Share News

నేడు ప్రజాగళం

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:06 AM

టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.

నేడు ప్రజాగళం

టీడీపీ అధినేత చంద్రబాబు రాక

రాప్తాడు, బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు

పార్టీ శ్రేణులు, ప్రజల్లో చైతన్యం నింపనున్న బాబు

కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార శంఖారావం

అనంతపురం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం నింపడమే ధ్యేయంగా జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యేలా పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, ఆమె తనయుడు, ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌, నియోజకవర్గ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శింగనమల నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

పర్యటన ఇలా..

- మదనపల్లి నుంచి హెలిక్యాప్టర్‌లో ఉదయం 9.55 గంటలకు బయలుదేరి, 10.40 గంటలకు అనంతపురం శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

- రాప్తాడు బస్టాండ్‌ సర్కిల్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 12.30 గంటల వరకూ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

- రాప్తాడు బస్టాండు దగ్గర నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, ఒంటి గంటకు అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ స్టేడియానికి చేరుకుంటారు.

- మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకూ భోజన విరామం.

- ఆర్డీటీ స్టేడియం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి.. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభ వద్దకు 2.20కి చేరుకుంటారు.

- మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

- సాయంత్రం 4.15 గంటలకు బుక్కరాయసముద్రం నుంచి బయలుదేరి 4.30 గంటలకు నగర శివారులోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కదిరి నియోజకవర్గ పర్యటనకు బయలుదేరుతారు.

సభకు తరలిరండి

పరిటాల సునీత, శ్రీరామ్‌

రాప్తాడు/బుక్కరాయసముద్రం, మార్చి 27: రాప్తాడులో గురువారం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగళం సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు కోవెలమూడి రవీంద్ర, రవియాదవ్‌, రాజశేఖర్‌ తదితరులతో కలిసి సభా స్థలాన్ని వారు బుధవారం పరిశీలించారు. రాప్తాడు సభలో టీడీపీ సత్తా చాటాలని అన్నారు. చంద్రబాబు రాక సందర్భంగా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆ తరువాత రాంనగర్‌ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలోని హెలీప్యాడ్‌ను పరిశీలించారు.

జయప్రదం చేయండి: బండారు శ్రావణి

బుక్కరాయసముద్రంలో నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరా వాలని టీడీపీ శింగనమల నియోజకవర్గ అభ్యర్థి బండారు శ్రావణి పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్వహించే సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారని ఆమె తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 01:06 AM