Share News

ప్రీపెయిడ్‌ కరెంటు..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:30 AM

రైతుల పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. వ్యవసాయానికి ఉచిత విద్యత మంగళం పాడే దిశగా అడుగులు వేస్తోంది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత మీటర్లు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యవసాయ మోటార్లకు ఈ మీటర్లు బిగిస్తే రైతులు ముందుగా విద్యుత కోసం రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రీపెయిడ్‌ కరెంటు..!
స్మార్ట్‌ మీటర్ల

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు

రీచార్జి ఆలస్యమైతే అంధకారమే..

ప్రీపెయిడ్‌పై వినియోగదారుల్లో వ్యతిరేకత

రాయితీ ఉంటుందా.. ఊడుతుందా

అని ఎస్సీ, ఎస్టీల్లో అయోమయం

ఎన్నికల తర్వాత రుద్దుడుకు సిద్ధం..!

పుట్టపర్తిరూరల్‌

రైతుల పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. వ్యవసాయానికి ఉచిత విద్యత మంగళం పాడే దిశగా అడుగులు వేస్తోంది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత మీటర్లు బిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యవసాయ మోటార్లకు ఈ మీటర్లు బిగిస్తే రైతులు ముందుగా విద్యుత కోసం రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత విద్యుతపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రీచార్జి, ఉచిత విద్యుతపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉచిత విద్యుతకు మంగళం పాడేస్తారోమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. విద్యుత రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను రాష్ట్రప్రభుత్వం తూచ తప్పకుండా అమలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తాజాగా అన్ని విద్యుత సర్వీసులకు ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి రైతుల ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, పట్టాదారు పాసుబుక్కు నకలు సేకరిస్తున్నట్లు రైతన్నలు చెబుతున్నారు.

రీచార్జి చేయకుంటే అంధకారమే..

జిల్లాలో అన్నిరకాల విద్యుత కనెక్షన్లు 5.16 లక్షలున్నాయి. వీటిలో వ్యవసాయ సర్వీసులు 1.29 లక్షలు, వాణిజ్యానికి సంబంధించి 48297 ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ సంస్థలు, 200 యూనిట్ల పైబడి విద్యుత వినియోగించే వాణిజ్య ఇతర సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చనున్నట్లు తెలుస్తోంది. తద్వారా విద్యుత వినియోగంలో కచ్చితత్వం ఉంటుందన్నది రాష్ట్రప్రభుత్వ వాదన. ఇవి ప్రీపెయిడ్‌ మీటర్లు. సెల్‌ఫోన ప్రీపెయిడ్‌ రీచార్జి తరహాలో పనిచేస్తాయని సమాచారం. ఫోనకు ఎలాగైతే గడవులోపు రీచార్జి చేయకపోతే.. సేవలు ఆగిపోతాయో.. విద్యుత స్మార్ట్‌మీటర్లు కూడా అంతే. అంధకారమే. ఇలాంటి ప్రీపెయిడ్‌ విద్యుత మీటర్ల విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విధానంలో ప్రతినెలా సెల్‌ఫోన ద్వారా కరెంటు రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, వాటి పథకాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వెంటనే ప్రారంభించి డిసెంబరు 2030 నాటికి ప్రతి కనెక్షన స్మార్ట్‌ మీటరు (ప్రీపెయిడ్‌) ఏర్పాటు చేయాలని విద్యుత పంపిణీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటి ఏర్పాటుకు నిర్ధేశిత కాల వ్యవధిని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం దశలవారీగా రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని వినియోగదారులందరికీ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల కార్యాలయాల విషయంలో ప్రీపెయిడ్‌ మీటర్ల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చ సాగుతోంది. రీచార్జి చేసుకుని, విద్యుత వాడుకునే పరిస్థితి ప్రస్తుతానికి ఏ కార్యాలయానికీ లేదు. ఇప్పటికే వివిధ రకాల నిధులు ప్రభుత్వం దారి మళ్లిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో కొందరు సర్పంచలు సొంత నిధులతో ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు నెలానెలా విద్యుతకు ముందస్తు పెట్టుబడి ఎవరు పెడతారన్నదే సర్వత్రా వ్యక్తమవుతున్న ప్రశ్న. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాలకు సంబంధించి సుమారు రూ.538 కోట్ల విద్యుత బకాయలు ఉన్నాయి. వీటి వసూలుకు విద్యుత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుడప్పుడూ కార్యాలయాలకు విద్యుత సరఫరా నిలిపి వేస్తున్నారు కూడా. ఆ సమయంలో కొంత మొత్తం చెల్లించి, విద్యుత సరఫరా పునరుద్ధరించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే ముందస్తుగా రీచార్జి చేసుకుని తీరాలి. ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందనే సందేహం తలెత్తుతోంది.

ఎస్సీ, ఎస్టీలకు వర్తిస్తుందా?

విద్యుత పంపిణీలో పేద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే వీరికి రాయితీలు ఎలా అందిస్తారన్న సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం వీటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో పేద ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా విద్యుత అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే సెల్‌ఫోన తరహాలో ముందుగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఉచిత విద్యుత్తుపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గుబులు పట్టుకుంది. ఉచిత విద్యుత్తుకు మంగళం పాడేస్తారేమోనన్న అందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.

అయోమయంలో రీడర్లు

స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుపై రీడర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి విద్యుత వాడకంపై బిల్లులు అందజేసే రీడర్లు.. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏమవుతోందోననే అందోళనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 450 మంది వరకు రీడర్లు పనిచేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే ఇక నేరుగా బిల్లు ఇచ్చే అవసరం ఉండదు. సెల్‌ఫోనకే మెసేజ్‌లు వెళ్లిపోతాయి. దీంతో రీడర్ల అవసరం ఉండదనే విషయం వారికి ఉన్నతాధికారులు చెప్పడంతో తమ ఉపాధికి ఎక్కడ ఎసరు వస్తుందోననే ఆందోళనలో రీడర్లు ఉన్నారు.

ఎన్నికల తర్వాత రుద్దుడే

వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియపై జిల్లాలో అనేకచోట్ల రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇందులో భాగంగా గత నెలలో మడకశిర మండలం కల్లుమర్రి ప్రాంతంలో మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమంలో భాగంగా విద్యుత శాఖ అధికారులకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత రైతన్నలకు రుద్దుడు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రతిపాదన దశలో ఉంది

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ఇంకా సమయం పడుతుంది. ప్రతిపాదనల దశలోనే ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటాం.

- మోషెస్‌, డీఈ, ఎస్పీడీసీఎల్‌

Updated Date - Feb 27 , 2024 | 12:30 AM