Share News

విద్యార్థులకు స్పాట్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:00 AM

జేఎనటీయూ పరిధిలో సీటు వచ్చిందంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. మంచి మార్కులు సాధిస్తే తప్ప అందులో సీటు రాదు. అటువంటి చరిత్ర ఉన్న కళాశాల పరిస్థితి రానురాను మసకబారుతోంది.

విద్యార్థులకు స్పాట్‌

పాఠాలు బోధించనివారితో స్పాట్‌వాల్యుయేషన

సరైనా జవాబుకూ సున్నా మార్కులు

వెరిఫికేషనలో బయటపడిన వైనం

అయోమయంలో విద్యార్థులు

అనంతపురం సెంట్రల్‌, జనవరి 2: జేఎనటీయూ పరిధిలో సీటు వచ్చిందంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. మంచి మార్కులు సాధిస్తే తప్ప అందులో సీటు రాదు. అటువంటి చరిత్ర ఉన్న కళాశాల పరిస్థితి రానురాను మసకబారుతోంది. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ జరగడం, జవాబులు కరెక్టుగా రాసినా సున్న మార్కులు వేస్తుండటం ఇందుకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడిన అధికారులను ఉన్నతాధికారులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలుసైతం వస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారవుతున్నాయంటున్నారు. తాము పరీక్షల్లో సరైన జవాబు రాసినా సబ్జెక్టుతో సంబంధంలేనివారితో మూల్యాంకనం చేయిస్తూ తమను అయోమయంలో పడేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసిన అనంతరం జవాబు పత్రాలను ఉమ్మడి ఐదు జిల్లాలనుంచి జేఎనటీయూకి తీసుకువస్తారు. ఇక్కడి నుంచి కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, నంద్యాలలో ఏర్పాటుచేసిన స్పాట్‌ వాల్యుయేషన సెంటర్లకు తరలించి మూల్యాంకనం చేయిస్తారు. ఏ సబ్జెక్టు బోధిస్తారో ఆ అధ్యాపకుడికి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను ఇచ్చి దిద్దించాలి. అయితే ఒకటి, రెండు సబ్జెక్టులు బోధించేవారికి అన్ని జవాబు పత్రాలను దిద్దించడం, ఇష్టమొచ్చినట్లు బండిల్‌ ఇష్యూచేయడం, కొందరికే రెగ్యులర్‌ డ్యూటీ వేయడం లాంటివి జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం ఫెయిల్‌ అవుతున్నారని అంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

జేఎనటీయూ పరీక్షల నిర్వహణ విభాగంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స(డీఈ), కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స (సీఈ), ముగ్గురు అసిస్టెంట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స(ఏసీఈ)తోపాటు డిప్యూటీ రిజిస్ర్టార్‌(డిఆర్‌), అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌(ఏఆర్‌) స్థాయిలో ఒక అధికారి మొత్తం ఆరుగురు రెగ్యులర్‌ అధికారులు పనిచేస్తున్నారు. ఆర్థిక పరమైన అంశాలను డీఆర్‌, ఏఆర్‌లు పర్యవేక్షిస్తారు. ఏసీ-3 పరిధిలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని చూస్తారు. ఏసీ-2లో బీటెక్‌ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, అందుకు తగిన ఫ్యాకల్టీలకు డ్యూటీ వేస్తారు. ఏసీ-1 ప్రశ్నపత్రాల రూపకల్పన, సర్టిఫికెట్స్‌ జారీ అంశాలను చూస్తారు. మిగిలిన పనులన్నీ చేయడానికి దాదాపు 80మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. మొత్తం కార్యకాలపాలను పర్యవేక్షించి వాటిని ఓకే చేయడానికి డైరెక్టర్‌ ఎవాల్యుయేషన(డీఈ) అధికారి ఉంటారు. ఇంత పకడ్బందీగా వ్యవస్థ ఉన్నా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయ సిఫార్సులు, ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుండటంతోనే పారదర్శకతకు, అనుభవానికి పాతరేస్తున్నారంటున్నారు.

వీసీకి ఓ విద్యార్థి లేఖ

జేఎనటీయూలో ఇటీవల ఓ విద్యార్థి వీసీకి లేఖ రాశాడు. ‘‘పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానని ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూకి వెళ్లాను. అందులో ఎంపికయ్యాను. అయితే ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాను. మంచి మార్కులు వస్తాయనుకున్న నేను ఫెయిల్‌ అవ్వడం ఏంటని ఫిజికల్‌ వెరిఫికేషనను వెళ్లాను. జవాబు పత్రాలను తెప్పించి తనకు బోధించిన అధ్యాపకుడికి చూపిస్తే ఆశ్చర్యపోయారు. సరైన సమాధానానికీ సున్న మార్కులు వేశారు. వెంటనే నేను రాసిన జవాబు పత్రాన్ని దిద్దించి త్వరగా నాకు రిజల్ట్‌ అనౌన్స చేయండి. నాకు ఉద్యోగం వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే నేను సాధించిన ఉద్యోగాన్ని కోల్పోతాను’’ అని వీసీకి లేఖ రాశాడు.

స్పందించని అధికారులు

విద్యార్థి లేఖ రాసి నెలరోజులైనా ఇంత వరకు అధికారులు స్పందించలేదు. ఒక కమిటీని నియమించి జవాబు పత్రాలను దిద్దించి వెంటనే రిజల్ట్‌ అనౌన్స చేస్తే ఆ విద్యార్థి ఉద్యోగం సాధిస్తాడు. అయితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది.

Updated Date - Jan 05 , 2024 | 12:00 AM