సార్లూ... దయచూపండి..!
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:19 AM
తమ భూమిని రెండేళ్ల కిత్రం ఆనలైనలో ఇతరుల పేర్ల మీదకు మార్చారని.. మళ్లీ తన పేరు మీదకు మార్చి న్యాయం చేయాలని ఉప్పునేసినపల్లి ఎరికల పుల్లమ్మ అధికారులను ఏడాదిపైగా వేడుకుంటోంది.
ధర్మవరంరూరల్, సెప్టెంబరు 20 : తమ భూమిని రెండేళ్ల కిత్రం ఆనలైనలో ఇతరుల పేర్ల మీదకు మార్చారని.. మళ్లీ తన పేరు మీదకు మార్చి న్యాయం చేయాలని ఉప్పునేసినపల్లి ఎరికల పుల్లమ్మ అధికారులను ఏడాదిపైగా వేడుకుంటోంది. శుక్రవారం స్థానిక తహసీల్దార్ ఎదుట తన ఆవేదనను ఇలా వ్యక్తం చేసింది. ‘ మాది ఉప్పునేసినపల్లి గ్రామం. చిగిచెర్ల గ్రామపొలంలో 176-4 సర్వేనెంబర్‌లో రెండు ఎకరాల భూమిని 30 సంవత్సరాల క్రితం ల్యాండ్ సీలింగ్‌లో నా భర్త ఎరికల క్రిష్ణయ్య పేరు మీద డిపట్టా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి వెబ్‌ల్యాండ్ నందు ఆనలైనలో తమపేరు మీద భూమి ఉందన్నారు. అయితే మాకు తెలియకుండా రెండేళ్ల క్రితం మా భూమిని రాహుల్‌రెడ్డి, చైతన్యరెడ్డి పేర్లమీద ఆనలైనలో ఎక్కించుకుని తీవ్ర అన్యాయం చేశారు.
వారిపేర్లు ఆనలైనలో తొలగించి మాకు న్యాయం చేయాలని సంవత్సరం నుంచి కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్ల అరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్నాం. ఇప్పటికే బ్యాంకు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. అయితే ఆనలైనలో భూమి లేకపోవడంతో బ్యాంకులో రెన్యువల్ కావడం లేదు. దీనిపై మీ కోసం స్పందనలో కూడా ఫిర్యాదు చేశా. అయిన ఇంతవరకు న్యాయం జరగలేదు. అధికారులు దయ చూపి నా సమస్యను పరిష్కరించండి.. ’ అని వేడుకుంటోంది.
విచారణ చేస్తున్నాం: నటరాజ, తహసీల్దార్
చిగిచెర్ల గ్రామ పొలంలో 176.4 సర్వే నెంబ రులో ఎరికల కృష్ణయ్య పేరు మీద ఉన్నభూ మి ఇతరులకు మారిందని బాధితులు మీ కోసంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నాం. ఇరువురిని పిలిపించి విచారణ చేసి తగు న్యాయం చేస్తాం.