Share News

ELECTION: పురంలో పారని పెద్దాయన పాచికలు..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:47 PM

ఉమ్మడి రాష్ట్రంలోనే హిందూపురం వాణిజ్య కేంద్రానికి పెట్టిందిపేరు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో అపారమైన వనరులున్నాయి. ఎలాగైనా నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని పెద్దాయన యోచించాడు.

ELECTION: పురంలో పారని పెద్దాయన పాచికలు..!

బీసీ మహిళతో బరిలోకి...

రెండు కులాల ఓట్లు గంపగుత్తగా పడతాయని ఎత్తుగడ

తిప్పికొట్టిన ఓటర్లు

హిందూపురం, జూన 7: ఉమ్మడి రాష్ట్రంలోనే హిందూపురం వాణిజ్య కేంద్రానికి పెట్టిందిపేరు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉంది. దీంతోపాటు ఈ ప్రాంతంలో అపారమైన వనరులున్నాయి. ఎలాగైనా నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని పెద్దాయన యోచించాడు. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు హిందూపురంలో వైసీపీ ఇనచార్జిగా ఉన్న మహ్మద్‌ ఇక్బాల్‌ను తప్పించి బెంగళూరులో ఉన్న తన అనుచరుడి ద్వారా హిందూపురం మండలానికి చెందిన వేణురెడ్డి సతీమణి కురుబ దీపికను ఇనచార్జిగా నియమించారు. అప్పటికే మూడు వర్గాలుగా ఉన్న వైసీపీ దీపికను ఇక్కడకు పంపగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా కృషిచేసినట్లు చెప్పవచ్చు. ఈ కారణంగా ఎన్నడూలేనివిధంగా వైసీపీలో ఈసారి అన్నివర్గాల నాయకులు పనిచేశారు. అయినా పెద్దారెడ్డి పాచికలు హిందూపురంలో పారలేదు. మండలంలోని పారిశ్రామిక వాడ ఉండి ఇక్కడ చిన్న, పెద్ద పరిశ్రమలు వందకుపైగా ఉన్నాయి. దీనికితోడు పురానికి పక్కనే పెన్నా, కుముద్వతి, జయమంగళి నదులు ఉన్నాయి. వీటిలో అపారమైన ఇసుక ఉంది. తాను చెప్పినవారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఈ వనరులు తన కబందహస్తాల్లో ఉంచుకుని ఇసుక అక్రమ రవాణాతో లబ్ది పొందవచ్చని పెద్దాయన ఆశించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హిందూపురం బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ భూములధరలు రెట్టింపుస్థాయిలో పెరిగాయి. హిందూపురం ప్రాంతంలో వేలాది ఎకరాల అసైన్డ భూములు ఉన్నా యి. వాటిపై కూడా కన్నేయవచ్చని ఆలోచనతో హిందూపురాన్ని తన కనుసన్నల్లో తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.


బీసీ మహిళతో బరిలోకి...

హిందూపురం అసెంబ్లీ స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాన పార్టీలో మహిళా అభ్యర్థి బరిలో దిగలేదు. ఈసారి బాలకృష్ణ మీద పోటీకి దీపికను రంగంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే దీపిక కురుబ సామాజికవర్గానికి చెందినదికాగా ఆమె భర్త రెడ్డి సామాజికవర్గం దీంతో ఈరెండు కులాల ఓట్లు గంపగుత్తుగా పడతాయని ఆశించారు. సొంత సర్వే సంస్థ అయిన ఐప్యాక్‌ ద్వారా సర్వే చేయించి దీపికను దింపినట్లు చెప్పుకుంటుంటారు. అంతేకాక కురుబల ఓట్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఎలాగూ వైసీపీకి పడే ఓట్లు పడతాయి ఇక రెడ్డి కులానికి చెందిన ఓట్లు కూడా తమవైపు పడతాయని భావించి దీపికను దింపారు. కానీ బాలయ్య పురంలో హ్యాట్రిక్‌ కొట్టాలని నిశ్చయించుకుని బరిలో దిగారు. దీంతో వారి ఎత్తులు చిత్తయ్యాయి.


తిప్పికొట్టిన పురం ఓటర్లు

హిందూపురం నియోజకవర్గ పరిధిలో మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగాడు. 2014లో వచ్చిన ఓట్లకంటే 2019లో ఆధిక్యం పెరిగింది. 2024లో భారీ మెజార్టీ సాధించారు. దీనికారణంగా పెద్దిరెడ్డి వేసిన ప్లాన అట్టర్‌ఫ్లాప్‌ అయిందని చెప్పవచ్చు. పెద్దిరెడ్డి వేసిన పాచికలు తిరగబడ్డాయి. పురం ఓటర్లు బాలయ్యవైపే మొగ్గాయి. దీనికారణంగా 32,597ఓట్లు మెజార్టీ సాధించారు. మొత్తంగా చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎన్ని ఎత్తుగడలువేసినా పురం ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

Updated Date - Jun 07 , 2024 | 11:47 PM