Share News

గొంతెండుతోంది..

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:40 PM

వేసవికి ముందే నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం నానా ప్రయాసలు తప్పడం లేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీటి ఎద్దడితో సుమారు 50 గ్రామాల ప్రజలు మైళ్లకు మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.

గొంతెండుతోంది..

ఫ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఫ బిందెడు నీటి కోసం వ్యవసాయ తోటలకు పరుగులు ఫ 50 గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు

ఫ కష్టాలు పడుతున్నా కన్నెత్తి చూడడం లేదు : అధికారులు, నాయకులపై ఆగ్రహంకళ్యాణదుర్గం, జనవరి 30 : వేసవికి ముందే నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం నానా ప్రయాసలు తప్పడం లేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. తాగునీటి ఎద్దడితో సుమారు 50 గ్రామాల ప్రజలు మైళ్లకు మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. బిందెడు నీరు దొరకాలంటే గగనంగా మారి పోయింది. కొందరు సర్పంచలు తాగునీటి సమస్య పరిష్కారానికి ముందుకు వస్తున్నా 350 అడుగుల నుంచి 450 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా నీరు పడడం లేదని వాపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే పాతాళగంగ ఏ స్థాయిలో అడుగంటిపోయిందో అర్థం అవుతోంది. దీంతో కొత్తబోర్లు వేయడానికి ఎవ్వరూ సాహసించలేకపోతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే నెలల తరబడి మంచినీటి సమస్యతో సతమతం అవుతున్నారు.

ఫ చాలా గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసే దుస్థితి నెలకొంది. కొద్దివరకు తాత్కాలిక ఉపశమనం లభించే శ్రీరామిరెడ్డి నీరు కూడా ఆగిపోవడంతో, సమస్య మ రింత జఠిలంగా మారింది. ఈ కన్నీటి కష్టాలు ఇంకా ఎన్నాళ్లు అంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ కంబదూరు మండల పరిధిలోని మర్రిమాకులపల్లిలో ఆరు నెలల నుంచి తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నారు. పొలాలకు కరెంటు వస్తే చాలు, బిందెడు నీటి కోసం బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎద్దుల బండ్లు, సైకిళ్లు, ఆటోల్లో నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఇదే గ్రామంలోనే ఎంపీ తలారి రంగయ్యను మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిలదీశారు. అయినప్పటికీ సమస్య తీరలేదు.

ఫ కళ్యాణదుర్గం పట్టణంలో సుమారు 50 వేల జనాభా ఉన్నారు. ఇక్కడా తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గమైన ఉషశ్రీచరణ్‌ ఇలాఖాలోనే కన్నీటి కష్టాలతో అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా మహిళలందరూ ఖాళీ బిందెలు చేతపట్టుకుని గుక్కెడు నీరివ్వండి..అంటూ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల నినాదాలు చేసి నిరసన చేపట్టారు. మంత్రి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు..ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరూ తాగునీటి సమస్య పరిష్కరించలేదని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:41 PM