దంపతుల మధ్య గొడవ..తోడల్లుడికి కత్తిపోట్లు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:16 AM
దంపతుల గొడవలో తలదూర్చి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైన సంఘటన ఆదివారం కళ్యాణదుర్గంలోని లిటిల్ రోజస్ స్కూలు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు సురేంద్ర, సరస్వతి దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
కళ్యాణదుర్గంరూరల్, జనవరి 28: దంపతుల గొడవలో తలదూర్చి ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైన సంఘటన ఆదివారం కళ్యాణదుర్గంలోని లిటిల్ రోజస్ స్కూలు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు సురేంద్ర, సరస్వతి దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సరస్వతి తన అక్క సుకన్య, బావ రాజన్నలను ఇంటికి పిలిపించుకుంది. భార్యభర్తలు సురేంద్ర, సరస్వతిల మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సరస్వతిపై భర్త సురేంద్ర కత్తితో దాడికి యత్నించాడు. గొడవను ఆపేందుకు తోడల్లుడైన రాజన్న అడ్డు వచ్చాడు. ఈక్రమంలో రాజనప్పపై సురేంద్ర కత్తితో దాడి చేశాడు. దీంతో రాజన్న గుండె కింది భాగంలో కత్తిపోట్లు పడ్డాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సురేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.