Share News

పాపం... గుత్తి..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:22 PM

రైళ్ల రాకపోకలతో సందడిగా ఉండే గుత్తి రైల్వే జంక్షన కళావిహీనమైంది. గుంతకల్లు-ఖాదర్‌పేట-కల్లూరు డబుల్‌ లైన కారణంగా పలు రైళ్లను గుత్తి మీదుగా రాకుండా చేశారు. బైపా్‌స లైన కారణంగా గత సంవత్సరంలో మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ అప్‌ అండ్‌ డౌన రైళ్లను కూడా గుత్తి స్టేషనకు రాకుండా చేశారు.

పాపం... గుత్తి..!

పేరుకే రైల్వే జంక్షన

ఉన్న రైళ్లన్నీ దారి మళ్లింపు

బైపాస్‌ లైనతో మరో రైలు కోత

గుత్తి ఆర్‌ఎస్‌లో దెబ్బతిన్న వ్యాపారాలు

కాంట్రాక్టు రద్దు చేసుకుని వెళ్లిన క్యాటరర్‌

ఊరికి దూరంగా గుత్తి కోట స్టేషన

ఆనలైనలో వెతికినా కనిపించదు..

అది కోట స్టేషన కాదు.. ఫోర్ట్‌ క్యాబిన..!

గుంతకల్లు/గుత్తి, ఫిబ్రవరి 27: రైళ్ల రాకపోకలతో సందడిగా ఉండే గుత్తి రైల్వే జంక్షన కళావిహీనమైంది. గుంతకల్లు-ఖాదర్‌పేట-కల్లూరు డబుల్‌ లైన కారణంగా పలు రైళ్లను గుత్తి మీదుగా రాకుండా చేశారు. బైపా్‌స లైన కారణంగా గత సంవత్సరంలో మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ అప్‌ అండ్‌ డౌన రైళ్లను కూడా గుత్తి స్టేషనకు రాకుండా చేశారు. ‘గుత్తి పట్టణవాసుల సౌకర్యార్థం.. గుత్తికోట రైల్వేస్టేషన’ అని ఊదరగొట్టిన రైల్వే అధికారులు.. ఆ స్టేషనకు ఒక రైలునే కేటాయుంచారు. గుత్తి పట్టణానికి 2 కి.మీ. దూరంలో దీన్ని నిర్మించారు. ఇది ప్రజలకు ఏమాత్రం అనువుగా లేదు. గుత్తి పట్టణానికి సమీపంలో ‘గౌతమపురి’ పేరిట హాల్ట్‌ స్టేషనను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. కానీ బైపాస్‌ లైనమీద, ప్రజలకు ఉపయోగపడనిచోట దీన్ని నిర్మించారు. అక్కడ కేవలం ఒక ఎక్స్‌ప్రె్‌స అప్‌ అండ్‌ డౌన రైళ్లను మాత్రమే నిలుపుతున్నారు. కోట్లు వెచ్చించి కట్టిన ఈ స్టేషనకు ‘గుత్తి కోట స్టేషన’ అని బోర్డు పెట్టారేగానీ.. ఆనలైన మాత్రం ఈ పేరుతో వెదికితే వివరాలు కనిపించవు. ఆనలైనలో ‘ఫోర్ట్‌ క్యాబిన’ అని చూపించారు.

మళ్లిపోయిన రైళ్లు

గుంతకల్లు-ఖాదర్‌పేట-కల్లూరు డబ్లింగ్‌ లైన కారణంగా ఆ రూటు ట్రాఫిక్‌ సామర్థ్యం పెరిగింది. గుత్తికి వెళ్లకుండా నేరుగా తీసుకెళ్తే దాదాపు 25 కి.మీ. దూరం తగ్గుతుంది. ఇలా చేస్తే ఇంధనం పొదుపు అవుతుందని గుత్తి మీదుగా వెళ్లే రైళ్లను ఒక్కొక్కటిగా ఖాదర్‌పేట్‌ మీదుగా మళ్లించారు. గతంలో గుత్తి మీదుగా వెళ్లే కేకే ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12627/28), కుర్లా ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11013/14), బసవ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 17308/07), బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌ (16578/79), ఉద్యాన ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11301/02), హంపి ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16591/92), అహ్మదాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22690/91) రైళ్లను కల్లూరు-గుంతకల్లు లైన ద్వారా పంపుతున్నారు. బెంగళూరరు-తిరుపతి రైల్వే మార్గాలను కలుపుతూ నిర్మించిన బైపాస్‌ లైనపై గుత్తి కోట రైల్వే స్టేషనను నిర్మించారు. గుత్తిలో నిలిచే ధర్మవరం-మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ (నెం. 17215/16) రైలును జంక్షనలోనికి రానివ్వకుండా, గుత్తి కోట స్టేషనలో హాల్ట్‌ కల్పించారు. ఇలా వివిధ కారణాలతో గుత్తికి వచ్చే రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. స్టేషనలో వ్యాపారాలు లేకుండా పోయాయని స్టాల్స్‌ నిర్వాహకులు వాపోతున్నారు. కేరళకు చెందిన ఓ క్యాటరింగ్‌ స్టాల్‌ నిర్వాహకుడు తన కాంట్రాకును అర్ధంతరంగా రద్దుపరచుకుని వెళ్లిపోయాడంటే.. ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కోట స్టేషనకు కష్టాలు

