Share News

బడ్జెట్‌ సమావేశం రసాభాస

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:02 AM

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్‌ సమావేశం రసాబాసగా మారింది.

బడ్జెట్‌ సమావేశం రసాభాస
టీడీపీ, వైసీపీ సభ్యుల వాగ్వాదం

ఎమ్మెల్యే ఏం చేశాడన్న వైసీపీ సభ్యులు

ఐదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: టీడీపీ

ఇరుపార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం

రూ.59.40కోట్లతో బడ్జెట్‌ ఆమోదం

హిందూపురం, ఫిబ్రవరి 14: పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్‌ సమావేశం రసాబాసగా మారింది. పురం అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిందూపురం మునిసిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన సమావేశం జరగ్గా టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధి తామంటే తామే చేశామని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టణానికి రూ.లక్ష నిధులు ఇవ్వలేదని అలాంటప్పుడు మీరు ప్రశ్నించకూడదన్నారు. ఈ సందర్భంగా రమేష్‌, రాఘవేంద్ర, సతీష్‌ మాట్లాడుతూ మా ఎమ్మెల్యేకి మీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక్కరూపాయయైున నిధులు ఇచ్చారా అంటూ నిలదీశారు. మీరు అధికారంలో ఉండి నిధులు ఇవ్వకపోతే దానికి బాధ్యులు ఎవరన్నారు. కరోనా కష్టకాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య పరికరాలు, మందులు అందజేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుని గందరగోళం నెలకొంది.

రూ.59.40కోట్లతో బడ్జెట్‌ ఆమోదం: హిందూపురం మునిసిపాలిటీకి సంబందించి 2024-25 ఆర్థిఖ సంవత్సరానికిగాను బడ్జెట్‌ చిన్నపాటి సవరణతో రూ.59.40కోట్లతో కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు అన్ని పద్దులతో కలిపి రూ.59,40, 65,514 ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రారంభ విలువ రూ.31,87,68,310 రెవెన్యూ జమలు రూ.41,98,36,500 మూలధన జమలు రూ.17,42,29,014గా చూపించారు. అంచనాలు వేయడం వరకు అధికారులు లెక్కలు చక్కగా చూపుతున్నారు. అందుకు తగ్గట్టు పన్నులు వసూలు చేయాలని టౌనప్లానింగ్‌, రెవెన్యూవారు వసూలు చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు.

ప్రతి కౌన్సిల్‌లో గొల్లపల్లి నీళ్లపై రగడ: పదేళ్ల క్రితం వరకు హిందూపురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఒకానొక దశలో నీరు ఇస్తే ఓటేస్తామని పట్టణ ప్రజలు ప్రశ్నించిన దాఖలాలున్నాయి. నిత్యం మునిసిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఖాళీ నీటి బిందెలతో నిరసనలు తెలిపేవారు. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఒప్పించారు. అంతేకాక కేంద్రమంత్రి అయిన వెంకయ్యనాయుడుతో చర్చించి నీటిని తీసుకొచ్చారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన ద్వారా హిందూపురం పట్టణానికి నీరు వచ్చినప్పటి నుంచి నీటి సమస్య లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో వైసీపీ కౌన్సిలర్లు ప్రతి సమావేశంలో గొల్లపల్లి నీటిని తీసుకురావడంతో మునిసిపాలిటీపై భారం పడిందని దీనికి బాధ్యత ఎమ్మెల్యే బాలకృష్ణదంటూ విమర్శించడం నిత్యకృత్యమైంది.

Updated Date - Feb 15 , 2024 | 12:02 AM