Share News

శ్రీరంగ రంగా..

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:53 AM

సాంకేతిక విద్యాకేంద్రం జేఎనటీయూ అక్రమాలకు నిలయంగా మారిందని ఉద్యోగ, విద్యార్థి వర్గాలు మండిపడుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఒక పీఏను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేషీగా పనిచేసిన ఉద్యోగిని బదిలీ చేసిన ఉన్నతాధికారే మళ్లీ అదేపేషీలోకి వర్సిటీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ద్వితీయ పీఏగా నియమించు కోవడం పట్ల తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

శ్రీరంగ రంగా..

జేఎనటీయూకి అవినీతి మరక

ఉన్నతాధికారిపై అక్రమాల ఆరోపణలు

బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ముడుపులు

అభివృద్ధి పనుల్లో పర్సెంటేజీలు

వసూళ్లకు ప్రత్యేక పీఏ నియామకం

్గమండిపడుతున్న విద్యార్థి, ఉద్యోగ వర్గాలు

సాంకేతిక విద్యాకేంద్రం జేఎనటీయూ అక్రమాలకు నిలయంగా మారిందని ఉద్యోగ, విద్యార్థి వర్గాలు మండిపడుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఒక పీఏను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేషీగా పనిచేసిన ఉద్యోగిని బదిలీ చేసిన ఉన్నతాధికారే మళ్లీ అదేపేషీలోకి వర్సిటీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ద్వితీయ పీఏగా నియమించు కోవడం పట్ల తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగా పనిచేసేవారిని ఉన్నఫలంగా బదిలీ చేయడం. ఆమ్యామ్యాలిచ్చే వారికి మినహాయింపు ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా మారిందని విమర్శలున్నాయి. ముడుపులు చెల్లించనిదే ప్రమోషనల ఫైలు కదలదని ఆయా వర్గాలు వాపోతున్నాయి. విద్యా ర్థులు ఫీజు రూపంలో చెల్లిస్తున్న మొత్తాలతో సాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చినా పర్సెంటేజీలు తీసుకుని సంతకాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమం లో ఈనెల 17న పదవిలోనుంచి దిగిపోయిన అనంతరం తన అవినీతి బయటపడుతుందే మోనన్న భయంతో ఆ ఉన్నతాధికారి కలికిరి ఇంజనీరింగ్‌ కళాశాలలలో ప్రొఫెసర్‌గా పని చేయడానికి ట్రాన్సఫర్‌ ఆర్డర్స్‌ను సిద్ధం చేసుకున్నట్లు వర్సిటీ వర్గాల సమాచారం.

- అనంతపురం సెంట్రల్‌

రూ.లక్షల్లో ముడుపులు..

బదిలీల అంశంలో ఉన్నతాధికారి నియంతలా వ్యవహరించారని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఎవరిని ఎప్పుడు ఎక్కడికి బదిలీ చేస్తారోనన్న భయంతో నిత్యం వణికిపోయినట్లు వాపోతున్నాయి. వర్సిటీ పరిధిలోని అనంతపురం, కలికిరి, పులివెందుల ఇంజనీరింగ్‌ కళాశాలతో పాటు ఓటీపీఆర్‌ఐ, వర్సిటీ ఎగ్జామినేషన సెంటర్‌, అడ్మినిస్ర్టేషన బ్లాక్‌ ఈ ఆరింటిలో ఉద్యోగులను ఒక చోటనుంచి మరోచోటుకు బదిలీ చేస్తుంటారు. అనంతపురం జిల్లా కేంద్రం కావడంతో స్థిరనివాసాలు, పిల్లల చదువులు ఇలా అన్ని ఇక్కడే జరిగిపోతుంటాయి. దీంతో ఇక్కడే ఉండేందుకు చాలామంది ఉద్యోగులు ఆసక్తి చూపుతారు. దీన్ని అవకాశంగా తీసుకుని పులివెందుల, కలికిరికి బదిలీ చేయడం ముడుపులు పుచ్చుకుని తిరిగి అనంతపురానికి ట్రాన్సఫర్‌ చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీఏఎస్‌ పేరుతో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు అడ్డదారులు తొక్కారని మండిపడుతున్నాయి.

పర్సెంటేజీల వ్యాపారం...

