Share News

COUNTING: కళ్యాణదుర్గం నిర్మానుష్యం

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:39 PM

ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పట్టణంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత చేపట్టారు. ముందస్తుగా గొడవలు లేకుండా పోలీసులు కలియతిరుగుతూ సమాచారం ఇచ్చారు.

COUNTING: కళ్యాణదుర్గం నిర్మానుష్యం
Kalyanadurgam T-Circle is deserted

బోసిపోయిన బస్టాండు.. పోలీసుల పటిష్ట బందోబస్తు

కళ్యాణదుర్గం, జూన 4: ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పట్టణంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రత చేపట్టారు. ముందస్తుగా గొడవలు లేకుండా పోలీసులు కలియతిరుగుతూ సమాచారం ఇచ్చారు. పట్టణంలోని టీ సర్కిల్‌, వాల్మీకి సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, రింగ్‌ రోడ్డు, బళ్లారి మిట్ట ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ జనసంచారం లేకుండా చూశారు. సీఐ హరినాథ్‌ ఆధ్వర్యంలో పలు కాలనీలు, ప్రధాన వీధుల్లో సంచరిస్తూ విజయోత్సవ ర్యాలీలు, టపాసులు కాల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కంబదూరు మండలంలోని కురాకుల పల్లి, జల్లిపల్లి, కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లి గ్రామాల్లో అమిలినేని గెలుపుపై సంబరాలు చేసుకుంటూ ఆయా గ్రామాల గ్రామదేవతలకు జంతుబలి ఇచ్చారు. పల్లె ప్రాంతాల్లో సైతం సురేంద్రబాబు బ్యానర్‌ చేతపట్టుకుని నినాదాలు చేస్తూ ఊరేగింపులు చేపట్టారు. శాంతియుతంగా కౌంటింగ్‌ ప్రకియ్ర ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


మూతపడ్డ వ్యాపార సముదాయాలు

తాడిపత్రిటౌన: కౌంటింగ్‌ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. సీబీరోడ్డు, పుట్లూరురోడ్డు, యల్లనూరురోడ్డు, మెయినబజారు ప్రాంతాలన్ని నిర్మానుష్యంగా కనిపించాయి. ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రిలో రాళ్లదాడులు జరిగాయి. దీంతో 144సెక్షన అమలులో ఉండడంతో బయటకు ఎవరూ రాలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దినసరి కూరగాయల మార్కెట్‌ కూడా బోసిపోయింది.


యాడికి: ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పోలీసులు 144సెక్షన ప్రకటించడంతో యాడికి అంతా నిర్మానుష్యంగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాణిజ్య దుకాణాలన్ని మూతపడ్డాయి. సీఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jun 04 , 2024 | 11:39 PM