Share News

భూమి హక్కు చట్టంతో నష్టం: సీపీఐ

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:24 AM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న భూ యాజమాన్య హక్కుల చట్టం పేద రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ పేర్కొన్నారు.

భూమి హక్కు చట్టంతో నష్టం: సీపీఐ

గుంతకల్లు, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న భూ యాజమాన్య హక్కుల చట్టం పేద రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో భూ యాజమాన్య హక్కుల చట్టంపై వివిధ పార్టీలచే రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగదీష్‌ మాట్లాడుతూ పేదల భూమిల్ని కబ్జా చేసే దురుద్దేశంతోనే వైసీపీ పెద్దలు ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను తేవాలని చూస్తున్నారన్నారు. ఈ చట్టం వల్ల పేద బలహీన వర్గాల రైతుల భూములకు భద్రత లేకుండా పోతుందన్నారు. నీతి అయోగ్‌ సివిల్‌ కేసుల పరిష్కారం కోసం చేసిన సిఫారసులను అడ్డం పెట్టుకుని ఈ దుర్మార్గమైన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నెత్తిన రుద్దాలని చూస్తోందన్నారు. భూ వివాదాలను కోర్టు పరిధిలో పరిష్కరించడం శ్రేయస్కరమన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం రద్దు కోసం ప్రతి పక్షాలు ఏకతాటిపై నిలవాలన్నారు. టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూయాజమాన్య హక్కుల చట్టం దుర్మార్గమైనదన్నారు. అధికారుల పర్యవేక్షణలో చేపట్టే భూ యాజమాన్య హక్కుల నిర్ధారణలో పక్షపాత వైఖరులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మహేష్‌, ఎస్‌ఎండీ గౌస్‌, గోపినాథ్‌, రామాంజినేయులు, సీపీఎం నాయకులు దాసరి శ్రీనివాసులు, ఏఐటీయూసీ నాయకులు ఈశ్వరయ్య, బీ శ్రీనివాసులు, న్యాయవాదులు శ్రీనివాసులు, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:24 AM