ఉప్పొంగిన ఉరవకొండ
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:37 AM
: ‘రా కదలి రా’ బహిరంగ సభకు జనం పోటెత్తారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. అశేష జనవాహినితో ఉరవకొండ జనసంద్రంగా మారింది. అనంతపురం అర్బన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధ్యక్షతన శనివారం ఈ సభను నిర్వహించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రసంగించారు. పార్టీ శ్రేణులు, కరువు జిల్లా ప్రజానీకానికి భరోసా ఇచ్చారు. సీఎం జగన సైకో పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.
రా.. కదలి రాతో ఉరకలెత్తిన ఉత్సాహం
పార్టీ శ్రేణులు, జనానికి చంద్రబాబు భరోసా
టీడీపీ-జన సేన కూటమిదే అధికారమని ధీమా
అనంతపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘రా కదలి రా’ బహిరంగ సభకు జనం పోటెత్తారు. పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. అశేష జనవాహినితో ఉరవకొండ జనసంద్రంగా మారింది. అనంతపురం అర్బన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధ్యక్షతన శనివారం ఈ సభను నిర్వహించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రసంగించారు. పార్టీ శ్రేణులు, కరువు జిల్లా ప్రజానీకానికి భరోసా ఇచ్చారు. సీఎం జగన సైకో పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని తూర్పారబట్టారు. వైసీపీ పనైపోయిందని, టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఆ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా అంటే తనకు అమితమైన అభిమానమని, తన గుండెకు దగ్గరగా ఉండేది ఈ జిల్లానే అని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేసి, జిల్లాలోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందించి అన్నదాతను ఆదుకుంటానని అన్నారు. వైసీపీ అరాచక పాలనలో ఇబ్బందలు పడిన ప్రతి కార్యకర్తను ఆదుకుంటానని శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తన కార్యకర్తల జోలికొస్తే ఎవ్వరినీ వదిలిపెట్టనని, ఖబడ్దార్ వైసీపీ గుండాల్లారా అని హెచ్చరించారు.
తరలివచ్చిన నాయకులు
ఉరవకొండ సభకు పార్టీ రాయలసీమ జోన పరిశీలకుడు బీద రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, జితేంద్రగౌడ్, ఉన్నం హనుమంతరాయచౌదరి, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, రాయలసీమ జోన మీడియా కో ఆర్డినేటర్ బీవీ వెంకటరాముడు, నియోజకవర్గ ఇనచార్జిలు ఉమామహేశ్వరనాయుడు, పరిటాల శ్రీరామ్, శింగనమల టూమెన కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, ఆ నియోజకవర్గ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, మాజీ మేయర్ స్వరూప, రాష్ట్ర నాయకులు వెంకటశివుడు యాదవ్, సవిత, గౌస్‌మొద్దీన, రామ్మోహన చౌదరి, బుగ్గయ్య చౌదరి, జేఎల్ మురళి, శివబాల, తలారి ఆదినారాయణ, గాజుల ఆదెన్న, గడ్డం సుబ్రహ్మణ్యం, విశాలాక్షి, దండు శ్రీనివాసులు, రాయల్ మురళి, అంజనప్ప, కుంచెపు వెంకటేష్, వెంకటప్ప, జనసేన నాయకులు టీసీ వరుణ్, చిలకం మధుసూదనరెడ్డి, పెండ్యాల శ్రీలత తదితరులు తరలివచ్చారు.
జగనకు దిమ్మతిరగాలి
ఉమ్మడి జిల్లాను తాను ఎక్కువగా అభిమానిస్తానని చంద్రబాబు అన్నారు. తన గుండెకు దగ్గరగా ఉండే జిల్లా అనంతపురం అని అన్నారు. ఒకప్పుడు వర్షం పడక పంట రాకపోతే మొట్టమొదటిసారి వేరుశనగ పంటకు ఇనపుట్ సబ్సిడీ అందించి, రైతాంగాన్ని ఆదుకున్నామని అన్నారు. కరువు ఏర్పడినప్పుడు పశువుల మేపుకునేందుకు రైతులకు క్యాంపులు పెట్టామని గుర్తు చేశారు. అప్పటి నుంచే జిల్లాకు నీరు తీసుకురావాలనే ఆకాంక్ష పెరిగిందని అన్నారు. ఆ క్రమంలోనే హంద్రీనీవాను తీసుకొచ్చామని అన్నారు. ప్రతి ఎకరానికీ నీరిచ్చి, పేదరికం లేకుండా చేసి, పొలంలో బంగారం పండించే వరకు రైతులకు తాను అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే చేసి చూపిస్తానని అన్నారు. ‘ఈ సారి ఎన్నికల్లో మీరిచ్చే ఫలితాలు జగనకు దిమ్మతిరగాలి’ అని ప్రజలతో అన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలలో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ జెండా ఎగరాలి.. వైసీపీ జెండా భూస్థాపితం కావాలి అని అన్నారు.
