పెద్దలను వదిలి.. పేదలపై పడి..!
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:13 AM
మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నా దేవదాయ శాఖ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటి జోలికి వెళ్లడంలేదు. అధికారపార్టీ అండలేని పేదలు నివాసాలు ఏర్పరుచుకుంటే మాత్రం వెంటనే రంగంలోకి దిగుతున్నారు.
గుడిసెలను కూల్చేశారు.. ప్లాట్లను వదిలేశారు..
మాన్యం భూములపై దేవదాయశాఖ ద్వంద్వ వైఖరి
అనంతపురం కల్చరల్, జనవరి 17: మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నా దేవదాయ శాఖ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటి జోలికి వెళ్లడంలేదు. అధికారపార్టీ అండలేని పేదలు నివాసాలు ఏర్పరుచుకుంటే మాత్రం వెంటనే రంగంలోకి దిగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. పేదల పట్ల ఒకలా.. పెద్దల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. కల్లూరు వద్ద పేదల ఇళ్లను కూల్చివేయడమే.
నిర్దాక్షిణ్యంగా..
కల్లూరు సర్వే నంబరు 165లో 3.43 ఎకరాల మాన్యం భూమి ఉంది. అందులో రెండు ఎకరాల్లో వెనుకబడిన తరగతులకు చెందిన దాదాపు 150 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటిని కూల్చివేసేందకు గత ఏడాది నవంబరు 1న దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ ఆదిశేష నాయుడు నేతృత్వంలో పోలీసులు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక నిర్దాక్షిణ్యంగా నివాస గృహాలను కూల్చివేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వామపక్ష నాయకులపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. ఆ ఘటన తరువాత బాధితుల పక్షాన వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. బాధిత కుటుంబాలు దేవదాయశాఖ అధికారులు, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేశాయి. ప్రత్యామ్నాయంగా నివాసాలు ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. ఇదే సర్వే నంబరులో 43 సెంట్లలో అధికారపార్టీకి చెందిన కొందరు ప్లాట్లు వేశారు. వాటి జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. అనంతపురం నగరంలో సైతం పలు ఆలయాల భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాలకు ఎకరాలు అన్యాక్రాంతం అయ్యింది. వాటి వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
అప్పులపాలయ్యాం...
నా కుమార్తె నగలు తాకట్టు పెట్టాను. ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పు తీసుకున్నాను. మొత్తం రూ.4.5 లక్షల వ్యయంతో కల్లూరు వద్ద ఇల్లు నిర్మించుకున్నాం. కూలి పనులు చేసుకుని జీవించే మాకు సొంతిల్లు లేదు. అందుకే కల్లూరులో అందరితోపాటు మేమూ ఓ ఇంటిని నిర్మించుకున్నాం. దేవదాయశాఖ అధికారులు ఇంటిని కూల్చివేయడం వల్ల నిలువ నీడ లేకుండా పోయింది. రోడ్డున పడ్డాం. ఇంటి కోసం చేసిన అప్పులు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నాం. రాజకీయ అండ ఉన్న వారిని వదిలేసి మాలాంటి పేదల నివాసాలను కూల్చివేయడం తగదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాలాంటివారికి న్యాయం చేయాలి.
- లక్ష్మిదేవి, కల్లూరు
నోటీసులు జారీ చేశాం..
చెన్నకేశ్వస్వామి, బసవేశ్వరస్వామి ఆలయాల మాన్యం భూములను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి నోటీసులు జారీ చేశాం. ఇళ్లను ఖాళీ చేయాలని మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చాం. కోర్టు నిబంధనల మేరకు 15 రోజులు గడువు ఇచ్చాం. నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతాం.
- ఆదిశేషనాయుడు, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్