కందికుంట నిర్దోషి
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:41 PM
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
కేసులు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
కదిరి, మార్చి 22: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. తనపై ఉన్న రెండు కేసులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసిందని కందికుంట తెలిపారు. ఈ సందర్భంగా కదిరిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై సీసీ నంబర్ 2/2003, సీసీ నంబర్ 33/2007 కింద సీబీఐ నమోదు చేసిన కేసులను విచారించిన హైదరాబాదులోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి, గతంలో శిక్ష విధించారని తెలిపారు. ఆ తీర్పులపై తెలంగాణ హైకోర్టులో సీఆర్‌ఎల్‌ఏ 454/2016, సీఆర్‌ఎల్‌ఏ 1382/2017 ద్వారా అప్పీలు చేసుకున్నానని, దీంతో శిక్షలను నిలుపుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు 2018 అక్టోబరు 12న ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ఆ ఉత్తర్వులు ఈ రోజు వరకు కొనసాగుతున్నాయని, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తనపై నమోదైన కేసులను త్వరగా విచారించాలని కోర్టుకు విన్నవించానని తెలిపారు. తన అభ్యర్థన మేరకు కేసు విచారణ పూర్తి చేసిన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్.. రెండు అప్పీళ్లపై తీర్పు వెలువరించారని, సీబీఐ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారని తెలిపారు.