Share News

సొంత డబ్బుతో బోర్లకు మరమ్మతులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:53 PM

నియోజకవర్గంలో చాలా బోర్లు, తాగునీటి పథకాల మోటార్లు కాలిపోయాయనీ, వాటికి సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించినట్లు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు.

సొంత డబ్బుతో బోర్లకు మరమ్మతులు

వచ్చే ఎన్నికల్లో విజయం నాదే

తాడిమర్రి నుంచే ప్రచారం మొదలు

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

ధర్మవరం, ఫిబ్రవరి 28: నియోజకవర్గంలో చాలా బోర్లు, తాగునీటి పథకాల మోటార్లు కాలిపోయాయనీ, వాటికి సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించినట్లు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. తీవ్ర వర్షాభావంతో నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటిపోయి, తాగునీటి బోర్లు ఎండిపోయాయన్నారు. వేసవి కావడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యపై ఇటీవల జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబును కలిసి విన్నవించామన్నారు. కలెక్టర్‌ కొంతమేర స్పందించి తాగునీటి బోర్లకు మరమ్మతులు చేయించారన్నారు. కాలిపోయిన బోర్లు, మంచినీటి పథకాల మోటార్లకు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించానన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు తాగునీరు అందించేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ బావులకు కనీసం ఐదారు గంటలు కూడా నాణ్యమైన కరెంటు సరఫరా చేయకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. లో ఓల్టేజీ కారణంగా వందల సంఖ్యలో విద్యుత మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు 9 గంటలు నాణ్యమైన విద్యుత అందిస్తామని సీఎం జగన గొప్పలు చెప్పి, రైతులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతుండగా.. ధర్మవరం నియోజకవర్గంలో పాలేగాళ్ల రాజ్యం నడుస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాఫియాను ఏర్పాటు చేసుకుని, రూ.4వేల కోట్లు అక్రమంగా అర్జించాడని ఆరోపించారు. రూ.కోట్లు విలువ చేసే భూములను బెదిరించి, తక్కువ ధరకే లాక్కొన్నాడని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కేతిరెడ్డి ఓట్లు అడిగేందుకు వెళితే గుడ్డలూడదీసి తరిమికొడతారన్నారు. ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేస్తాననీ, లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ పాచికలేవీ పారవని స్పష్టం చేశారు. వచ్చేనెల మొదటి వారంలో తాడిమర్రి మండలం నుంచి ప్రచారం ప్రారంభిస్తానన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు డిష్‌రాజు, చిగిచెర్ల అరవిందరెడ్డి, తుంపర్తి పరమేశ, బోడగల గిరిధర్‌, దుస్సాక్రిష్ణ, గొట్లూరు చంద్ర, నబీరసూల్‌, నారాయణస్వామి యాదవ్‌, చిలకం సూర్యనారాయణరెడ్డి, సరితాల దస్తగిరి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

24 పోస్టులు... 1764 దరఖాస్తులు

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 28: రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న వాచమెన, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్స్‌ ఉద్యోగాలకు సంబంధించి 24 పోస్టులకు 1764 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే మెరిట్‌ జాబితాను ప్రకటిస్తామని, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వాటిని భర్తీ చేస్తామని అన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:53 PM