Share News

కూటమి సై..వైసీపీ నై..

ABN , Publish Date - May 25 , 2024 | 11:53 PM

జిల్లాలో అధికార వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. గెలుపు ధీమాలో కూటమి నేతలున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు కూడా కూటమి అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు సై అంటున్నారు. వైసీపీ వారు గెలుస్తారని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.

కూటమి సై..వైసీపీ నై..
tdp josh

ఫ కూటమి గెలుపుపై ధీమా ఫ రూ. లక్షకు రూ. 1.5 లక్షల బెట్టింగ్‌కు రెఢీ ఫ వైసీపీలో ఓటమి భయం

ఫ ఆ పార్టీ తరఫున పందేనికి బెట్టింగ్‌ రాయుళ్ల వెనుకంజ ఫ ముఖ్య నేతల గెలుపుపై భారీగా పందేలు

అనంతపురం, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధికార వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. గెలుపు ధీమాలో కూటమి నేతలున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు కూడా కూటమి అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు సై అంటున్నారు. వైసీపీ వారు గెలుస్తారని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. కూటమిదే అధికారం అనేందుకు ఇదే నిదర్శమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సర్వేలన్నీ కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... గెలుపు ధీమాలో కూటమి తరఫున నిలబడి.. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ వైసీపీ బెట్టింగ్‌ రాయుళ్లకు సవాలు విసురుతున్నారు. రూ.లక్షకు రూ.1.50 లక్షలు ఇస్తామని ఆ పక్షంవారిని ఇరకాటంలోకి నెడుతున్నారు. సవాల్‌ను స్వీకరించాలా..? వద్దా అనే డోలాయమానంలో వైసీపీ వర్గీయులు ఉన్నారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే చర్చ జరుగుతోంది. పోలింగ్‌ ముగిసిన తరువాత సీఎం జగన ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లారు. గతంలో వచ్చిన 151 సీట్లకంటే అధికంగా వస్తాయని చెప్పారు. అయినా ఆ పార్టీ నేతలు, పందెంరాయుళ్లు వైసీపీ తరఫున పందెం కాసేందుకు జిల్లాలో జంకుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు, కొందరు బెట్టింగ్‌ రాయుళ్లు భారీ స్థాయిలో పందెం కాశారు. అదే స్థాయిలో అప్పటి ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు భారీగా పందెం కాసిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన పందెం కాసిన ఆ పార్టీ నాయకులు, పందెంరాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. కొందరు పందెం రాయుళ్లయితే అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. ఆ అప్పుల నుంచి బయట పడేందుకు వారు ఎదుర్కొన్న అవస్థలు వర్ణణాతీతం. తాజా సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు, ఆ పార్టీ తరుపున పందెంకాసిన పందెంరాయుళ్లు ఏ విధంగా నష్టపోయారన్న విషయాన్ని ప్రస్తుతం అధికార వైసీపీ నేతలు బెట్టింగ్‌రాయుళ్లు గుర్తు చేసుకుంటు న్నారు. ఈ నేపథ్యంలోనే... అధికార వైసీపీ నుంచి పందెంకాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే చర్చలు వినిపిస్తున్నాయి.


