విచ్చలవిడిగా కలప అక్రమ రవాణా!
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:58 PM
వాతావరణం కలుషితం కాకుండా మానావళిని కాపాడుతున్న పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. యథేచ్ఛగా కలపను తరలిస్తున్నారు.

యథేచ్ఛగా చెట్ల నరికివేత
మామూళ్లమత్తులో అటవీశాఖ అధికారులు
ట్రాక్టర్ లోడుకు రూ.500 వసూలు
హిందూపురం అర్బన, జనవరి 12: వాతావరణం కలుషితం కాకుండా మానావళిని కాపాడుతున్న పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. యథేచ్ఛగా కలపను తరలిస్తున్నారు. వేసవిలో నీడనిచ్చే చెట్లు కనుమరుగు అవుతున్నాయి. ప్రతి రోజూ హిందూపురం సామిల్లులకు, ఇటుక బట్టీలకు, తూమకుంట పారిశ్రామిక వాడకు టన్నులకొద్దీ కలప తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ట్రాక్టర్‌లు, లారీల్లో కలప తరలిస్తున్నా అటవీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి వ్యాపారాలు చేస్తున్నారంటే అధికారులు ఏ మేరకు వ్యాపారులతో లాలూచి పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజు పోచనపల్లి, శ్రీకంఠపురం, పరిగి పెనుకొండ రోడ్డు మార్గాల్లో కలప తరలుతోంది. చీకటి పడగానే కలప తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఒక ట్రాక్టర్ లోడుకు రూ.500, లారీకి రూ.1500 వసూలు చేస్తున్నట్లు వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేనిపక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి ట్రాక్టర్‌ను సీజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా చెట్లు నరికివేయడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంటపొలాల్లో వెంచర్ల వేసేందుకు అడ్డువస్తున్న చెట్లను నరికివేస్తున్నారు. అడవులు, పంటపొలాలు, తోటలు కనుమరుగు అవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు చెట్ల నరికివేతను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
ఊళ్లలోకి జంతువులు
చెట్లను నరికివేయడం, అడవులను ధ్వంసం చేస్తుండటంతో జంతువులు ఆసరా కోల్పోయి ఊళ్లలోకి వస్తున్నాయి. నిత్యం చిరుతలు, ఎలుగుబంట్లు ఊళ్లలో సంచరిస్తున్న విషయాలు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇక జింకలు, దుప్పిలు, నెమళ్లు మేత కోసం పంటపొలాలవైపు వస్తున్నాయి. అడవులు నాశనం చేయడంతోనే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.
విచారించి.. చర్యలు తీసుకుంటాం
ప్రతి రోజూ ట్రాక్టర్లు, లారీల ద్వారా కలప తరలుతోందనే విష యం తెలియదు. హిందూపురం ప్రాంతంలో మకాం వేసి కలప నరికివేయకుండా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా అక్రమంగా కలప నరకడం, తరలించడం వంటివాటిని అరికడతాం. పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పారిశ్రామిక ప్రాంతంలో వంటచెరకు సరఫరా చేసుకుంటున్న ఫ్యాక్టరీలపై దాడులు చేసి చర్యలు చేపడతాం. -శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజి అధికారి