అభివృద్ధి చేస్తా..
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని చంద్రబాబు అన్నారు. జిల్లాకు జీవనాడైన డ్రిప్ ఇరిగేషనను మళ్లీ తీసుకొస్తానని అన్నారు. భైరవాన తిప్ప, పేరూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తానని అన్నారు. గుంతకల్లు బ్రాంచ కెనాల్‌లోని పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన పనులు పూర్తి చేస్తానని అన్నారు. గార్లదిన్నె, శింగనమలలో షాదీఖానాలు కట్టిస్తామని అన్నారు. రద్దు చేసిన సబ్ ప్లాన్లు మళ్లీ అమలు చేసి, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటామని అన్నారు. ఆ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చి, వారి రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు. ఆ వర్గాలన్నీ తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలని కోరారు. సామాజిక న్యాయానికి మారుపేరు టీడీపీ అని అన్నారు. మాదిగలకు న్యాయం చేయబోయేది టీడీపీనే అని అన్నారు. మైనార్టీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గండికోట, నిట్టూరు, బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషనను పూర్తి చేస్తామని అన్నారు. చిత్రావతి నదిపై తాడిపత్రి - పులివెందుల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఉరవకొండలో చేనేత కార్మికులకు చేయూత అందిస్తామని అన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మహిళలకు రక్షణ ఏదీ..?
జగన రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీవి కాకుండా పోతాయని చంద్రబాబు అన్నారు. ఎవరు ఎదురు మాట్లాడితే వారి ప్రాణాలు ఉండవని అన్నారు. ఈ అరాచక పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, ఇందుకు బ్రహ్మసముద్రంలో జరిగిన సంఘటనే నిదర్శనమని అన్నారు. తన కోరిక తీర్చలేదని ఓ కిరాతకుడు నడి బజారులో ఆడ బిడ్డను కొడితే పోలీసులు వెళ్లలేదంటే సిగ్గుగా లేదా అని ఆయన మండిపడ్డారు. ‘మీ ఇంట్లో ఆడవాళ్లకు ఇలా జరిగితే మీరు సహిస్తారా?’ అని పోలీసులను నిలదీశారు. ‘ఆంబోతురాలా జాగ్రత్త.. వీలాంటి ఆంబోతులను నడిరోడ్డులో బట్టలు ఊడదీసి ఊరేగిస్తాం’ అని హెచ్చరించారు. ఆడ బిడ్డలకు రక్షణగా టీడీపీ అండగా ఉంటుందని అన్నారు.
కార్యకర్తలకు అండ..
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలు టీడీపీతోనే ఉన్నారని చంద్రబాబు అన్నారు. జగన విధ్వంసాన్ని, తుగ్లక్ పాలనను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించినా.. దాడులు చేసినా ఎదుర్కొన్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను అనుబంధ వ్యవస్థగా మార్చుకొని, వైసీపీవారు రాక్షస క్రీడ ఆడారని అన్నారు. ‘ప్రాణాలు తీస్తున్నా ఒకే మాట.. జై చంద్రన్న, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలే కార్యకర్తలు ఉన్నారు. కష్టకాలంలో పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత నాది. ఏ గామ్రంలో ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో... చిత్రగుప్తుడిలాగా రాసుకుంటున్నా. వడ్డీ, చక్రవడ్డీ సహా తిరిగి చెల్తిస్తా’ అని వైసీపీ నాయకులను హెచ్చరించారు. పోలీసులకు అండగా ఉండే పార్టీ టీడీపీ అని అన్నారు. ‘మీ డ్యూటీ మీరు చేయండి. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
జిల్లాకు అన్యాయం..
