Share News

సమ్మె శిబిరానికి నిప్పు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:54 AM

అంగనవాడీల సమ్మెపై ద్వేషాన్ని ప్రదర్శించారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై అక్కసు వెళ్లగక్కారు. ఏకంగా కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన షామియానాకు నిప్పు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అంగనవాడీలు 36 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

సమ్మె శిబిరానికి   నిప్పు
కలెక్టరేట్‌ వద్ద మట్టి తింటూ అంగనవాడీల నిరసన

అంగనవాడీల ఆందోళనపై అక్కసు

కలెక్టరేట్‌ ఎదుట ఘటన.. పోలీసులకు ఫిర్యాదు ..

36వ రోజు కొనసాగిన ఆందోళనలు

అనంతపురం విద్య, జనవరి 16: అంగనవాడీల సమ్మెపై ద్వేషాన్ని ప్రదర్శించారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై అక్కసు వెళ్లగక్కారు. ఏకంగా కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన షామియానాకు నిప్పు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అంగనవాడీలు 36 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని, దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ శిబిరానికి మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించి మంటలను ఆర్పి వేశారు. సమ్మె శిబిరంలో సుమారు 60 అడుగుల మేర షామియానాలు వేశారు. స్థానికులు సకాలంలో మంటలను ఆర్పకపోతే శిబిరం మొత్తం కాలిపోయేది. శిబిరానికి కేవలం 15 అడుగుల దూరంలో అనేక పూరి గుడిసెలు, షెడ్లు, నివాస గృహాలు ఉన్నాయి. కలెక్టరేట్‌ ఎదుటే ఈ ఘటన చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. సమ్మె గిట్గనివారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఈ ఘటనపై సీఐటీయూ నాయకులు వెంకట నారాయణ, రామాంజినేయులు, ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన నాయకులు జమున, అరుణ తదితరులు వనటౌన పోలీస్టేషనకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. సీఐ అందుబాటులో లేకపోవడంతో ఫోన చేసి వివరాలు తెలియజేశామని అన్నారు. విచారిస్తామని తెలిపారని అన్నారు.

36వరోజూ ఆందోళన

సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై అంగనవాడీలు మట్టి తింటూ నిరసన వ్యక్తం చేశారు. నేలపై కూర్చొని, మూకట్లలో మట్టి గడ్డలు పెట్టుకుని ‘మట్టి తిని బతకాలా..?’ అని నినాదాలు చేశారు. సమ్మెపై సీఎం జగన స్పందించాలని, వెంటనే వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. మినీ కేంద్రాలను మెయిన కేంద్రాలుగా గుర్తించాలని కోరారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jan 17 , 2024 | 12:54 AM