మంత్రి సమావేశాలకు జనం కొరత
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:08 AM
వైసీపీ నియోజకవర్గ బాధ్యతలను తన భుజాన వేసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4వ రోజు లేపాక్షి మండలంలో పర్యటించారు.

చంద్రబాబును విమర్శించడంతోనే ప్రసంగం సరి
లేపాక్షి మండలంలో ముగిసిన మంత్రి పెద్దిరెడ్డి పర్యటన
హిందూపురం, జనవరి 11 : వైసీపీ నియోజకవర్గ బాధ్యతలను తన భుజాన వేసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4వ రోజు లేపాక్షి మండలంలో పర్యటించారు. మొదట కోడిపల్లిలో ఉదయం 9గంటలకే ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి చోళసముద్రం, బిసలమానేపల్లి, నాయనపల్లి, కల్లూరు, కొండూరు పంచాయతీ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే మంత్రి సమావేశాలకు జనం అంతంత మాత్రమే వచ్చారు. కేవలం మహిళా సంఘాల సభ్యులతోనే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెల్లారకనే మంత్రి పర్యటించే పంచాయతీ గ్రామాలకు వెలుగు సిబ్బంది వెళ్తున్నారు. గురువారం ఓ పంచాయతీ పరిధిలో జనం రాకపోవడంతో వెలుగు సిబ్బం దే ఈరోజు కూలీ ఇస్తామని కొంతమందిని తీసుకొచ్చినట్లు తెలిసింది. సమావేశానికి వస్తే రోజంతా వృఽథా అవుతోందని కూలీ పనికి వెళ్తే రూ.400 ఇస్తారని మహిళలు అనడంతో... వెలుగు సిబ్బంది వేతనం ఇచ్చి తీసుకురా వాల్సిన పరిస్థితి దాపురించిందని ఆ శాఖలోని కొంతమంది సిబ్బంది పెదవి విరిచారు. చోళసముద్రంలో జరిగిన సమావేశానికి జనం అంతంత మాత్రమే రావడంతో వెనుకాల వేసిన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటిని పక్కకు వేయాలని మంత్రి దూతలు స్థానికులకు సూచించారు.
మధ్యాహ్నానికే వెనుదిరిగిన నవీననిశ్చల్
ఇదిలా ఉంటే ఏపీఆగ్రోస్ చైర్మన నవీననిశ్చల్‌ను మంత్రి పెద్దిరెడ్డి పిలి పించి మాట్లాడినట్లు తెలిసింది. మంత్రి భరోసా ఏమిచ్చారో తెలియదుకానీ గురువారం లేపాక్షి మండలంలో జరిగిన సమావేశాలకు నవీన హాజరయ్యా రు. అయితే ఉదయం కొంత ఆలస్యంగా కోడిపల్లికి వెళ్లడంతో అక్కడ వేదిక పైకి వెళ్లలేదు. పక్కనే సచివాలయం ఉండగా అక్కడే తన అనుచరులతో మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఆ తరువాత చోళసముద్రం, బిసల మానేపల్లి సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి హిందూపురానికి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన సమావేశాలకు నవీననిశ్చల్ హాజరుకాలేదు.