Share News

సరిహద్దులో తనిఖీలు నిల్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:25 AM

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

సరిహద్దులో తనిఖీలు నిల్‌
తనిఖీల సిబ్బంది లేకపోవడంతో ఖాళీగా ఉన్న సరిహద్దు ప్రాంతం

యథేచ్ఛగా కర్ణాటక మద్యం రవాణా

లేపాక్షి, ఏప్రిల్‌ 19: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. లేపాక్షి మండలంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతం వద్ద తనిఖీలు చేయాల్సిన సిబ్బంది సరిహద్దులో ఉండడంలేదు. దీంతో ఇటు కర్ణాటక మద్యం యథేచ్ఛగా తరలివస్తోందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. సెబ్‌ అధికారులు కంచిసముద్రం వద్ద బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించగా అధిక మొత్తంలో కర్ణాటక మద్యం పట్టుబడింది. సరిహద్దులో తనిఖీలు చేయాల్సిన సిబ్బంది గురువారం అక్కడ కనిపించలేదు. దీంతో సరిహద్దు ప్రాంతం నిర్మానుష్యంగా మారడంతో అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈదారిగుండా చిలమత్తూరు, గోరంట్ల కొత్తచెరువు వరకు కర్ణాటక మద్యం సరఫరా జోరుగా సాగుతున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా సిబ్బంది లేకపోవడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:25 AM