Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

కార్డుదారుల అసహనం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:16 AM

వైసీపీ పాలనలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, చక్కెర మాత్రమే అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుండగా, మార్కెట్‌ ధరతో సమానంగా అర కేజీ చక్కెర కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

 కార్డుదారుల అసహనం

ధర్మవరం, మార్చి 3: వైసీపీ పాలనలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, చక్కెర మాత్రమే అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుండగా, మార్కెట్‌ ధరతో సమానంగా అర కేజీ చక్కెర కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ రెండు సరుకులు కోసం ఎండీయూ వాహనం, దానికో సైరన, డ్రైవర్‌, మరో సహాయకుడు. వీధుల్లో ఆ వాహనం వద్ద కార్డుదారుల క్యూ...ఇదీ ప్రస్తుతం రేషన పంపిణీ తీరు. దీనిపై ప్రతి పక్షాలు, కార్డుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పేదలకు డోర్‌ డెలివరీ చేస్తానని వైసీపీ అధినేత జగన ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతు న్నా ఇప్పటికీ బియ్యం, చక్కెర మాత్రమే పేదలకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కందిపప్పు ఒక నెల ఇస్తే మళ్లీ ఎప్పుడు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. అది కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే అందుతుంది. ఎవరైనా కార్డుదారులు కంది పప్పు కావాలని అడిగినా లేదనే సమాధానం ప్రతీనెల ఎండీయూ వాహనదారుల నుంచి వస్తుంది. గోధుమ పిండి ప్యాకెట్లు అరకొరగా ఇస్తున్నా అవి కొద్ది రోజులకే పురుగు పడుతున్నాయి. దీంతో వినియోగదారులు వాటిని తీసుకోవడం లేదు. పామాయిల్‌ అసలే ఇవ్వడంలేదు. బియ్యానికి బదులుగా రాగులు/సజ్జలు/ జొన్నలు ఇచ్చేవారు. వాటికి కూడా వైసీపీ ప్రభు త్వం శుభం కార్డు వేసింది. ఇలా పేదలకు రేషన సరుకుల్లో కోతపెట్టి సబ్సిడీ రూపంలో భరించాల్సిన నిధులను దారి మళ్లిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేదలపై ఆర్థిక భారం

ప్రభుత్వ తీరుతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. కిలో కందిపప్పు రకాలను బట్టి బహిరంగ మార్కెట్‌లో రూ.170 పలుకుతోంది. రేషన డిపోల ద్వారా సరఫరా చేస్తే పేదలపై ఆర్థిక భారం తగ్గేది. టీడీపీ పాలనలో ప్రతినెల కిలో కందిపప్పు రూ.40లకే సరఫరా చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ధరను రూ.67కి పెంచింది అయినా అందరికీ కందిపప్పును సక్రమంగా ఇవ్వడంలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కిలో పంచదార రూ.14కు ఇచ్చేవారు. జగన దానిని అరికిలోకు పరిమితం చేశారు. పైగా ధరను మార్కెట్‌ ధరతో సమం చేశారు. అప్పుడు రాగులు, జొన్నలు వంటివి కూడా రాయితీపై కార్డుదారులకు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Mar 04 , 2024 | 12:16 AM