Share News

ఎన్నికలకు దూరం పెట్టండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:41 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అన్బురాజనపై కేంద్ర ఎన్నికల కమిషన బదిలీ వేటు వేసింది. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే వీరి బదిలీకి కారణమని స్పష్టమౌతోంది. ఓటరు జాబితా సవరణ విషయంలో జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయి. పర్యవేక్షణ అధికారులు, బీఎల్వోలు అధికారపార్టీ నేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ సహా ఇతర పార్టీలు ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశాయి.

ఎన్నికలకు దూరం పెట్టండి

కలెక్టర్‌, ఎస్పీపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీవేటు

జీఏడీలో రిపోర్ట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ గౌతమికి ఆదేశం

డీజీపీకి రిపోర్ట్‌ చేసుకోవాలని ఎస్పీ అన్బురాజనకు..

తక్షణమే అమలులోకి వచ్చిన ఉత్తర్వులు

అధికార పార్టీతో అంటకాగిన ఫలితం..?

అనంతపురం టౌన/క్రైం, ఏప్రిల్‌ 2: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమి, ఎస్పీ అన్బురాజనపై కేంద్ర ఎన్నికల కమిషన బదిలీ వేటు వేసింది. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే వీరి బదిలీకి కారణమని స్పష్టమౌతోంది. ఓటరు జాబితా సవరణ విషయంలో జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయి. పర్యవేక్షణ అధికారులు, బీఎల్వోలు అధికారపార్టీ నేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీ సహా ఇతర పార్టీలు ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశాయి. ఉరవకొండ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వేలకు పైగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. దీని గురించి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు పట్టించుకోక పోవడంతో స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన అధికారులు స్వయంగా ఉరవకొండకు వచ్చి విచారించారు. అక్రమాలు నిజమేనని తేల్చారు. వారి ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఇద్దరు జడ్పీ సీఈఓలను (భాస్కర్‌ రెడ్డి, శోభా స్వరూప రాణి) సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత ఓటరు జాబితాపై ఇంటింటి సర్వే నిర్వహించి, తప్పులను సవరించాలని ఎన్నికల కమిషన ఉత్తర్వులు ఇచ్చింది. దాదాపు రెండునెలలు ఈ సర్వే సాగినా, తప్పులు పునరావృతమయ్యాయి. దీనిపై టీడీపీ జిల్లా నేతలు కలెక్టరును కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె సరిగా స్పందించలేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషనను కలిశారు. రాష్ట్రంతోపాటు జిల్లాలో ఓటరు జాబితాలో అక్రమాలు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కలెక్టరు గౌతమిని కేంద్ర ఎన్నికల కమిషన బదిలీ చేసినట్లు స్పష్టమౌతోంది.

అంటకాగిన ఐపీఎస్‌..!

ఎస్పీ అన్బురాజన బదిలీకి అధికార పార్టీ నాయకులతో ఆయన సావాసమే కారణమని సమాచారం. గత ఏడాది సెప్టెంబరు 17న అన్బురాజన జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కడప జిల్లా నుంచి వచ్చిన ఆయన.. అక్కడ నాలుగేళ్లకు పైగా పనిచేశారు. ఆ సమయమంతా వైసీపీ నేతలతో అంటకాగారని, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ అధికారులపైనే కేసు నమోదు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లాకు వచ్చాక కూడా ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు కొనసాగాయి. ఆ పార్టీ నాయకులు తప్పు చేసినా చర్యలు తీసుకోలేకపోయారు. ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై సీఎం జగన సమక్షంలోనే.. సిద్ధం సభలో అధికార పార్టీ వారు దాడి చేశారు. దాడి దృశ్యాల వీడియోలు లభించాయి. దాడి చేస్తున్నది ఎవరో స్పష్టంగా కనిపించింది. ప్రజలు సైతం దాడిచేసినవారి వివరాలను బయటపెట్టారు. ‘మా ఊరివాడే..’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ దాడి గురించి పోలీసు శాఖ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ఒకరిపై కేసు కట్టి జైలుకు పంపారు. మిగిలిన వారిని పట్టుకోవాలన్న ఆలోచనే చేయలేదు. ‘ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్నా.. రా..’ అని బండి రవి సవాలు విసిరినా.. పోలీసులు బేలతనం ప్రదర్శించారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరుడు అశోక్‌నూ పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆ కేసు ఏమైందో కూడా బయటకు చెప్పడం లేదు. అధికార పార్టీవారికి పోలీసులు ఏ స్థాయిలో లొంగి పనిచేస్తున్నారో ఈ ఘటనే ఉదాహరణ. ఇక కర్ణాటక మద్యాన్ని జిల్లాలో ఎందుకు అరికట్టలేకపోయారని ఎన్నికల కమిషన ప్రత్యేకంగా పిలిపించి అడిగితే.. ఎస్పీ అన్బురాజన ఇచ్చిన సమాధానం వారిని నివ్వెరపరిచిందట. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయని, ప్రస్తుతం కర్ణాటక మద్యం అక్రమ రవాణా తగ్గిందని చెప్పారట. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని తేలడంతో ఆయనను బదిలీ చేశారని సమాచారం.

ఇనచార్జి కలెక్టర్‌గా జేసీ కేతనగార్గ్‌

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 2: కలెక్టర్‌ గౌతమి బదిలీ నేపథ్యంలో ఇనచార్జి కలెక్టరుగా జేసీ కేతన గార్గ్‌ మంగళవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల కమిషన ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్‌ గౌతమి మంగళవారం రాత్రి రిలీవ్‌ అయ్యారు. సీఈసీ సూచనల మేరకు కేతన గార్గ్‌కు బాధ్యతలు అప్పగించారు. కొత్త కలెక్టరు వచ్చేవరకూ ఆయన జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.

ఇనచార్జి ఎస్పీ.. విజయభాస్కర్‌ రెడ్డి

ఎస్పీ అన్బురాజన మంగళవారం రాత్రి విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు తన కిందిస్థాయి కేడర్‌ అధికారి, ఏఎస్పీ ఆర్‌.విజయభాస్కర్‌ రెడ్డికి బాధ్యతలను అప్పగించారు. కొత్త ఎస్పీ వచ్చేదాకా ఆయన ఇనచార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Updated Date - Apr 03 , 2024 | 12:41 AM