పందెం కాసేందుకు వెనుకంజ వేస్తున్న అధికార పార్టీ

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీయే గెలుస్తుందని పందేలు కాసి బాగా లబ్ధి పొందిన పందెంరాయుళ్లు ఈ ఎన్నికల్లో పందెంకాసేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఐదేళ్ల సీఎం జగన పాలనలో బటన నొక్కుడు మినహా... ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా... నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, ఉద్యోగవర్గాల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలో... ఆ పార్టీ అధికారం చేపడుతుందన్న విషయంలో పందెం కాసేందుకు ఆ పార్టీ నేతలే వెనుకంజ వేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు రూ. లక్షకు రూ. 1.50 లక్షలు ఇస్తామని కూటమి నేతలు, ఆ పార్టీ పక్షాన భారీగా పందెంరాయుళ్లు ముందుకు రావడం అధికార వైసీపీని మరింత కలవరపెడుతోంది. కూటమికి విజయావకాశాలు లేకపోతే రెట్టింపు పందేలకు ఎందుకు ముందుకు వస్తారనే పునరాలోచనలో అధికార వైసీపీ పక్షం పడిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలుండగా... అత్యధికంగా 49 స్థానాలు వైసీపీకి దక్కిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో కూటమికి 24 నుంచి 27 అసెంబ్లీ స్థానాలు దక్కనున్నాయని మెజార్టీ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో... వైసీపీ అధికారంలోకి రాదనే భావన ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్లు సమాచారం. ఒక రాయలసీమలోనే కూటమికి 20కిపైగా అసెంబ్లీ స్థానాలొస్తే... ఇక కోస్తాంధ్రలో పరిస్థితి కూటమికి మరింత అనుకూలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయా నికి ఆ పార్టీ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో...ఎవరి నోట విన్నా... కూటమిదే అధికారమనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సందర్భంలో పందెంకాసి జేబులు ఎందుకు ఖాళీ చేసుకోవాలనే మీమాంసలో అధికార వైసీపీ పందెం రాయుళ్లు ఉన్నారు. కాగా... పెద్ద మొత్తంలో కాకుండా... ఏదో పందెం కాయాలంటే... కాయాలనే చందంగా రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల్లోపే అధికార వైసీపీ పక్షాన పందెం కాస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొనడం గమనార్హం.


కీలక నేతల గెలుపుపై ఎంతకైనా రెడీ..

జిల్లాలో కీలక నేతల గెలుపుపై పందెం రాయుళ్లు ఎంత డబ్బులు పెట్టడానికైనా సై అంటున్నారు. జిల్లాలో 8 నియోజకవర్గాలున్నాయి. ఈ 8 నియోజకవర్గాల్లో ప్రధానంగా తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, అనంతపురం అర్బన నియోజకవర్గాలపైనే బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గెలుపోటములపై బెట్టిం గ్‌ కాసేందుకు ఇరువర్గాల నుంచి ఎవరూ వెనుకాడడం లేదు. కూటమి అభ్యర్థిదే గెలుపని... కాదు వైసీపీదే గెలుపని కేవలం గెలుపుపై మాత్రమే ఇరుపార్టీల నాయకులు, ఆయా పార్టీల అభిమానులు, బెట్టింగ్‌రాయుళ్లు పందెం కాస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రూ. లక్షకు రూ. లక్ష అంటూ ఇరువైపుల నుంచి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఇక తాడిపత్రిలో పరిస్థితి చూస్తే... ఎవరికి ఎవరు తగ్గేదే లే అన్నట్లుగా అటు కూటమి అభ్యర్థి జేసీ అస్మితరెడ్డి, ఇటు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు రూ. 50 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు సమాచారం. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపుపైనే అత్యధికంగా బెట్టింగులు కాసేందుకు పందెంరాయుళ్లు ముందుకొచ్చినట్లు బెట్టింగ్‌ బుకీల ద్వారా అందిన సమాచారం. ఉరవకొండలో 1994 సీన రిపీటవుతుందని కూటమి నేతలు జోరుగా బెట్టింగులు కాస్తున్నారు. కూటమి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ విజయం లాంఛనమేనంటూ ఆయన గెలుపుపై ధీమాతో భారీగా బెట్టింగులు కాస్తున్నారు. వైసీపీ నుంచి బెట్టింగులు కాసేందుకు వెనుకంజ వేస్తున్న పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అనంతపురం అర్బన నియోజకవర్గంలో కూటమి టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గెలుపోటములపైనా అనంతపురం నగరంలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా కూటమి అభ్యర్థి గెలుపు పక్షాన రూ. 1.50 లక్షలు పందెం కాస్తే... వైసీపీ పక్షాన పందెం కాసిన పందెంరాయుళ్లు రూ. లక్ష ఇచ్చేలా పందేలు కాస్తున్నారు. ఆ ఒప్పందం మేరకు ఒక్క అనంతపురం నగరంలోనే ఇప్పటి వరకూ రూ. 5 కోట్లదాకా బెట్టింగులు జరిగినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఒక్క అనంతపురం అర్బన నియోజకవర్గంలోనే రూ.50 కోట్లకుపైబడి బెట్టింగులు జరిగాయి. ఈసారి ఆ పరిస్థితి కనిపించకపోవడానికి అధికార వైసీపీపై వ్యతిరేకతకు తోడు నిరుద్యోగ యువత, ఉద్యోగులు, వ్యాపా రస్తులకు నెలవైన ప్రాంతం కావడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

Updated Date - May 25 , 2024 | 11:53 PM