టీడీపీ పాలనలో దాదాపు రూ.500కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టారు. లెక్చరర్‌ హాల్‌, ఫార్మసీ బిల్దింగ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, అకడమిక్‌ బిల్డింగ్‌, ఇండోర్‌ స్టేడియం వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు దిక్కించుకున్నా సబ్‌ కాంట్రాక్ట్‌ పేరుతో ఒక కాంట్రాక్టర్‌ మాత్రమే అత్యధిక పనులు చేస్తున్నారు. పనులు దక్కించుకునేది ఎవరైనా.. జేఎనటీయూలో పనిచేసేది, చేయాల్సింది తానేనన్న ధోరణితో దశాబ్దాలుగా ఆ కాంట్రాక్టర్‌ పాగావేశారు. దీని వెనుక ముడుపుల కథ ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపనికీ పర్సెంటేజీల్లేకుండా సంతకాలు కావడంలేదని సమాచారం. టెండర్‌ అంచనాలకు మించి అధిక మొత్తంలో, అడ్డదారుల్లో నిధులు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజుగా వసూలు చేసిన సొమ్మును ఎలా ధారపోస్తారని ప్రశ్నిస్తే.. పాపం కాంట్రాక్టర్లు అంటూ వారిపైనే సానుభూతి చూపుతున్నారని మండిపడుతున్నాయి.

దోచుకోవడమే లక్ష్యం

పదవులు పొందేందుకు రాజకీయ నాయకులకు చెల్లించిన ముడుపుల మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి విద్యార్థుల సొమ్ము దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ ఫ్యాకల్టీలో ఏ ఒక్కరికి సిఫార్సులు, ముడుపులు లేకుండా పదవులు వరించడంలేదు. అభివృద్ధి పనులను కూడా పర్సెంటేజీలతో నడిపిస్తున్నారు. వర్టిఈ ఉన్నతాధికారి ఈ మూడేళ్లలో సాగించిన అక్రమాలే ఇందుకు నిదర్శనం.

- వేమన, ఏఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు

అక్రమాల చిరునామా..

సాంకేతిక వనంలాంటి జేఎనటీయూను ఐదేళ్లలో అక్రమాలకు చిరునామాగా మార్చేశారు. ఒక వర్గం రాష్ట్రస్థాయిలో, ఇంకోవర్గం వర్సిటీలో అక్రమాల పర్వాన్ని సాగిస్తున్నారు. టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు నేటికీ సంపూర్ణంగా పూర్తిచేయలేదు. అర్హత, అనుభవం ఆధారంగా ప్రమోషనలు, ట్రాన్సఫర్‌లు చేపట్టలేదు. వీసీగా రంగజనార్దన ప్రతి పనికి ఒక రేటు పెట్టాడు.

- పరశురాం, టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పనికి ఆహార పథకంలా..

జేఎనటీయూని పనికి ఆహార పథకంలా మార్చిన వైసీపీ ప్రభుత్వం.. అధికారులు అడ్డంగా దోచుకునేందుకు రెడ్‌ కార్పెట్‌ పరిచింది. బదిలీలు, ప్రమోషనలకు లంచాలు. అభివృద్ధి పనులకు పర్సెంటేజీలు తీసుకుంటు న్న వర్సిటీ ఉన్నతాధికారే ఇందుకు నిదర్శనం. వైసీపీ నాయకుడి సిఫార్సుతో పదవిని పొందిన ఆయన అందుకు చెల్లించిన ముడుపుల ను మూడేళ్లుగా వసూలు చేస్తున్నాడు.

- కుళ్లాయిస్వామి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

సీతయ్యను తలపించాడు

ఉన్నతాధికారిగా వర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక అధికారాలను ఉపయోగించే అధికారం ఉంటుంది. అయితే ఈ ఉన్నతాధికారి మాత్రం తన స్వాభివృద్ధికోసం ఉద్యోగ, సిబ్బందిపై పడుతూ సీతయ్యను తలపించాడు. కార్యాలయంలో రూపొందించాల్సిన బదిలీల ఆర్డర్లను ఇంట్లో తయారు చేసి జారీచేశారు. అడ్డదిడ్డంగా బదిలీలు, ప్రమోషనలు చేస్తూ జేబులు నింపుకున్నాడు.

- పరమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 17 , 2024 | 12:53 AM