Share News

పండుగ పూట విషాదం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:57 PM

భోగి మంటలు వేసుకుని.... ఇంటి ముందర ముగ్గులు వేసి... తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆమె కాసేపటికే విగతజీవిగా మారింది.

పండుగ పూట విషాదం

ఫ విద్యుదాఘాతంతో పంచాయతీ కార్యదర్శి మృతి

కళ్యాణదుర్గం, జనవరి 14: భోగి మంటలు వేసుకుని.... ఇంటి ముందర ముగ్గులు వేసి... తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆమె కాసేపటికే విగతజీవిగా మారింది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కంబదూరు మండలం కొత్త ఐపార్శపల్లికి చెందిన పంచాయతీ కార్యదర్శి నీరుగంటి ప్రశాంతి (28) విద్యుతషాక్‌తో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ప్రశాంతి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అశ్వత్థనారాయణ, రామలక్ష్మీలతో కలిసి తన సెల్‌ఫోనలోనే ముగ్గులు చూసుకుంటూ తన ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటూ ఉంది. ముగ్గు పూరైయిన వెంటనే విద్యుత వచ్చింది. ఇంట్లో నీళ్లు లేకపోవడంతో సంపులో ఉన్న నీళ్లను మోటర్‌ ద్వారా ఆనచేయడానికి వెళ్లింది. కరెంట్‌ ప్లగ్‌ పెడుతుండగా, ప్రమాదవశాత్తు షాక్‌ కొట్టడంతో పక్కనే ఉన్న సిమెంట్‌ తొట్టెపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందింది. కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఓబిగానిపల్లి సచివాలయం-2లో పంచాయతీ కార్యదర్శిగా ప్రశాంతి పనిచేస్తోంది. ఎంతో ఉన్నత ఆశయంతో ఉద్యోగంలో చేరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సమయంలో ఆ కుటుంబానికి మృత్యువు కబళించింది. జరిగిన సంఘటనను తలుచుకుని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వీరికి కూతురు ప్రశాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - Jan 14 , 2024 | 11:57 PM