Share News

నాన బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:34 AM

ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిచేసిన వారిపై నాన బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని బహుజన లాయర్స్‌ ఫోరం (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప డిమాండ్‌ చేశారు. ఈ దాడిని బీఎల్‌ఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.

నాన బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలి
మాట్లాడుతున్న బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప

శ్రీకృష్ణపై దాడి కేసును నిర్వీర్యం చేస్తున్నారు

బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప

అనంతపురం సెంట్రల్‌, ఫిబ్రవరి 29: ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిచేసిన వారిపై నాన బెయిలబుల్‌ కేసులు నమోదు చేయాలని బహుజన లాయర్స్‌ ఫోరం (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప డిమాండ్‌ చేశారు. ఈ దాడిని బీఎల్‌ఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపార్టీలు తమ స్వలాభం కోసం బహుజనులపై బహుజనలచేతనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారిపై భౌతిక దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. శ్రీకృష్ణపై దాడిచేస్తున్నవారు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా, ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులు నమోదు చేశారని, ముద్దాయిలను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. గుంపుగా దాడిచేసినా ఒకరిపై మాత్రమే 307 సెక్షన కింద కేసు నమోదు చేశారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. కర్రలతో దాడిచేస్తూ, హత్యాయత్నానికి పాల్పడినా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనకపోవడం కేసును నిర్వీర్యం చేయడమేనని అన్నారు. దాడి తీవ్రతను నీరుగారుస్తూ రిమాండ్‌ రిపోర్టును తయారుచేసి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసు నమోదుచేస్తేనే ముద్దాయిలకు న్యాయస్థానం రిమాండ్‌ విధిస్తుందని అన్నారు. దాడి ఘటనలో ముద్దాయిలందరినీ తక్షణమే అరెస్టు చేసి, నాన బెయిలబుల్‌ కేసులు పెట్టి లోపలికి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు ఆనంద్‌, సురేష్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:34 AM