలు తమను ఏమాత్రం గుర్తించలేదన్న అసంతృప్తి వైసీపీ ద్వితీయశ్రేణి నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఉందని ఆ పార్టీవారే అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మెజార్టీ స్థానాలు దక్కుతాయని, కూటమి అధికారం చేపట్టబోతోందని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు వైసీపీ అసంతుష్టులు టీడీపీలోకి చేరడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన విడుదలయ్యే నాటికి టీడీపీలోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

అధికారంలో ఉన్నన్నాళ్లు వైసీపీ పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజలకు ఏం ప్రయోజనాలు చేకూర్చామో చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రచారంలో టీడీపీ కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. పార్టీ శ్రేణులను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేవిధంగా సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను ముద్రించి, ప్రతి ఇంటి గుమ్మానికి చేరుస్తున్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనను ఎండగడుతున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, రైతుకూలీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేకూర్చే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థుల ప్రచారజోరుకు వైసీపీ నుంచి వలసల జోరు తోడవుతోంది. ఎన్నికలు మరో 50 రోజులకుపైగా ఉండటంతో టీడీపీ గ్రాఫ్‌ ప్రజల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 12:25 AM