Share News

ఆ ఎగతాళి మీకూ వర్తిస్తుంది కదా..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:07 AM

అమరావతి, యర్రగుంటపాళ్యం, పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లతో దాడిచేస్తే చిన్న గుళకరాయికే చనిపోతారా.. అని ఎగతాళి చేశారు.

ఆ ఎగతాళి మీకూ వర్తిస్తుంది కదా..!
మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్న నాయకులు

చంద్రబాబుపై రాళ్లదాడిని హేళన చేశారు కదా..?

వైసీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ చురక

పెనుకొండ టౌన, ఏప్రిల్‌ 16: ‘అమరావతి, యర్రగుంటపాళ్యం, పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లతో దాడిచేస్తే చిన్న గుళకరాయికే చనిపోతారా.. అని ఎగతాళి చేశారు. ఇప్పుడు సీఎం జగనపై గుళకరాయి దాడి జరిగింది. దీనికీ నాటి ఎగతాళి మాటలు వర్తిస్తాయి కదా..?’ అని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గుట్టూరుకు చెందిన 12 కుటుంబాల వారిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018లో ఐజీగా రిటైర్డ్‌ అయ్యానని, అప్పట్లో పోలీసుల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అన్నారు. హిందూపురంలో అబ్దుల్‌ఘని రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత తనను నైట్‌వాచమనలా అక్కడికి పంపారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో తన కష్టానికి ఫలితం దక్కిందని భావించానని, కానీ పరిస్థితులు అందుకు విరుద్దంగా మారిపోయాయని అన్నారు. వైసీపీ హిందూపురం అభ్యర్థిని ప్రకటించిన సమయంలో ఆ పార్టీ నాయకుల ప్రవర్తన, తీరు తనకు బాధ కలిగించిందని అన్నారు. అందుకే తల వంచలేక ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని అన్నారు. అధికార పార్టీ మైనార్టీలకు చేసింది ఏమీ లేదని, చంద్రబాబుతోనే మైనార్టీల గుర్తింపు అని అన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైనాట్‌ 175 కాదు మైనస్‌ 175 చేసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారని, టీడీపీ విజయ ఢంకా మోగించడం తథ్యమని అన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎనలేనివని, నిత్యం ప్రజల్లో ఉంటున్న ఆమె గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాసులు, మైనార్టీ నాయకుడు దాదు, త్రివేంద్రమూర్తి, గుట్టూరు సూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:07 AM