Share News

రియల్‌ ఎస్టేట్‌ కుదేలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:47 PM

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలయింది. జిల్లాల ఏర్పాటుతో పుంజుకుంటుందన్న ఆశతో కోట్లాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారు వడ్డీలు కూడా కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ కుదేలు
real esstate downfall

ఫ జాతీయ రహదారులతో పెరిగిన ధరలు

ధర్మవరం, జూన 8: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలయింది. జిల్లాల ఏర్పాటుతో పుంజుకుంటుందన్న ఆశతో కోట్లాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారు వడ్డీలు కూడా కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2022లో అనంతపురం జిల్లాను విభజించి కొత్తగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటవుతుందని వార్తలు రావడంతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల భూములకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా జగరాసుపల్లి, కప్పలబండ, మామిళ్లకుంట, జానకంపల్లితో పాటు కొత్తచెరువు మండల పరిసరాల్లో భూములు ఎకరా రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లు పలికాయి. దీంతో ఆ భూముల రైతులు ఆనందపడ్డారు. ఈ ఆనందం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. జిల్లా కార్యాలయాలకే భవనాలు లేనప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎక్కడ నిర్వహిస్తారోనన్న సందేహం మొదలైంది. సత్యసాయి జిల్లా ఏర్పాటుతో భూములు కొనుగోలు చేసిన వారు లాభాలు రావడంతో కొందరు వెంటనే క్రయవిక్రయాలు జరిపారు. ఇంకా కోట్లలో డబ్బు వస్తుందని ఆశపడ్డ వారికి నిరాశేఎదురైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు రియల్‌ఎస్టేట్‌ చేసేవారి నుంచి మామూళ్లు ఇవ్వాలని పట్టుపట్టడంతో వ్యాపారులు కనుమరుగయ్యారు. దీంతో ఐదేళ్ల వైసీపీ పాలనలో రియల్‌ఎస్టేట్‌ రంగం చతికిలపడింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది. సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ నుంచి కోడూరు చెక్‌ పోస్టు వరకు నాలుగు రహదారుల నిర్మాణాన్ని చేపట్టింది. బత్తలపల్లి నుంచి చెన్నై వరకు జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని శ్రీకారంచుట్టింది. ఉమ్మడి జిల్లా నుంచి రాజధాని అమరావతికి జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారంచుట్టడం, సత్యసాయిజిల్లాలోని కొత్తచెరువు మండల సమీపంలో రైల్వే జంక్షనకు సర్వే నిర్వహించడంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కొత్తచెరువు మండల కేంద్రంలో ఎకరా రూ.2కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు ధరలు పలుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో కోట్లాదిరూపాయలతో భూములను కొనుగోలు చేసి, వాటిని కొనేవారు లేక పూర్తిగా నష్టపోయామని పలువురు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు వాపోతున్నారు. ధర్మవరం సమీపంలోని పుట్టపర్తి రహదారి, చిగిచెర్ల, బత్తలపల్లి రహదారి, ఎనఎస్‌గేటు రహదారుల్లో కూడా భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాబోతుం డటంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:47 PM