Share News

ప్రచారం చేసేదే..!

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:09 AM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల తరఫున పలువురు వలంటీర్లు, స్టోర్‌ డీలర్లు, ఉపాధి హామీ సిబ్బంది ప్రచారం కొనసాగిస్తున్నారు. అధికారులు రోజువారీ చర్యలు తీసుకుంటున్నా.. ఏమాత్రం జంకడం లేదు. పలు నియోజకవర్గాలలో శనివారం కూడా ప్రచారాలను కొనసాగించారు. పలువురిని అధికారులు విధుల నుంచి తొలగించారు.

ప్రచారం చేసేదే..!
ప్రచారంలో పాల్గొన్న వలంటీర్‌ కమలాకర్‌ (నల్లగీతల చొక్కా వేసుకున్న వ్యక్తి)

ఏమాత్రం తగ్గని వలంటీర్లు, డీలర్లు, ఉపాధి సిబ్బంది

వైసీపీ అభ్యర్థులతో కలిసి ప్రచార కరపత్రాల పంపిణీ

ఉమ్మడి జిల్లాలో పలువురిపై వేటు

(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల తరఫున పలువురు వలంటీర్లు, స్టోర్‌ డీలర్లు, ఉపాధి హామీ సిబ్బంది ప్రచారం కొనసాగిస్తున్నారు. అధికారులు రోజువారీ చర్యలు తీసుకుంటున్నా.. ఏమాత్రం జంకడం లేదు. పలు నియోజకవర్గాలలో శనివారం కూడా ప్రచారాలను కొనసాగించారు. పలువురిని అధికారులు విధుల నుంచి తొలగించారు.

- పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీదర్‌రెడ్డితో కలిసి 3వ వార్డు వలంటీర్‌ రమణ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య.. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

- నల్లచెరువు మండలంలో వైసీపీ కదిరి నియోజకవర్గ అభ్యర్థి మగ్బూల్‌తో కలిసి పలువురు వలంటీర్లు, యానిమేటర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రచారంలో పాల్గొన్నారు. తవళంమర్రి వెలుగు యానిమేటర్‌ బి.శ్రీనివాసులు పలువురిని వైసీపీ అభ్యర్థి వద్దకు తీసుకెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన వలంటీరు బీరప్పను వైసీపీ బూత కన్వీనర్‌గా నియమించారు.

- శింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజినేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణకు మద్దతుగా పలువురు స్టోర్‌ డీలర్లు, వలంటీర్లు శనివారం ప్రచారం నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి, బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. నీలంపల్లిలో స్టోర్‌ డీలరు భర్త ప్రభాకర్‌రెడ్డి, బుక్కరాయసముద్రంలో డీలర్లు శేషానందారెడ్డి, డీలర్‌ తండ్రి రాజారెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కొంతమంది వలంటీర్లు ప్రచార ర్యాలీలో వెనుక నడిచారు. ప్రచారంలో పాల్గొన్న కొత్తపల్లి డీలరు కుమారుడు భాస్కర్‌పై రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. డీలరు లైసెన్సు రద్దు చేయకుండా, భాస్కర్‌ పేరిట ఉన్న ఈ పోస్‌ హక్కును మాత్రమే తొలిగించారు.

- తనకల్లు మండలం రాచినేపల్లిలో వైసీపీ అభ్యర్థి మగ్బూల్‌తో కలిసి వలంటీరు రాచినేని కమలాకర్‌నాయుడు ప్రచారంలో పాల్గొన్నాడు.

చర్యలు ఎప్పుడు..?

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లు, స్టోర్‌ డీలర్లు, ఓ ఉద్యోగిపై అధికారులు ఇంకా చర్యలు తీసుకోలేదు. షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టారు. రాచేపల్లి పంచాయతీ కార్యదర్శి డొక్క కృష్ణ, వెస్టు నరసాపురం ఫీల్డ్‌ అసిస్టింట్‌ పట్నం భాస్కర్‌, చిన్నజలాలపురం వలంటీర్‌ వెంకటేశ ప్రచారం పాల్గొన్నారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఎన్నికల అధికారులు స్పందించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆ తరువాత ఎలాంటి చర్యలూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

వేటు పడింది..

- తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికాలనీకి చెందిన వలంటీర్‌ పెద్దన్న అలియాస్‌ విజయ్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ నరసింహారావు తెలిపారు. టీడీపీకి ఓటువేస్తే ప్రస్తుత పథకాలు రావని, జగనకు ఓటువేసి గెలిపించాలని పెద్దన్న చెబుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఎంపీడీఓ చర్యలు తీసుకున్నారు.

- యాడికి మండలంలో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వలంటీర్లను ఎంపీడీఓ సావిత్రి విధుల నుంచి తొలగించారు. కూర్మాజీపేటలో తాడిపత్రి వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధనరెడ్డితో కలిసి వలంటీర్లు రాజశేఖర్‌, రామాంజనేయులు ప్రచారం చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో శనివారం కథనం ప్రచురితమైంది. దీంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌కార్డులు, బయో మెట్రిక్‌ డివైజ్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.

- కదిరి వైసీపీ అభ్యర్థి మగ్బూల్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లు ఎర్రదొడ్డి గౌతమ్‌నాయక్‌, సోమశేఖర్‌నాయక్‌, ముత్యాలచెరువు నరసింహారెడ్డి, కొండమనాయునిపాళ్యం బూకే బాలాజీ నాయక్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. ఎంపీడీఓ ఆంజనప్ప శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 12:09 AM