Share News

వైసీపీకి షర్మిల గుబులు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:55 AM

సీఎం జగన సోదరి వైఎస్‌ షర్మిలకు పీసీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడంతో వైసీపీకి గుబులు పట్టుకుంది. నియోజకవర్గ ఇనచార్జ్‌ల మార్పుతో ఆ పార్టీ ముఖ్యులు ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. బాహాటంగానే ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులు సైతం ఇదే తరహాలో స్పందిస్తున్నారు

వైసీపీకి షర్మిల గుబులు

కాంగ్రె్‌సలోకి చేరికలు పెరిగే అవకాశం

అసమ్మతి నేతలకు ప్రత్యామ్నాయ వేదిక

ఇప్పటికే సిద్ధమైన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు

మరికొందరు అధికార పార్టీ నాయకులు కూడా..?

అనంతపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సీఎం జగన సోదరి వైఎస్‌ షర్మిలకు పీసీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడంతో వైసీపీకి గుబులు పట్టుకుంది. నియోజకవర్గ ఇనచార్జ్‌ల మార్పుతో ఆ పార్టీ ముఖ్యులు ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. బాహాటంగానే ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు. ఆ పార్టీ శ్రేణులు సైతం ఇదే తరహాలో స్పందిస్తున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు కావడంతో వైసీపీ అసంతుష్ట నేతలు ప్రత్యామ్నాయ వేదికగా కాంగ్రె్‌సను ఎంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీలో టికెట్లు ఆశించి భంగపడేవారు కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కొందరు నాయకులు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాంగ్రె్‌సలో చేరేందుకు కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నారని ఆయా నాయకుల సన్నిహితులు అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ వరుస ఓటములను ఎదుర్కొంటోంది. అంసెబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. పీసీసీ అధ్యక్షులను మార్చినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు టీ కాంగ్రె్‌సకు షర్మిల మద్దతు తెలిపారు. ఎన్నికల తరువాత టీవైసీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. తాజాగా షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించారు.

కాంగ్రెస్‌ గూటికి కాపు..?

రాయదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి స్థానంలో ఏపీఐఐసీ చైర్మన మెట్టు గోవిందురెడ్డిని నియోజకవర్గ ఇనచార్జ్‌గా వైసీపీ నియమించింది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గాన్ని కూడా కేటాయించలేదు. తాడేపల్లి ప్యాలె్‌సకు పిలిపించుకుని, టికెట్‌ లేదని మొహంమీదే చెప్పేశారు. దీంతో ఆయన అక్కడే తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. వైఎస్‌ కుటుంబాన్ని నమ్మినందుకు గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగనకు సెల్యూట్‌ అంటూ తనదైనశైలిలో ధిక్కారస్వరాన్ని వినిపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్‌ ఇస్తే... ఆ పార్టీ తరుపున, లేదంటే తాను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి, తన కుటుంబ సభ్యులు రాయదుర్గం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉంటామని అదే సందర్భంలో ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే... ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను చూసుకుంటున్నారన్నది తేటతెల్లమవుతోంది. వైఎస్‌ కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన కాపు రామచంద్రారెడ్డి, ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ గూటికి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డిని ఆయన కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అతి త్వరలో కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయన చేరడం ఖాయమని కాపు సన్నిహితులు అంటున్నారు. ఆయనతో పాటు రాయదుర్గం నియోజకవర్గంలోని మరికొంత మంది వైసీపీ నాయకులు కాంగ్రె్‌సలోకి వెళతారని సమాచారం.

వైసీపీపై షర్మిల ప్రభావం

పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమించిన నేపథ్యంలో ఆ ప్రభావం వైసీపీపై అధికంగా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీలో టిక్కెట్‌ దక్కనివారు, ఇప్పటి వరకూ ప్రాధాన్యం లభించనివారు పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ సామాజికవర్గంలో చీలికలకు తావుటుందని అంటున్నారు. ఆ సామాజికవర్గం నేతల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు చేపడితే... అధికార వైసీపీలోని అసంతృప్తితో రగిలిపోతున్న ఆ సామాజికవర్గం నేతలు కొందరు షర్మిల పక్షాన నిలిచే పరిస్థితులు లేకపోలేదు. ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీలోని కొందరు నేతలు చెబుతుండటం గమనార్హం. వైసీపీలో ఎమ్మెల్యేలకు తప్ప, ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఎక్కడా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. ఈ పర్యవసానాలే వారిని తమ పార్టీకి దగ్గర చేస్తాయనే భావన కాంగ్రెస్‌ నాయకుల్లో ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, శైలజనాథ్‌ ఇద్దరూ జిల్లావాసులే. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో వారికి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రె్‌సలో చేరికలకు కలిసొచ్చే అంశాలని చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. పీసీసీ చీఫ్‌గా షర్మిల ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వైసీపీలోని అసంతుష్టులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:55 AM