Share News

NURSERY: పుట్టగొడుగుల్లా అక్రమ నర్సరీలు..!

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:48 PM

జిల్లా వ్యాప్తంగా అక్రమ నర్సరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ నర్సరీల్లో నాసిరకం మొక్కలు(నారు) రైతులకు విక్రయిస్తూ వ్యాపారులు ముంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో పలు నర్సరీల్లో టమోటా, మిరప, వంకాయ నారులను కొనుగోలు చేసి నాటి నష్టపోయిన రైతులు కోకొల్లలు.

NURSERY: పుట్టగొడుగుల్లా అక్రమ నర్సరీలు..!
Nursery in Kothacheruvu

నష్టపోతున్న రైతులు

పట్టించుకోని ఉద్యానశాఖ అధికారులు

కొత్తచెరువు, జూన 23: జిల్లా వ్యాప్తంగా అక్రమ నర్సరీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ నర్సరీల్లో నాసిరకం మొక్కలు(నారు) రైతులకు విక్రయిస్తూ వ్యాపారులు ముంచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో పలు నర్సరీల్లో టమోటా, మిరప, వంకాయ నారులను కొనుగోలు చేసి నాటి నష్టపోయిన రైతులు కోకొల్లలు. అయితే వీటిని పర్యవేక్షించాల్సిన ఉద్యాన అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. దీంతో నర్సరీలు యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. జిల్లాలో 300 వరకు నర్సరీలు ఉన్నాయి. ఇందులో కొత్తచెరువు మండల పరిసరాల్లోనే 10 వరకు వెలిశాయి. మండలంలో పదేళ్ల నుంచి ఖరీఫ్‌, రబీ సీజనలలో టమోటా, మిరప పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా 8 వేల నుంచి 10 వేల ఎకరాలలో కూరగాయల పంటలను సాగుచేస్తున్నారు. వేరుశనగ, వరి తదితర పంటలు సాగు చేస్తూ నష్టపోతున్న రైతులు కూరగాయల పంటలపై మక్కువ చూపుతున్నారు. వర్షాలు కురవకపోవడం, వ్యవసాయ బావులు, బోర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడంతో చాలా మంది రైతులు ఎకరా, రెండెకరాలు కూరగాయల పంటలసాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు నర్సరీ వ్యాపారులు నాసిరకం నారును విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొంత మంది రైతులు నర్సరీ యజమానులపై పోలీ్‌సస్టేషనలో కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఏటా లక్షల్లో వ్యాపారం సాగిస్తూ దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయు. ఈ అక్రమ నర్సరీలపై అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతోనే వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.


అనుమతులు తప్పనిసరి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఉద్యాన శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే జిల్లాలో చాలా మంది నర్సరీ వ్యాపారులు అనుమతులు తీసుకోకుండానే ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నర్సరీల్లో నాసిరకం టమోటా, మిరప తదితర కూరగాయల మొక్కలను విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతులు ఏటా పంటలు నష్టపోతూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు. అయితే నర్సరీలు నిర్వహణ, మొక్కలపెంపకంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉద్యాన శాఖఅధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ నర్సరీలపై పర్యవేక్షణ చేస్తూ వాటిపై చర్యలుతీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


అక్రమ నర్సరీలపై చర్యలు తీసుకుంటాం

సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా నడుపుతున్న నర్సరీలపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. నాసిరకం కూరగాయల మొక్కలు విక్రయిస్తున్న నర్సరీల లైసెన్సలను రద్దు చేస్తాం. నష్టపోయిన రైతులు ఫిర్యాదు చేస్తే ఆ నర్సరీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

- చంద్రశేఖర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

Updated Date - Jun 23 , 2024 | 11:48 PM