పప్పుశనగకు వానదెబ్బ
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:39 AM
పప్పుశనగ దిగుబడులు దిగదుడుపుగా వస్తున్నాయి. రబీ ప్రారంభంలో వేసిన పప్పశనగ పంటను నల్లరేగడి రైతులు వారం నుంచి కోస్తున్నారు. గత ఏడాది అక్టోబరు రెండో వారం, నవంబరు మొదటి వారంలో పప్పుశనగ పంట వేశారు. పూత దశలో ఉన్నప్పుడు కురిసిన వర్షాలు నష్టం కలిగించాయి. పూత రాలిపోవడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడింది.

భారీగా తగ్గిన దిగుబడులు
మార్కెట్‌లో తగ్గుతున్న ధరలు
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
పప్పుశనగ దిగుబడులు దిగదుడుపుగా వస్తున్నాయి. రబీ ప్రారంభంలో వేసిన పప్పశనగ పంటను నల్లరేగడి రైతులు వారం నుంచి కోస్తున్నారు. గత ఏడాది అక్టోబరు రెండో వారం, నవంబరు మొదటి వారంలో పప్పుశనగ పంట వేశారు. పూత దశలో ఉన్నప్పుడు కురిసిన వర్షాలు నష్టం కలిగించాయి. పూత రాలిపోవడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడింది. ఎకరాకు కనీసం ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించిన రైతులకు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిరాశేమిగిలింది. కల్లాలు చేసిన రైతులు అతి తక్కువగా వచ్చిన పప్పుశనగ దిగుబడిని చూసి దిగులు చెందారు. రబీలో తొలి వర్షాలకు వేసిన పంట దిగుబడి ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్లకు మించడం లేదు.
- గుంతకల్లు
తగ్గిన ధరలు
పప్పుశనగ ధర మార్కెట్‌లో నెల కిందట క్వింటం రూ.6,800 ఉన్నింది. క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.5,600-5,650 ధర పలుకుతోంది. వచ్చే నెలలో పంట కోతలు పెరిగి, ఎక్కువ దిగుబడులు మార్కెట్‌లోకి వస్తాయి. అప్పుడు రేటు మరింత తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబరులో పంటలు పెట్టిన రైతులకు ఎకరాకు రూ.6 వేలదాకా ఖర్చయిందని, రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడిని ప్రస్తుత ధరలకు అమ్ముకుంటే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రేటు తగ్గుతుందన్న నమ్మకంతో వ్యాపారులు రైతుల నుంచి పప్పుశనగ దిగుబడులను కొనడంలేదు.
మూడు క్వింటాళ్లే..
నాకున్న ఆరెకరాల పొలంలో అక్టోబరు 15వ తేదీన పప్పుశనగ పంటపెట్టాను. పూత దశలో వర్షం కురిసి ఆశలపై నీళ్లు చల్లింది. దిగుబడి తగ్గి.. ఎకరానికి మూడు క్వింటాళ్లు వచ్చింది. వర్షం కురవకపోయుంటే మంచి దిగుబడి వచ్చేది. మార్కెట్‌లో ధర కూడా తగ్గిపోయింది. రానున్న రోజుల్లో మరింత తగ్గే ప్రమాదం ఉంది. రెండేళ్ల కిందటి దిగుబడిని శీతల గిడ్డంగిలో ఉంచాను. రేటు రాని కారణంగా వడ్డీ కట్టి నష్టానికి అమ్ముకున్నాను. ఈ ఏడాది ఎకరాకు రూ.6 వేలదాకా ఖర్చు చేశాను. నష్టాలు తప్పేలా లేవు.
- ఉమేశ, గుంతకల్లు రైతు
కౌలు డబ్బూ వచ్చేలా లేదు..
ఎకరానికి రూ.11 వేల ప్రకారం 50 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. 30 ఎకరాలలో పప్పుశనగను, 20 ఎకరాలలో కంది సాగుచేశాను. పప్పుశనగ దిగుబడి ఎకరాకు 2, 3 క్వింటాళ్ల కంటే వచ్చేలా కనిపించడంలేదు. కౌలు డబ్బయినా వస్తుందో లేదో తెలియడంలేదు.
-లాలెప్ప, గుంతకల్లు రైతు