Share News

ఇళ్ల వద్దకే నోటీసులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:43 AM

సమ్మె చేస్తున్న అంగనవాడీలపై ఒత్తిడి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదో పది రోజుల్లోగా చెప్పాలని కోరుతూ షోకాజ్‌ నోటీసులను ఇస్తోంది. అంగనవాడీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు ఇస్తున్నారు.

ఇళ్ల వద్దకే నోటీసులు
కలెక్టరేట్‌ వద్ద తలపై కుర్చీలు పెట్టుకుని నిరసన

అంగనవాడీలపై ప్రభుత్వం ఒత్తిడి

31వ రోజూ కొనసాగిన ఆందోళనలు

అనంతపురం విద్య, జనవరి 11: సమ్మె చేస్తున్న అంగనవాడీలపై ఒత్తిడి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదో పది రోజుల్లోగా చెప్పాలని కోరుతూ షోకాజ్‌ నోటీసులను ఇస్తోంది. అంగనవాడీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు ఇస్తున్నారు. వారు ఇళ్లవద్ద లేకపోతే.. ఇంటికి నోటీసులు అతికించి, పక్కింటివారితో సంతకాలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం వందలాది మంది వర్కర్లు, ఆయాల ఇళ్ల వద్ద నోటీసులు అతికించారు.

బెదిరించి.. పంపిణీ

అనంతపురంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో కొందరు అధికారులు ఆయాలను బెదిరించి, కిట్లు, గుడ్లు వంటి సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేయించారని సమాచారం. అనంతపురం నగరంలోని బుడ్డప్ప నగర్‌, రాణినగర్‌, నాయక్‌నగర్‌ తదితర ప్రాంతాల అంగనవాడీ సెంటర్లలో లబ్ధిదారులకు ఆయాలద్వారా సరుకులను పంపిణీ చేశారు. అంగనవాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపిస్తున్నారని కార్యకర్తలు, నాయకకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

31వ రోజూ ఆందోళనలు

అంగనవాడీల ఆందోళనలు 31వ రోజు కొనసాగాయి. కలెక్టరేట్‌ వద్ద ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన, సీఐటీయూఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. రోడ్డుపైకి వచ్చి తలపై కుర్చీలు పెట్టుకుని ఆందోళన చేశారు. తమతో పెట్టుకుంటే ప్రజాప్రతినిధుల కుర్చీలు తిరగబడతయని హెచ్చరించారు. 31 రోజుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్‌ అన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై స్పందించిన ప్రభుత్వం, అంగనవాడీల సమ్మెపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ఎస్మాను ఉపసంహరించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు తమ వేతనాలను పెంచుకున్నారని, అంగనవాడీల వేతనాలు పెంచమంటే బడ్జెట్‌ కొరత వస్తుందా అని ప్రశ్నించారు

4,188 మంది షోకాజ్‌ నోటీసులు

జిల్లా వ్యాప్తంగా 2,209 మంది మెయిన, మినీ అంగనవాడీ వర్కర్లు, 1,979 మంది హెల్పర్లకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసలు ఇచ్చింది. మొత్తం 4,188 మందికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా నోటీసులు పంపించామని ఐసీడీఎస్‌ పీడీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 47 మంది వర్కర్లు, 38 మంది హెల్పర్లు విధుల్లో చేరారని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, లేకుంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని పీడీ శ్రీదేవి హెచ్చరించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:43 AM