Share News

చిత్తూరు ప్లాన ఫ్లాప్‌...

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:51 PM

నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు, అసమ్మతి సెగలు తగ్గలేదు. ఇనచార్జిలను మార్చితే ఫలితం ఉంటుందని పార్టీలో పెద్దాయన భావించాడు. ఇక్కడ అప్పట్లో అసమ్మతి నాయకుల కోరిక మేరకు అప్పటి ఇనచార్జి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ని తప్పించి, మంత్రికి సన్నిహితంగా ఉండే వేణురెడ్డి సతీమణి దీపికను ఐదునెలల క్రితం సమన్వయకర్తగా నియమింపజేశారు. ఇక పురంలో అధికార పార్టీకి అడ్డు ఉండదనీ, కంచుకోటను బద్దలు కొడతామని ప్రస్తుత సమన్వయకర్త వర్గీయులు పేర్కొన్నారు. కంచుకోట బద్దలు కొట్టడం పక్కన పెడితే సొంత పార్టీలో గతం కంటే అసమ్మతి పోరు, వర్గపోరు అధికమయ్యాయని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు.

చిత్తూరు ప్లాన ఫ్లాప్‌...
మంత్రి సమావేశానికి జనం రాక ఖాళీగా కనిపిస్తున్న కుర్చీలు

ఏకతాటిపైకి అంటూ సమావేశాలు

సొంత పార్టీ కార్యకర్తలు రాకపోవడంతో

మహిళా సంఘాలు, కార్మికులతో మమ

మంత్రి సమావేశానికి రాకపోతే ఆసరా,

పింఛన రాదంటూ ప్రచారం

హిందూపురం, జనవరి 8: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు, అసమ్మతి సెగలు తగ్గలేదు. ఇనచార్జిలను మార్చితే ఫలితం ఉంటుందని పార్టీలో పెద్దాయన భావించాడు. ఇక్కడ అప్పట్లో అసమ్మతి నాయకుల కోరిక మేరకు అప్పటి ఇనచార్జి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ని తప్పించి, మంత్రికి సన్నిహితంగా ఉండే వేణురెడ్డి సతీమణి దీపికను ఐదునెలల క్రితం సమన్వయకర్తగా నియమింపజేశారు. ఇక పురంలో అధికార పార్టీకి అడ్డు ఉండదనీ, కంచుకోటను బద్దలు కొడతామని ప్రస్తుత సమన్వయకర్త వర్గీయులు పేర్కొన్నారు. కంచుకోట బద్దలు కొట్టడం పక్కన పెడితే సొంత పార్టీలో గతం కంటే అసమ్మతి పోరు, వర్గపోరు అధికమయ్యాయని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో వర్గపోరు లేకుండా చేసి, అసమ్మతికి చెక్‌పెట్టాలని మంత్రి భావించారు. ఇందులో భాగంగా పంచాయతీల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలోని జనంలో 70 శాతం మంది సమావేశాలకు వచ్చేలా చిత్తూరు నుంచి వచ్చిన మంత్రి వేగులు ప్లాన వేశారు. సోమవారం ప్రారంభమైన పంచాయతీల సమావేశాలకు సొంత పార్టీ కార్యకర్తలే రాకపోవడం గమనార్హం. నెల రోజులుగా మంత్రి పర్యటనపై విస్తృతంగా ప్రచారం చేశారు. అధికార పార్టీలోని కొంతమంది నాయకులను బెదిరించి, మంత్రి వచ్చినపుడు జనాలను తరలించాలనీ, ఎవ్వరూ నోరు మెదపరాదని చిత్తూరు నుంచి వచ్చిన మనుషులు ఆదేశించారు. దీంతో సోమవారం జరిగిన పంచాయతీల వారీ సమావేశాలకు చౌళూరు మినహా అన్ని పంచాయతీల్లో జనాలు రాక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఏకతాటిపైకి అంటూ..

