Share News

రాష్ట్రం మనదే.. ఉరవకొండా మనదే

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:34 AM

వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విజయం తథ్యమని, ఉరవకొండలోనూ తాను విజయబావుటాను ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే పయ్యావల కేశవ్‌ ధీమా వ్యక్తం చేశారు. పట్టణ శివారులో శనివారం ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉరవకొండలో జన సునామీ మొదలైందని అన్నారు.

రాష్ట్రం మనదే.. ఉరవకొండా మనదే

రా.. కదలిరా సభలో ఎమ్మెల్యే పయ్యావుల

గుంతకల్లు/ఉరవకొండ, జనవరి 27: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విజయం తథ్యమని, ఉరవకొండలోనూ తాను విజయబావుటాను ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే పయ్యావల కేశవ్‌ ధీమా వ్యక్తం చేశారు. పట్టణ శివారులో శనివారం ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఉరవకొండలో జన సునామీ మొదలైందని అన్నారు. ఈ సభ ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 30 ఏళ్లు అయ్యిందని అన్నారు. 1994లో రాష్ట్రంలో టీడీపీకి, ఉరవకొండలో తనకు ఘన విజయం లభించాయని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో తాను 18 వేల పైచిలుకు మెజార్టీ సాధించానని అన్నారు. చరిత్ర పునరావృతం అయ్యి తీరుతుందని అన్నారు. ఈ 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరానని, రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందానని, తన జీవితాన్ని ప్రభావితం చేసిన అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. తనకు లభించిన గుర్తింపు, గౌరవం చంద్రబాబు నాయుడి చలువేనని అన్నారు. చంద్రబాబు యూనివర్సిటీలో తాను శిక్షణ తీసుకున్నానని అన్నారు. ఆయన ఏ సర్టిఫికెట్‌ ఇస్తారో చూడాలని, బహూశా పీహెచడీ ఇస్తారేమోనని చమత్కరించారు.

ఎవరు కావాలి..?

సీఎం జగనపై, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నీళ్లు ఇచ్చే నాయకుడు కావాలో, జే ట్యాక్స్‌ డబ్బులతో ఉత్తుత్తి బటన నొక్కే జగన కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. జిల్లాలో ఎక్కడ చూసినా టీడీపీ జెండా తప్ప మరో జెండా కనిపించని విధంగా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన జిల్లాకు నీరు ఇస్తే తమ తలరాతలు మారతాయని, రత్నాలు పండుతాయని అన్నారు. జీబీసీకి నీటి సరఫరా ఆగిపోవడం వల్ల రైతులకు రూ.300 కోట్లు నష్టం జరిగిందని అన్నారు. ఈ పాపం వైసీపీది కాదా అని ప్రశ్నించారు. 2016లో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే, హంద్రీనీవా నుంచి జీబీసీకి నీరు మళ్లించి పంటలను కాపాడామని గుర్తు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు.

చేతగాని దద్దమ్మ విశ్వ

అసమర్థ, చేతకాని దద్దమ్మ నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అని కేశవ్‌ విమర్శించారు. ఉరవకొండ వెనుకబాటు తనానికి ఆయనే కారణమని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. టీడీపీ హయాంలో నియోజకవర్గానికి 18 వేల ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. ఐదేళ్లలో కాలవలో తట్టెడు మట్టి కూడా తీయలేకపోయారని విమర్శించారు. వైసీపీని ఓడించడానికి మహిళలు, రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆమిద్యాల లిఫ్ట్‌, కొట్టాలపల్లి లిఫ్ట్‌ ఇరిగేషనలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉరవకొండలో చేనేత కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని, గార్మెంట్స్‌ పరిశ్రమను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

రాయలసీమ ద్రోహి జగన: కాలవ

రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ హయాంలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. వైసీపీ పాలనలో అరాచకం, విధ్వంసం కొనసాగిందని అన్నారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నామని అన్నారు. జగన దుర్మార్గపు పరిపాలన నుంచి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారా? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం, రాయలసీమ అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని అన్నారు.

మా బతుకులు బజారున పడ్డాయి..

సీఎం జగన్‌ చర్యలతో తమ బతుకులు బజారున పడ్డాయని చంద్రన్న బీమా మిత్రలు వాపోయారు. ఉరవకొండలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభకు వారు ప్లకార్డులు చేతపట్టుకుని వచ్చారు. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది బీమా మిత్రలను నియమించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని తొలగించారు. దీంతో ‘చంద్రబాబు రావాలి... సైకో పోవాలి’ అని రాసిన ప్లకార్డులను వారు ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పునఃప్రారంభించి, తమను ఆదుకోవాలని జిల్లా బీమా మిత్రలు కోరారు. - బెళుగుప్ప

అప్పుల ఊబిలో రాష్ట్రం

బహిరంగ సభలో టీడీపీ నాయకులు

గుంతకల్లు/ఉరవకొండ, జనవరి 27: ‘రా.. కదలిరా..’ బహిరంగ సభలో పలువురు జిల్లా నాయకులు ప్రసంగించారు. వైసీపీ మునిగిపోయే నావ అని మాజీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి అన్నారు. జగనను ఇంటికి సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రూ.12.5 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన, రాషా్ట్రన్ని అధ్వాన స్థితిలోకి నెట్టేశారని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్‌ అని, తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఉరవకొండలో దౌర్జన్యాలు, దుర్మారాలు, కబ్జాలు పెచ్చుమీరిపోయాయని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అన్నారు. ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు. విశ్వ కుమారుడు స్థానిక ఎమ్మెల్యేని పరుషమైన పదజాలంతో మాట్లాడటం సరికాదని అన్నారు. జగన మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదలి పారిపోతారని అన్నారు. చంద్రబాబునాయుడు విజన లీడర్‌ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును మళ్లీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాడేపల్లి పిల్లిని తరిమేద్దామని అన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:34 AM