Share News

ఇలపై ఇంద్ర ధనుస్సు..

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:11 AM

: పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానం ముత్యాల ముగ్గులతో మురిసిపోయింది. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన’కు విశేష స్పందన లభించింది. రంగు రంగుల ముగ్గులు వేసేందుకు మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. ముందే వచ్చిన సంక్రాంతిని చూసేందుకు పట్టణ ప్రజలు తరలివచ్చారు.

ఇలపై ఇంద్ర ధనుస్సు..

ముగ్గులతో మురిపించిన నారీమణులు

పోటీలకు ఉత్సాహంగా తరలి వచ్చిన మహిళలు

పురంలో ఆంధ్రజ్యోతి -ఏబీఎన ముత్యాల ముగ్గుల పోటీలు

విజేతలకు బహుమతులను అందించిన నందమూరి వసుంధరదేవి

హిందూపురం, జనవరి 6: పట్టణంలోని ఎంజీఎం క్రీడామైదానం ముత్యాల ముగ్గులతో మురిసిపోయింది. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన’కు విశేష స్పందన లభించింది. రంగు రంగుల ముగ్గులు వేసేందుకు మహిళలు ఉత్సాహంగా తరలివచ్చారు. ముందే వచ్చిన సంక్రాంతిని చూసేందుకు పట్టణ ప్రజలు తరలివచ్చారు. ఏటా సంక్రాంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన ముత్యాల ముగ్గుల పోటీలకు నిర్వహించడాన్ని పాఠకులు, ప్రజలు అభినందించారు. ఈ వేడుకలో గంగిరెద్దులు, హరిదాసు సంకీర్తనలు, గాలిపటాలు, కోలాటాలు, గొబ్బెమ్మలు, పాలు పొంగించడం, చెరుకు మోసులు, అనపకాయలు, వేరుశనగకాయల అలంకరణ, శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పోటీలలో 304 మంది మహిళలు పాల్గొన్నారు. చిన్నారులు చిట్టి చేతలతో రంగవల్లులు వేశారు. మహిళలు కొంగు బిగించి అందాల హరివిల్లులను ఆవిష్కరించారు. న్యాయ నిర్ణేతలు సరస్వతి వెంకటేశ, రాజేశ్వరి కుమార్‌, శ్రీలక్ష్మి, లక్ష్మి అన్ని ముగ్గులను క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతిని హిందూపురం పట్టణంలోని మోడల్‌ కాలనీకి చెందిన ఉమాదేవి దక్కించుకున్నారు. రెండో బహుమతి పెనుకొండకు చెందిన శ్రీదేవి, మూడో బహుమతి పెనుకొండకు చెందిన పద్మావతి గెలుచుకున్నారు. వీరికి నందమూరి వసుంధరదేవి నగదు బహుమతులు, ప్రత్యేక బహుమతులను అందజేశారు. మరో పదిమందికి అతిథులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

సంస్కృతికి అద్దం పట్టేలా రంగవల్లులు

  • నందమూరి వసుంధరదేవి

ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి, ఏబీఎన ఆధ్వర్యంలో సంక్రాంతి పండగకు ముందు ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఆంధ్రజ్యోతి, ఏబీఎనవారు భావి తరాలకు అందిస్తున్నారని కొనియాడారు. వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎనబీకే సేవా సమితి ట్రస్ట్‌ వారు స్థానికంగా సహకారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూపురానికి వారం ముందే సంక్రాంతి శోభ వచ్చిందని అన్నారు. ముగ్గులను చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అప్పట్లో సంక్రాంతి పండగను ఎంతో గొప్పగా జరుపుకునేవారమని, ప్రస్తుతం అలాంటి పండగ హిందూపురంలో నేడు చూశానని అన్నారు. ఎంజీఎం మైదానంలో ఇంద్ర ధనస్సును తలపించేలా ముగ్గులు ఉన్నాయని అన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ పోటీలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ముగ్గులను చూస్తుంటే ఎవరికి బహుమతి ఇవ్వాలో ఎంపిక చేయడం కష్టసాధ్యమేనని అన్నారు. మైదానంలో ఉన్న ముగ్గుల రంగులన్నీ తన చీర రంగలను పోలి ఉన్నాయని చమత్కరించారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని, తమవంతు సహకారం అందిస్తామని అన్నారు.

చాలా ఆనందంగా ఉంది..

లోకేశ్వరి తనయుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ నుంచి హిందూపురానికి వచ్చామని, ఇక్కడ రంగవల్లులు చూసి చాలా ఆనందం వేసిందని అన్నారు. తను చిన్నప్పుడు తమ ఇంటి ముందు ఇలాంటి ముగ్గులను వేస్తుండేవారని, ఆ తరువాత ఇప్పుడే ఇలాంటి రంగవల్లులు చూస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. ఈ రంగవల్లులను నందమూరి బాలక్రిష్ణ చూసి ఉంటే మరింత ఆనందం వ్యక్తం చేసేవారని అన్నారు.

ఒకప్పుడు ముగ్గుల పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నామని, హిందూపురంలో ముగ్గుల పోటీలు ఆ రోజులను గుర్తుకు తెచ్చాయని బెంగళూరు నుంచి వచ్చిన అతిథి సుభాషిణి అన్నారు. అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వచ్చాక ముగ్గులు మరిచిపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన వారు ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, ఆయన సతీమణి శ్యామల, ఆంధ్రజ్యోతి బీఎం గోపాల్‌ నాయుడు, ఏబీఎన స్టాఫ్‌ రిపోర్టర్‌ సురేష్‌, ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ శంకర్‌, నాయకులు డాక్టర్‌ సురేంద్ర, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన లక్ష్మి, బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:11 AM