జగన జిల్లాకు తీరని అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గోదావరి నీటిని రాయలమీకు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. కొంత వరకు జయప్రదం చేశామని, టీడీపీ అధికారంలో ఉండి ఉంటే పూర్తిగా నెరవేరేదని అన్నారు. టీడీపీ హయాంలో నీళ్లు ఇవ్వడం ద్వారా రైతులు కోట్లు సంపాదించారని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 50 ఎకరాల్లో కౌలు రైతు రూ.2.30 కోట్లు సంపాదించారని అన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చామని గుర్తు చేశారు. 10 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన సౌకర్యం కల్పించామని అన్నారు. తద్వారా ఉద్యాన పంటలను పండించి, రైతులు డబ్బులు బాగా సంపాదించారని అన్నారు. జిల్లాలో నీరుంటే .. గోదావరి జిల్లాలు కూడా పోటీ పడలేవని అన్నారు. అక్కడ వరి మాత్రమే పండించుకోవాలని, అనంతలో ప్రపంచంలోని అన్ని రకాల వాణిజ్య పంటలు పండించే పరిస్థితి వస్తుందని అన్నారు. గత 25 ఏళ్లతో పోలిస్తే భూమి విలువ పెరిగిందని అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ రంగంలోకి వచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉరవ కొండలో కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషనను మొదలుపెట్టామని, ఇది పూర్తై ఉంటే 50 వేల ఎకరాల్లో పంటలు పండించేవారని, తద్వారా సంపద పెరిగేదని అన్నారు. కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషనను ఆపేసి రూ.30 కోట్లు వృథా చేశారని, డ్రిప్ పరికరాలు, పైపులు తప్పుపట్టాయని అన్నారు. రైతులకు వైసీపీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. ‘ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా..? డీఎస్సీ పెట్టాడా?’ అని ప్రశ్నించారు. దిగిపోయేటప్పుడు నోటిఫికేషన ఇస్తాడంట.. ఇంకా ఎవరినిమోసం చేయాలని అనుకుంటున్నారో అని ఎద్దేవా చేశారు.
ఎవ్వరినీ వదిలిపెట్టం..
దొంగ ఓట్లు నమోదు చేసిన అధికారులను, దొంగ ఓట్లు వేసే వైసీపీ నాయకులను ఎవర్నీ వదిలిపెట్టబోమని చంద్రబాబు అన్నారు. ఉరవకొండలో దొంగ ఓట్లపై పయ్యావుల కేశవ్ పోరాటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అవినీతిని ఎండగట్టిన బాబు
జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని చంద్రబాబు తూర్చారబట్టారు. అక్రమాల్లో విశ్వరూపం చూపిస్తాడని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అవినీతిని ఎండగట్టారు. ఎక్కడ లే అవుట్ వేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనని అన్నారు. చివరకు గాలిమరల సెక్యూరిటీ సిబ్బంది జీతాల్లోనూ వాటా ఇవ్వాల్సిందేనని అన్నారు. తప్పుడు ఎనఓసీలు సృష్టించి, ఆడబిడ్డల భూములను విశ్వేశ్వరరెడ్డి కుమారుడు కొట్టేశాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ఇనచార్జిగా జగనరెడ్డి నియమించారని మండిపడ్డారు. ఈ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిదంటే అది పయ్యావుల కేశవ్ వల్లేనని అన్నారు. మంత్రి ఉష శ్రీచరణ్ కరప్షన క్వీన అని విమర్శించారు. రూ.30 కోట్ల విలువైన సుజలాన విండ్ పార్కు భూములను డ్రైవర్ పేరుతో ఆమె కాజేశారని అన్నారు. పెన్నా నదిలో ఇసుకను అక్రమంగా తరలించారని, అక్రమ లే అవుట్లు వేసి ఇష్టానుసారంగా అమ్ముకున్నారని అన్నారు. పేద వారికిచ్చే ఇంటి జాగాలో వంద ఎకరాలను రూ.6 లక్షలకు కొని రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వానికి అమ్ముకున్నారని ఆరోపించారు. అందుకే కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు ఆమెను జగన మార్చారని అన్నారు. ఈ ఊర్లో ఉన్న చెత్త ఏ ఊర్లోనూ బంగారం అవ్వదని, ఆ చెత్తను డంప్‌యార్డుకు పంపించాలని ప్రజలను కోరారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మరలా ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చారని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ దొడ్డరెడ్డి.. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎగిరెగిరి పడుతున్నారని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. శింగనమల నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఎమ్మెల్యేకు సీటు లేకుండా పోయిందని అన్నారు. మాట్లాడితే కేసులు పెడతారేమోనని ఆమె మౌనంగా ఉండిపోయారని అన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జగనరెడ్డికి కాపు కాశారని, టికెట్ లేదు పొమ్మంటే తాడేపల్లి ప్యాలె్‌సకు సెల్యూట్ కొట్టి బైబై చెప్పారని అన్నారు. గుంతకల్లులో ఇసుక స్టాక్ పాయింట్ పెట్టి, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరు గాలిపీల్చినా కప్పం కట్టాల్సిందేనంట అని మండిపడ్డారు. అనంతపురం ఎమ్మెల్యే రిటైర్‌మెంట్‌కు వచ్చేసి, చిల్లరకొట్టులు కొట్టుకుంటున్నారని అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేల చెత్త తమకు వద్దని ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
గెలుపు గుర్రాలకే టికెట్
అభ్యర్థి ఎవరైనా సమష్టిగా పనిచేయాలి ..
ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ-జనసేన కూటమి జెండా ఎగరాలి
పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
అనంతపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి జెండా ఎగరాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఆ మేరకు శనివారం రాత్రి ఉరవకొండలోని విడిది కేంద్రంలో జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఖరారు చేస్తామన్నారు. ముఖ్యంగా యువతతోపాటు బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అభ్యర్థి ఎవరైనా ఆ అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అధికారంలోకి రాగానే కష్టపడి పనిచేసిన వారికి తగిన గౌరవం కల్పిస్తామన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడటంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సైకో పాలనను అంతమొందించేందుకు, ప్రజల్లో మరింతగా చైతన్యం నింపే బాధ్యతను నాయకులుగా మీ భుజాలపై ఎత్తుకోవాలని చంద్రబాబు ముఖ్యనాయకులకు సూచించారు.
జనమే జనం..!
ఉరవకొండ/విడపనకల్లు, జనవరి 27: ‘రా.. కదిలి రా’ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. అంచనాలు మించి జనం రావటంతో పోలీసు యంత్రాంగం అదుపు చేయలేకపోయింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ నుంచి వేదికపైకి వచ్చేందుకు పోలీసులు వెనుక వైపు నుంచి దారి ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హెలిప్యాడ్‌లో దిగిన చంద్రబాబును చూసేందుకు జనం ఎగబడ్డారు. పోలీసులు అనుమతించకపోవటంతో చంద్రబాబు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన వచి బారికేడ్లను తోసుకుని జనం స్టేజ్ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 23న సీఎం జగన పర్యటన సందర్భంగా.. సభా వేదికను పొడవుగా ఏర్పాటు చేసి జనాన్ని అధికంగా చూపించే ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల మహిళలను బెదిరించి బస్సులలో బలవంతంగా సభకు తరలించారు. కానీ టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో తరలివచ్చి, సభా ప్రాంగణాన్ని జనసంద్రంగా మార్చేశారు. టీడీపీ అభిమానాన్ని చాటుకుంటూ, చంద్రబాబును చూసేందుకు ఫ్లడ్ లైట్ల కోసం ఏర్పాటు స్తంభాలపైకి ఎక్కారు.
ఘన స్వాగతం
ఉరవకొండకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ, పలువురు నాయకులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌లో దిగిన తరువాత చంద్రబాబు బస్సులో ఆర గంట సేద తీరారు. ఆ సమయంలో వేదికపై ఉన్న పార్టీ నాయకులు ప్రసంగాలను పూర్తి చేశారు. అనంతరం వేదికపైకి వచ్చిన చంద్రబాబు.. గంటకుపైగా ప్రసంగించారు. చీకటి పడుతున్నా జనం కదలకుండా, ఆసక్తిగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. ఈలలు, కేకలు వేస్తూ మద్దతు తెలిపారు. బహిరంగ సభ పూర్తి అయిన తరువాత జాతీయ రహదారిపై వాహనాలు ఆరగంటకు పైగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు లేక పోవటంతో టీడీపీ కార్యకర్తలే ట్రాఫిక్ నియంద్రణ విధులను నిర్వర్తించారు.