ప్లీజ్.. రాజీనామా చేయండి..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:38 AM
ఎన్నికలలో లబ్ధి పొందేందుకు వైసీపీ నాయకులు అడ్డదారుల్లో వెళుతున్నారు. వలంటీర్ల చేత మూకుమ్మడిగా రాజీనామా చేయించేందుకు బతిమాలుతున్నారు. ప్రలోభపెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వలంటీర్లు రాజీనామా లేఖలో పేర్కొంటున్నా.. వైసీనీ నాయకుల ఒత్తిళ్లే కారణమని స్పష్టంగా అర్థమౌతోంది. ఇందుకు యాడికి ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. యాడికి పట్టణంలోని ఐదు సచివాలయాల పరిధిలో 52 మంది వలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు.

వలంటీర్లకు వైసీపీ ప్రలోభాలు
ఎంపీడీఓ కార్యాలయం వద్ద హైడ్రామా
యాడికిలో కొందరు వలంటీర్ల వాగ్వాదం
యాడికి, ఏప్రిల్ 2: ఎన్నికలలో లబ్ధి పొందేందుకు వైసీపీ నాయకులు అడ్డదారుల్లో వెళుతున్నారు. వలంటీర్ల చేత మూకుమ్మడిగా రాజీనామా చేయించేందుకు బతిమాలుతున్నారు. ప్రలోభపెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వలంటీర్లు రాజీనామా లేఖలో పేర్కొంటున్నా.. వైసీనీ నాయకుల ఒత్తిళ్లే కారణమని స్పష్టంగా అర్థమౌతోంది. ఇందుకు యాడికి ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. యాడికి పట్టణంలోని ఐదు సచివాలయాల పరిధిలో 52 మంది వలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ఎంపీడీఓ కార్యాలయం వద్దకు రావాలని వలంటీర్లకు సంబంధించిన ఒక గ్రూపులో వైసీపీ నాయకులు మెసేజ్ పెట్టారు. దీంతో వలంటీర్లు ఒక్కొక్కరుగా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, రాజీనామా చేయాలని వలంటీర్లకు విన్నవిస్తూ కనిపించారు. రాజీనామా లేఖలను అతనే ఎంపీడీఓ కార్యాలయంలో ప్రింట్ తీయించడం గమనార్హం. వాటిలో వలంటీరు పేరు, క్లస్టర్, పంచాయతీ.. తదితర వివరాలు రాసేందుకు వీలుగా ఖాళీలను ఉంచారు. ఆ ఖాళీలను పూరించి.. సంతకం చేయాలని వలంటీర్లకు సోషల్ మీడియా కన్వీనర్ సూచించాడు. ఇలా జరుగుతున్న సమయంలో కొందరు వలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. వైసీపీ సోషల్‌మీడియా కన్వీనర్ వారివద్దకు వెళ్లి సర్దిచెప్పడంతో అయిష్టంగానే రాజీనామా చేశారు. వలంటీర్లు గుంపులు గుంపులుగా వెళ్లి తమ రాజీనామా లేఖలను ఎంపీడీఓకు అందించారు.
రెండునెలల జీతం ఎర
ఇప్పుడు రాజీనామా చేస్తే ఏప్రిల్, మే జీతాలను తామే ఇస్తామని వైసీపీ నాయకులు ప్రలోభపెట్టారని కొందరు వలంటీర్లు అన్నారు. ఎన్నికలయ్యే దాకా పార్టీ కోసం పనిచేయాలని వారు సూచించారని తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే కచ్చితంగా వలంటీర్లుగా తీసుకుంటామని భరోసా కల్పించి.. వలంటీర్లను రాజీనామాకు ఉసిగొల్పినట్లు మండలవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వలంటీర్ల కోసం కొత్తగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామని, వలంటీర్లు అందరూ అందులో చేరాలని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వాయిస్ మెసెజ్ పెట్టారు. రాజీనామా లేఖలు అందజేసిన వలంటీర్లు అందరూ వైసీపీ కోసం పనిచేయడం కోసమే కొత్త వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు.