Share News

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉరవకొండలో తాగునీటి సమస్య

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:10 AM

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉరవకొండలో ప్రజలకు తాగునీరు అందకుండా అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇందుకు పాలకులే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉరవకొండలో తాగునీటి సమస్య
ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేశవ్‌

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మార్చి 28: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉరవకొండలో ప్రజలకు తాగునీరు అందకుండా అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇందుకు పాలకులే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పాతపేటలో గురువారం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతకుమునుపు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తుతోందన్నారు. టీడీపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉరవకొండలో 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి తాగునీటిని అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలోనే నిర్మించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు, పైప్‌లైన్లు తప్ప, కొత్త కుళాయిలు ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఒక్కనీటి చుక్క అయినా అదనంగా తీసువచ్చారా అని ప్రశ్నించారు. నీటి సమస్యపైన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చలనం లేదన్నారు. ఉరవకొండ తాగునీటికి కేటాయించిన నిధులు ఇతర నియోజకవర్గాలకు వాడుకుంటున్నారే తప్ప నీటి సమస్యపైన శ్రద్ధ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి, రూ.100 దోపిడీ చేస్తోందన్నారు. వైసీపీని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. మండల కన్వీనర్‌ విజయ్‌భాస్కర్‌, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు పురుషోత్తం, నాగరాజు, నాయకులు తిమ్మప్ప, ప్యారం కేశవానంద, గోవిందు, రెడ్డి మాసి రవీంద్ర, జియో శ్రీన, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:10 AM