Share News

తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి గూండాగిరి

ABN , Publish Date - May 12 , 2024 | 11:46 PM

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అతడి అనుచరులు బరితెగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా టీడీపీ శ్రేణులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు.

తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి గూండాగిరి

రాప్తాడు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అతడి అనుచరులు బరితెగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా టీడీపీ శ్రేణులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరుతుండడం జీర్ణించుకోలేక దాడులు చేస్తున్నారు. కొడకల్లారా.. ఉంటే వైసీపీలో ఉండండి లేదా ఊరు విడిచి వెళ్లిపోండి.. నరుకుతాం, చంపుతాం.. అని బెదిరిస్తూ దాడులకు తెగబడుతున్నారు. దళిత, బీసీ నాయకులపై విచక్షణా రహితంగా దాడి చేసి అడ్డు వచ్చిన వారిని కూడా గాయపరుస్తున్నారు. ఎన్నికల సమయంలో వరుస దాడులు పోలీసులకు సవాల్‌గా మారాయి. సోమవారం జరిగే ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు సమస్యాత్మక గ్రామాల్లో ఇదే స్థాయిలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఫ శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పీఆర్‌ కొట్టాల గ్రామానికి చెందిన మాదాపురం ఎంపీటీసీ (దళితవ్యక్తి) సంపత వైసీపీని వీడి టీడీపీలో చేరాడు. అతడు పార్టీ మారడంతో పీఆర్‌ కొట్టాలలో అధికంగా ఉన్న దళిత ఓట్లు టీడీపీకి వెళతాయని ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి బరితెగించాడు. గత నెల 27న రాజశేఖర్‌రెడ్డి తన అనుచరుడైన నసనకోట ముత్యాలు తదితరులు 15 వాహనాల్లో పీఆర్‌ కొట్టాలకు వెళ్లి సంపత, అతడి తల్లిదండ్రులపై కూడా దాడులు చేశారు. దాడిని అడ్డుకున్న దళిత మహిళ లక్ష్మక్కను వైసీపీ నాయకులు జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారు. పోతన్నపై కట్టెలతో దాడి చేశారు. ఎంపీటీసీ సంపతను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి వైసీపీ కండువా కప్పారు. వైసీపీలోనే కొనసాగుతానని సంపతతో బలవంతంగా చెప్పించి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Updated Date - May 12 , 2024 | 11:46 PM