Share News

స్టే ఉన్నా.. ప్రారంభోత్సవం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:13 AM

మండల పరిధిలోని చిన్నపొలమడ వద్ద నిర్మించిన వివాదాస్పద ఆర్టీఏ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంవీఐలు శ్రీనివాసులు, రాజగోపాల్‌ ఈ కార్యక్రమానిక హాజరయ్యారు. ఈ కార్యాలయ భవన నిర్మాణానికి వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. కానీ అధికారులు మాత్రం 383-2 సర్వే నంబర్‌లోని 3.39 ఎకరాల భూమిపై మాత్రమే స్టే ఉందని అంటున్నారు.

స్టే ఉన్నా.. ప్రారంభోత్సవం
రిబ్బనకట్‌ చేసి భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

తాడిపత్రి, జనవరి 31: మండల పరిధిలోని చిన్నపొలమడ వద్ద నిర్మించిన వివాదాస్పద ఆర్టీఏ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంవీఐలు శ్రీనివాసులు, రాజగోపాల్‌ ఈ కార్యక్రమానిక హాజరయ్యారు. ఈ కార్యాలయ భవన నిర్మాణానికి వ్యతిరేకంగా టీడీపీ మద్దతుదారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. కానీ అధికారులు మాత్రం 383-2 సర్వే నంబర్‌లోని 3.39 ఎకరాల భూమిపై మాత్రమే స్టే ఉందని అంటున్నారు. ఈ సర్వే నంబర్‌ పక్కన, సర్వే నంబర్‌ 382-బిలో 61 సెంట్ల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయ భవనం కోసం గతంలో కేటాయించారని, అందులోనే భవన నిర్మాణం జరిగిందని అంటున్నారు. తహసీల్దారు ధ్రువీకరించిన ప్రాంతంలోనే భవనం నిర్మించారని, ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆర్టీఏ కార్యాలయానికి చెందిన ఓ అధికారి తెలిపారు.

రియల్‌ వ్యాపారం కోసమేనా..?

ఆర్టీఏ కార్యాలయ భవనాన్ని ఓ దాత నిర్మించారు. ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ భవంతిని స్వచ్ఛందంగా నిర్మించి ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్టీఏ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. దీంతో తాడిపత్రి మార్కెట్‌ యార్డులోని అద్దె భవనంలో కార్యాలయం కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భవనం లేకపోవడంతో దాత ముందుకు వచ్చారని అధికారులు సమర్థించుకుంటున్నారు. పట్టణంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, వాటికి భవనాలను నిర్మించడానికి రాని దాతలు ఆర్టీఏ కార్యాలయం విషయంలో ఎందుకు వచ్చినట్లు అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - Feb 01 , 2024 | 12:13 AM