Share News

Sand: దోచుకున్నోడికి దోచుకున్నంత !

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:31 AM

అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఇతర నియోజకవర్గాల అధికార పార్టీ నాయకులు పామిడి పెన్నానది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పామిడి పెన్నానది వైసీపీ నాయకుల ఆదాయానికి కల్పతరువుగా మారింది. పామిడి పెన్నానది శివారు ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సోలార్‌ ప్రాజెక్టు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

Sand: దోచుకున్నోడికి దోచుకున్నంత !
పోలీసుల అదుపులో ఉన్న టిప్పర్లు

పామిడి పెన్నాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

భూగర్భ జాలాలు అడుగంటుతాయని రైతుల ఆందోళన

పామిడి, ఏప్రిల్‌ 21: అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఇతర నియోజకవర్గాల అధికార పార్టీ నాయకులు పామిడి పెన్నానది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పామిడి పెన్నానది వైసీపీ నాయకుల ఆదాయానికి కల్పతరువుగా మారింది. పామిడి పెన్నానది శివారు ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సోలార్‌ ప్రాజెక్టు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా వారం రోజులపాటు రాత్రింబవళ్లు ఇసుకను తరలించి వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలోనే సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. పెన్నానది లోపలికి ఎవరూ రాకుండా పహారా ఉంచడంతో చుట్టుపక్కల రైతులు అభ్యంతరం చెప్పేందుకు భయపడ్డారు. నదిలో ఇసుక లోడింగ్‌ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అధికలోడ్‌తో ఇసుక టిప్పర్లు తిరిగితే తమ గ్రామానికి వేసిన తారు రోడ్డు ఛిద్రమవుతుందని కొండూరు గ్రామస్థులు రవాణాకు అడ్డు తగిలారు.


దీంతో అక్రమ రవాణా ఆలస్యంగా వెలుగుత చూసింది. అప్పటికే సుమారు రూ. 70 నుంచి 80లక్షల విలువ గల ఇసుక తరలించేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు, ఒక హిటాచి వాహనంను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇసుకను ఇలాగే తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటి తమ బోరుబావులు ఎండిపోతాయని, రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులు తమ సొంత అవసరాలకు ఇసుకను తరలిస్తే సవాలక్ష ప్రశ్నలతో వేధించే పోలీసులు అక్రమంగా భారీ స్థాయిలో తరలిస్తుంటే ఏం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.


అనుమతులు లేవు: రాజశేఖర్‌రెడ్డి, సీఐ, పామిడి.

పామిడి పెన్నానది నుంచి ఇసుకను తరలించేందుకు ఎవరికీ అనుమతులు లేవు. గతంలోనూ ఓ టిప్పర్‌ను అదుపులోకి తీసుకొని గనులు, భూగర్భ శాఖాధికారులకు అప్పగించాం. ఇసుక అక్రమ రవాణా చేపట్టడం చట్టరీత్యానేరం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన మూడు టిప్పర్లను అదుపులోకి తీసుకొని గనులు భూగర్భ శాఖకు అప్పగించాం. ఇసుక అక్రమ రవాణా చేపడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.

Updated Date - Apr 22 , 2024 | 12:31 AM