Share News

వైసీపీకి ఓటుతో బుద్ధి చెబుదాం

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:50 AM

కార్మిక లోకం ఏకమై ఓటుతో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని టీఎనటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు పిలుపునిచ్చారు. పాతూరు బ్రహ్మంగారి ఆలయం వద్ద టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు అధ్యక్షతన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభను గురువారం నిర్వహించారు.

వైసీపీకి ఓటుతో బుద్ధి చెబుదాం
మాట్లాడుతున్న రఘురామరాజు

టీఎనటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు

అనంతలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 1: కార్మిక లోకం ఏకమై ఓటుతో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని టీఎనటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు పిలుపునిచ్చారు. పాతూరు బ్రహ్మంగారి ఆలయం వద్ద టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు అధ్యక్షతన చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అహంకారి జగనకు.. కార్మికుల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు. భవిష్యత్తులో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడేలా ఈ యుద్ధంలో కార్మికులు తీర్పునివ్వాలని కోరారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చామని, తద్వారా భవన నిర్మాణ రంగం బాగుపడిందని, కార్మికులకు జీవన భృతి దక్కిందని అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా చంద్రబాబు రూ.5కే కడుపు నిండా పేద వారికి అన్నం పెట్టారని గుర్తు చేశారు. అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించారని, చేతివృత్తుల వారికి ఆదరణ పనిముట్లు అందించి చేయూనిచ్చారని అన్నారు. సీఎం జగన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ఇచ్చే డబ్బులకంటే ఎక్కువ రెట్లు పన్నులు, జరిమానాలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సమ్మెకు దిగిన అంగనవాడీలపై ఎస్మా ప్రయోగించారని అన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అవినీతి వెంకటరామిరెడ్డిగా పేరు మార్చుకున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యారాచాలు జరిగినా నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

- జగన రాక్షస పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని టీఎనటీయూసీ ఐదో జోన కో-ఆర్డినేటర్‌ అశోక్‌కుమార్‌ విమర్శించారు. సొంత చెల్లెలు షర్మిల జగన పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ర్టాన్ని విభజించి పాలించాలకునే వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత, మేధావులు బుద్ధి చెప్పారని అన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని జగన హామి ఇచ్చి తుంగలో తొక్కారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని రాబోవు ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు.

- వైసీపీ పాలనలో కార్మిక లోకం తీవ్రంగా నష్టపోయిందని టీఎనటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపు వెంకటేష్‌ అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే కార్మిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కార్మిక లోకం నడుంబిగించాలని కోరారు.

- వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి తనయుడు మధుకర్‌ చౌదరి అన్నారు. కార్మికులు మరింత అన్యాయానికి గురయ్యారన్నారు. సీఎం జగన పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని అన్నారు. జగన మాయమాటలను నమ్మకుండా, రాబోవు ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళి, టీఎనటీయూసీ రాష్ట్ర నాయకులు గుర్రం నాగభూషణం, బ్యాళ్ల నాగేంద్ర, పెద్దమారెప్ప, దళవాయి రమాదేవి, విజయశ్రీరెడ్డి, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:50 AM