సొంత పార్టీలో నెలకొన్న విబేధాలు, అసమ్మతిని చెక్‌పెట్టి, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సమావేశాలు నిర్వహిస్తామని ముందుగా చెప్పారు. పంచాయతీల వారీగా నిర్వహించిన సమావేశాలను బట్టి చూస్తే అలాంటివేవీ కనిపించడంలేదు. ప్రతిపక్షాలను విమర్శించడం, ముఖ్యమంత్రిని పొగడడంతోనే సమావేశాలు ముగిశాయి. సోమవారం చౌళూరు మినహా సంతేబిదనూరు, తూముకుంట, గోళ్లాపురం, సంతేబిదనూరు, కొటిపి, బేవనహళ్లి పంచాయతీల్లో వర్గపోరు, అసమ్మతి పోరు అధికంగా ఉంది. కిరికెర, బేవనహళ్లి, కొటిపికి చెందిన కొందరు నాయకులు.. సమన్వయకర్తపై మంత్రికి ఫిర్యాదులు చేశారు. వారిని చక్కదిద్దే పనితోపాటు ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.

మహిళా సంఘాలు, కార్మికులతో సరి

వైసీపీ అధికారంలో ఉంది. పంచాయతీ వార్డు సభ్యులతో మొదలుకొని స్థానికంగా అధికార పార్టీదే పైచేయి. అలాంటపుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలు స్వచ్ఛందగా సమావేశాలకు రావడం సహజం. సొంత పార్టీ కార్యకర్తలు, సంక్షేమ పథకాలు తీసుకున్న వారు రామ్‌రామ్‌ అనడంతో చేసేదిలేక మంత్రి సమావేశాలకు మహిళా సంఘాల సభ్యులను తరలించారు. పింఛన ఇస్తామని వారిని సమావేశాలకు రప్పించినట్లు తెలిసింది. అప్పటికీ జనం కనిపించకపోవడంతో మహిళా కార్మికులను పరిశ్రమలకు చెందిన బస్సుల్లో సమావేశాలకు తరలించడం తీవ్ర దుమారం లేపింది. హిందూపురం మండలంలో జనాభా పరంగా పెద్దదైన కిరికెర పంచాయతీలో జనం రాక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ పంచాయతీలో 10 వేల మంది జనాభా ఉన్నారు. రెండు ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ కూడా అధికార పార్టీ మద్దతుదారులే దక్కించుకున్నారు. అలాంటి చోట ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన రేపింది.

చౌళూరుకే పరిమితమైన ఎంపీపీ

హిందూపురం ఎంపీపీగా దళిత వర్గానికి చెందిన రత్నమ్మ ఉన్నారు. ఆమె సొంత గ్రామం చౌళూరు కావడంతో అక్కడ మాత్రమే పాల్గొన్నారు. ఆ తరువాత మరిచిపోయారు. మండల అధ్యక్షురాలు తప్పనిసరిగా ఏ పంచాయతీలో కార్యక్రమం జరిగినా పాల్గొంటారు. అధికార పార్టీకే చెందిన ఆమెను పక్క పంచాయుతీలకు పిలవకపోవడం దళితుల పట్ల వైసీపీ నాయకులకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

రూ.కోటి అదనపు భారం

మంత్రి సమావేశాలకు కార్మికులను తరలించడంతో మరమ్మతుల పేరుతో 5 గంటల సమయం విద్యుత సరఫరా తీసేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత శాఖ మంత్రి కావడంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆయన వెంటే ఉన్నారు. కార్మికులు సమావేశాలకు రాకపోవడంతో పారిశ్రామక వాడకు విద్యుత సరఫరా నిలిపివేశారు. కొన్ని పరిశ్రమలు జనరేటర్‌ సాయంతో ప్రారంభించారు. దీంతో పరిశ్రమలకు రూ.కోటి అదనపు భారం పడినట్లు ఓ పరిశ్రమ యజమాని పేర్కొన్నారు.

ఆ రెండు వర్గాలు ఎక్కడ..?

విభేదాలకు చెక్‌పెట్టేందుకు వచ్చిన మంత్రి సమావేశాల్లో ఆ రెండు వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నట్లు లేదు. ప్రతి గ్రామంలో ఇద్దరు ముఖ్యనేతల అనుచరుల వర్గం ఉంది. మంత్రి సమావేశానికి ఈ రెండువర్గాల నాయకులు వెళ్లలేదు. దీనినిబట్టి స్థానిక సమన్వయకర్తపై ఆ రెండు వర్గాలు వ్యతిరేకిస్తున్నట్లు బహిర్గతమవుతోంది.

Updated Date - Jan 08 , 2024 | 11:51 PM