Share News

ఇది పోలింగ్‌ కేంద్రమే..!

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:15 AM

కిటికీ తలుపులు ఊడిపోయాయి. పైకప్పు దెబ్బతింది. పెచ్చులు ఊడిపడుతున్నాయి. పడుతూనే ఉన్నాయి. గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం వీలుకాక బయట షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు.

ఇది పోలింగ్‌ కేంద్రమే..!
పెచ్చులూడిన తరగతి గది పైకప్పు

కిటికీ తలుపులు ఊడిపోయాయి. పైకప్పు దెబ్బతింది. పెచ్చులు ఊడిపడుతున్నాయి. పడుతూనే ఉన్నాయి. గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో విద్యార్థులకు పాఠాలు చెప్పడం వీలుకాక బయట షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. అలాంటి పాఠశాలను ఏకంగా పోలింగ్‌ బూతగా ఎంపిక చేశారు. కనీస సౌకర్యాలు లేకున్నా.. అన్నీ ఉన్నట్లు జిల్లా ఉన్నతాధికారులకు మండల యంత్రాంగం నివేదికలు పంపింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. రొద్దం మడలంలోని చిన్నకోడిపల్లిలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పోలింగ్‌ బూతగా ఎంపిక చేశారు. 20వ నంబరు కూడా కేటాయించారు. అక్కడ సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి.

అన్నీ ఉత్తమాటలే..

ప్రభుత్వం నాడు-నేడు కింద గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ది ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్య అందిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నయనడానికి చిన్నకోడిపల్లి పాఠశాలే నిదర్శనం. పాఠశాలలో 5వ తరగతి వరకు 9 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు తరగతి గదులు ఉన్నాయి. కిటికీలు, కరెంటు, నీటి సౌకర్యం లేకపోగా.. పాఠశాల పైకప్పు కారుతోంది. నాడు-నేడు కింద ఎంపికకాకపోగా.. మరమ్మతులకు ఐదేళ్లుగా నయాపైసా ఇవ్వకపోవడంతో పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థులకు పాఠశాల బయట ఉన్న రేకుల షెడ్డులో పాఠాలు చెబుతున్నారు. ఇటీవల రూ.26 వేలు మరమ్మతుల కోసం ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో రూ.13వేలు అన్నమయ్య జిల్లాలోని ఓ పాఠశాల కోసమని వెనక్కి తీసుకున్నారు. మిగిలిన రూ.13 వేలతో అరకొరగా మరమ్మతులు చేపట్టారు. రెండు తరగతి గదుల మరమ్మతుల కోసం సుమారు రూ.4 లక్షలు అవసరం ఉండగా.. రెవెన్యూ, విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవలే చిన్నకోడిపల్లి పాఠశాలను 20వ పోలింగ్‌ బూతగా గుర్తించారు. ఇందులో అన్ని సౌకర్యాలున్నట్లు తహసీల్దార్‌, ఎంపీడీఓ, విద్యాశాఖాధికారి.. జిల్లా ఉన్నతాధికారికి నివేదిక పంపడం శోచనీయం. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలో ఎన్నికల విధులు ఎలా నిర్వహిస్తారో వారికే తెలియాలి.

రొద్దం

Updated Date - Feb 29 , 2024 | 12:15 AM