Share News

సమర శంఖారావం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:53 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన మలి విడత శంఖారావం దిగ్విజయమైంది. ‘అదిరిందన్నా.. లోకేశ అన్నా..’ అని శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది. సీఎం జగనరెడ్డి అరాచకాన్ని దీటుగా ఎదుర్కొని, రాబోయే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ శంఖారావ సభలను నిర్వహించారు. టీడీపీకి కంచుకోట హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం..

సమర శంఖారావం

జగన అరాచకపాలనపై విమర్శనాసా్త్రలు

జిల్లా ఘనతను కీర్తిస్తూ ప్రసంగాలు

నాటి అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసిన యువనేత

వంద పథకాలను రద్దు చేసిన జగనపై మాటల తూటాలు

శ్రేణుల్లో జోష్‌ నింపుతూ.. కూటమి ఐక్యతను చాటిన లోకేశ

ఉమ్మడి అనంతలో మలివిడత శంఖారావం సూపర్‌ సక్సెస్‌

అనంతపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన మలి విడత శంఖారావం దిగ్విజయమైంది. ‘అదిరిందన్నా.. లోకేశ అన్నా..’ అని శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది. సీఎం జగనరెడ్డి అరాచకాన్ని దీటుగా ఎదుర్కొని, రాబోయే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ శంఖారావ సభలను నిర్వహించారు. టీడీపీకి కంచుకోట హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం.. మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన, తాడిపత్రి నియోజకవర్గాల్లో సాగింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారవ్వడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. శంఖారావం వేదికగా పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడంతోపాటు బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై శ్రేణులకు లోకేశ దిశాదిర్దేశం చేశారు. అధికార పార్టీ తప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదని, ఎన్నికల కదనరంగంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. మరో రెండు నెలల్లో రాబోయే ప్రజా ప్రభుత్వంలో పార్టీ కేడర్‌ను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

జిల్లా కీర్తిని గుర్తుచేస్తూ..

శంఖారావం సభల్లో నారా లోకేశ ప్రసంగం సరికొత్తగా సాగింది. పార్టీ శ్రేణులు, ప్రజలను ఆకట్టుకుంది. ప్రతి సభలోనూ యువతను ఆకట్టుకుంటూ మాట్లాడారు. ‘అనంత యువత పవర్‌ అదిరిపోయింది’ అంటూ ఉత్సాహాన్ని పెంచారు. ఉమ్మడి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను గుర్తు చేశారు. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం, ప్రశాంతి నిలయం, చెన్నకేశవస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి అనంత అంటూ జిల్లాను కీర్తించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడ కియ కారు కనబడినా అనంత పేరు మార్మోగుతోందని అన్నారు. కరువు జిల్లా ప్రజల దార్షనికత, దాతృత్వాన్ని గొప్పగా చెప్పుకొచ్చారు. ఈ జిల్లా ప్రజలకు ఎవరైనా న్యాయం చేస్తే గుండెల్లో పెట్టుకొని కాపాడతారని, అన్యాయం చేస్తే తోలుతీసే శక్తి ఇక్కడి ప్రజలకు ఉందని అన్నారు. కరువు ప్రజల ఆత్మాభిమానం గొప్పదనాన్ని నారాలోకేశ తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలు మహా మొండివారని, అనుకున్నది సాధించేంత వారు నిద్రపోరని, ఎదుటోడిని నిద్రపోనివ్వరని అన్నారు. ఇలాంటి పవిత్ర నేలపై పర్యటనకు వచ్చిన తనను అక్కున చేర్చుకోవడం తన అదృష్టమని అన్నారు.

కరువు జిల్లాను ఆదుకున్నాం..

నారా, నందమూరి కుటుంబాలకు రాజకీయంగా పెద్ద పీట వేసిన ఈ జిల్లా అభివృద్ధికి ఎంత తోడ్పాటు అందించినా తక్కువేనని లోకేశ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు చంద్రబాబునాయుడు అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌, స్ర్పింక్లర్లు మంజూరు చేయడంతోపాటు పంటనష్టపోయిన ప్రతి రైతుకూ ఇనపుట్‌ సబ్సిడీ అందించి ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. వైసీపీ అరాచక పాలనలో విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడం తథ్యంగా కనిపిస్తోందని లోకేశ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, కరువు రైతుకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఆదుకునే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. తొమ్మిదిసార్లు కరెంటు చార్జీలు, మూడుసార్లు ఆర్టీసీ చార్జీలపెంపు, ఇంటి పన్ను, చెత్తపన్ను, పెట్రోల్‌, డీజిల్‌, గ్యా్‌స్‌, నిత్యావర వస్తు ధరలు పెంచి.. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన సైకో జగనను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని శంఖారావం సభల వేదికగా నారా లోకేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ హయాంలో పేదవాడి కడుపు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు, పేదలు సంతోషంగా పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో పండుగలకు ఇచ్చే కానుకలను జగన రద్దు చేశారని లోకేశ అన్నారు. పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, రంజాన తోఫా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్య, ఆరు లక్షల మంది వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛనలు, రైతులకు డ్రిప్‌ ఇరిగేషన పరికరాలు, ఇనపుట్‌ సబ్సిడీ.. ఇలా చెప్పుకుంటూపోతే 100 సంక్షేమ కార్యక్రమాలను కట్‌ చేసిన సైకో.. జగన అని విమర్శించారు. జగనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. అనేక ఆర్థిక నేరాల్లో ప్రిజనరీగా ఉన్న జగన కావాలో.. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు లాంటి విజనరీ కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ తేడాను గుర్తించి ప్రజలు రాబోవు ఎన్నికల్లో ఓటు ఆయుధంగా మలుచుకొని ప్రిజనరీని ఇంటికి పంపాలని కోరారు. సైనికుల్లా పనిచేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నారా లోకేశ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలకు జనం నీరాజనం పలికారు. భారీ కాన్వాయ్‌తో నారా లోకేశకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికడం ఈ పర్యటనలో విశేషం.

Updated Date - Mar 12 , 2024 | 12:53 AM