Share News

ఆ భూమి మాదే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:48 AM

జిల్లా కేంద్రం చుట్టూ భూముల విలువలు భారీగా పెరగడంతో కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ స్థలాలకు రిజిసే్ట్రషన, ఇతర పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు

ఆ భూమి మాదే..
ఉప్పరపల్లిలో అంగనవాడీల ఇళ్లకు ఇచ్చిన స్థలం

అంగనవాడీల స్థలాలపై కన్ను

రెండు దశాబ్దాల క్రితం పట్టాలు

సర్వే చేయించని రెవెన్యూ అధికారులు

ఇదే అదనుగా కబ్జాకు కొందరి ప్రయత్నాలు

జిల్లా కేంద్రం చుట్టూ భూముల విలువలు భారీగా పెరగడంతో కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీ స్థలాలకు రిజిసే్ట్రషన, ఇతర పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ అండతో పేట్రేగిపోతున్నారు. ఇదే తరహాలో అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లిలో అంగనవాడీల వర్కర్లకు ఇచ్చిన ఇంటి స్థలాలను కాజేయాలని చూస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అంగనవాడీలకు ఇచ్చిన ఇంటి స్థలాకు దొంగ పత్రాలు సృష్టించి కొందరు తెరపైకి వచ్చారని బాధితులు వాపోతున్నారు. కబ్జాదారులకు రెవెన్యూ శాఖలోని కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

- అనంతపురం రూరల్‌

వందలాది మందికి పట్టాలు

ఉప్పరపల్లి సర్వే నంబరు 107లో 1 నుంచి 7 లెటర్ల వరకు ఉన్న భూమిలో ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు కేటాయించింది. 2011లో మొత్తం 550 మందికి పట్టాలు మంజూరు చేశారు. లబ్ధిదారుల్లో ఆటో డ్రైవర్లు, అంగనవాడీలు తదితరులు ఉన్నారు. సర్వే నంబరు 107-1, 2లోని 1.78 ఎకరాల్లో 69 మంది అంగనవాడీలకు ఇంటి స్థలాలు కేటాయించారు. లబ్ధిదారులు అప్పట్లో బీఎల్వోలుగా పనిచేశారు. ఆ స్థలాలు అనువుగా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంగనవాడీలు అప్పట్లో ఇళ్లను నిర్మించుకోలేదు. కానీ తరచూ భూమిని చదును చేసుకుంటూ, స్థలాలను అంటిపెట్టుకుంటూ వస్తున్నారు. ఇళ్ల నిర్మాణం విషయమై గతంలో రెండు మూడు సార్లు అధికారులు కలిసి అర్జీలు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో నాలుగైదు నెలల క్రితం పట్టాదారులు సొంతంగా ఇళ్లను నిర్మించుకునేందుకు స్థలాల్లో ఉన్న ముళ్ల పొదలను తొలగించి, చదును చేసుకున్నారు.

మొదట్నుంచీ బెదిరింపులే..

ఇంటి స్థలాల పట్టాలు జారీ అయినప్పటి నుంచి ఎవరో ఒక్కరు వచ్చి ఆ భూమి తమదని బెదిరిస్తున్నారని, కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులను కలిసి ఫిర్యాదు చేశామని బాధితులు అంటున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆ భూమి తమదంటూ బుధవారం వచ్చారని, అక్కడ పాతిన బండలను యంత్రాల సాయంతో తొలగించి చదును చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితులు మళ్లీ పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

కొలతలు వేయడంలో జాప్యం

పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులు, కొలతలు వేసి హద్దులు చూపకుండా జాప్యం చేశారు. ఆ స్థలాల్లో ముళ్ల చెట్లు పెరిగిపోయాయని, వాటిని తొలగించి చదును చేసుకుంటామని, కొలతలు వేసి స్థలాలను చూపాలని కొన్నేళ్ల నుంచి లబ్ధిదారులు రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో మండల సర్వేయర్‌ వచ్చి భూమి కొలతలు వేశారని అంగనవాడీలు చెబుతున్నారు. కానీ, పాత ప్లాన ప్రకారం రోడ్లు, ప్లాట్లు చూపించేందుకు స్థలం లేదని చెబుతూ కాలయాపన చేశారని తెలుస్తోంది. దీంతో చేసేదిలేక లబ్ధిదారులే నాలుగైదు నెలల కిందట భూమి చదును చేసుకున్నారు. స్థలాలను అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పటికైనా సర్వేయర్‌ వచ్చి కొలతలు వేయిస్తే తమకు న్యాయం జరుగుతుందని అంగనవాడీలు అంటున్నారు.

ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారు..

చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ప్రభు త్వం పట్టాలు ఇచ్చినా ఇళ్లను కట్టుకోలేకపోయాం. స్థలం ఖాళీగా ఉండటంతో నిత్యం ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఆక్రమించాలని చూస్తున్నారు. ప్రతిసారీ పోలీసులు, రెవెన్యూ అధికారుల దగ్గరకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇప్పుడు మరో వ్యక్తి వచ్చి భూమి తమదని అంటున్నాడు. ఇప్పటికైనా అధికారులు కొలతలువేయిస్తే అప్పోసప్పో చేసి ఇళ్లు కట్టుకుంటాం.

- సునంద, అంగనవాడీ వర్కర్‌

న్యాయం చేయాలి..

ఇరవై ఏళ్ల కిందట మాకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి స్థలాలను అంటిపెట్టుకుని ఉన్నాం. భూమి అనువుగా లేనికారణంగా ఇళ్లను నిర్మించుకోలేకపోయాం. కొలతలు వేసి మా స్థలాలను చూపించాలని సర్వేయర్‌ను అడుగుతూ వస్తున్నాం. సర్వే చేసి ప్లాట్లు చూపిస్తే మాకు న్యాయం జరుగుతుంది. భూమి ఖాళీగా ఉండటంతో తరచూ ఎవరో ఒకరు వచ్చి బెదిరిస్తున్నారు. ఆక్రమణదారులు వచ్చిన ప్రతిసారీ మేము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. ఇప్పటికైన రెవెన్యూ అధికారులు స్పందించి, మాకు స్థలాలను చూపించాలి.

- లక్ష్మీ నరసమ్మ, అంగనవాడీ కార్యకర్త

Updated Date - Jan 12 , 2024 | 12:48 AM