గుత్తి పట్టణానికి రైల్వే స్టేషన దూరంగా ఉందని, గుంతకల్లు రోడ్డులో.. రైలు వంతెన పక్కన ఓ హాల్ట్‌ స్టేషనను నిర్మించాలని స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. పట్టణవాసులు కోరిన చోట రైల్వే అధికారులు సర్వే చేశారు. భూసేకరణ వీలుకాలేదని తెలిపి ఆ ప్రతిపాదనకు తిలోదకాలిచ్చారు. బైపాస్‌ లైన నిర్మాణ సమయంలో సరుకు రవాణా రైళ్ల అవసరార్థం గుత్తి కోట స్టేషనను నిర్మించారు. అక్కడ కేవలం ఒక రైలును నిలుపడానికి మాత్రమే అనుమతినిచ్చారు. మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ అప్‌ అండ్‌ డౌన రైళ్లు పగటి వేళ ఈ స్టేషనకు వస్తుంటాయి. అయినా, కర్నూలు రోడ్డులోని ఈ స్టేషన నుంచి ఇళ్లకు చేరడానికి సరైన రవాణా సదుపాయం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. స్టేషనకు ఎలాగోలా వెళ్లగలుగుతున్నారుగాని, రైలు దిగి గుత్తి పట్టణంలోకి రావాలనుకున్న వారికి సమస్యలు ఎదురౌతున్నాయి.

ఈ రైళ్లనైనా ఆపండి..

మళ్లింపుల కారణంగా గుత్తి స్టేషనకు రైళ్లు తగ్గిపోయాయి. ఇక్కడ నిలవకుండా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనైనా ఆపి.. ప్రయాణికులకు ఉపయోగపడేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12976/75), ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12708/09), అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12765/66), మధురై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22715/16), జబల్పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12194/95) రైళ్లు గుత్తి మీదుగా వెళ్తున్నాయి. కానీ ఆగడం లేదు. వీటిని ఆపినా తమకు ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. విశాఖపట్టణం-కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (నెం. 17487/88) రైలును గుత్తి మీదుగా గుంతకల్లు వరకూ పొడిగించాలని గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

అవస్థలు పడుతున్నాం..

గతంలో గుత్తి నుంచి ఢిల్లీ, షిరిడీకి వెళ్లడానికి

అనుకూలంగా ఉండేది. రైళ్ల మళ్లింపు కారణంగా గుంతకల్లుకు వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైల్వే శాఖ అధికారులు స్పందించి, గుత్తిలో ఆపకుండా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెండు నిమిషాలు ఆగేలా చూడాలి.

- మహబూబ్‌ బాషా, ప్రయాణికుడు, గుత్తి

రైళ్ల మళ్లింపుతో ఇబ్బందులు..

రైళ్లను కల్లూరు-గుంతకల్లు రూటులోకి మళ్లించడంతో గుత్తి రైల్వే స్టేషనకు ప్రయాణికులు రావడం తగ్గిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే గుంతకల్లుకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోంది. గుత్తి మీదుగా వెళ్లే రైళ్లను మళ్లించడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. యశ్వంతపూర్‌-విజయవాడ ప్యాసింజరు రైలును పునరుద్ధరించాలి. మచిలీపట్నం రైలును గుత్తి స్టేషనకు తీసుకురావాలి.

- జీఎం బాషా, డీఆర్‌యూసీసీ మాజీ సభ్యుడు

జీవనోపాధి దెబ్బతింది..

గుత్తి మీదుగా వెళ్లే రైళ్లను దారిమళ్లించారు. దీంతో స్టేషనలో క్యాటరింగ్‌ స్టాల్స్‌ వ్యాపారాలు తగ్గిపోయాయి. మా జీవనోపాధి దెబ్బతింది. తక్కువ రైళ్ల కారణంగా వ్యాపారాలు దెబ్బతిని నష్టాలు వస్తున్నాయి. మచిలీపట్టణం ఎక్స్‌ప్రెస్‌ను కూడా గుత్తి కోట స్టేషనకు మార్చారు. ప్రయాణికులు గుత్తి స్టేషనకు రావడం లేదు.

- శ్రీనివాసులు, స్టేషన హాకర్‌

Updated Date - Feb 27 , 2024 | 11:22 PM